బాబుపై వత్తిడి...లాజిక్కేగా....??

Update: 2018-12-17 11:00 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై తీవ్ర వత్తిడి వస్తోంది. అది ఎక్కడి నుంచో కాదు సొంత పార్టీ నేతల నుంచే..అందుకు కారణం కూడా లేకపోలేదు. తెలంగాణ ఎన్నికల ఫలితాలతో ఏపీ టీడీపీ నేతలు మాత్రం చంద్రబాబు పై వత్తిడి తేవాలనే అనుకుంటున్నారు. తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు అనుసరించిన స్ట్రాటజీ వర్క్ అవుట్ అయింది. ముందుగానే అభ్యర్థులను ప్రకటించి మూడు నెలల నుంచి మూడు దఫాలు గడగడపకూ తిరిగి ఓట్లు అడిగే పరిస్థితిని కేసీఆర్ అక్కడి అభ్యర్థులకు కల్పించారు. దీంతో నియోజకవర్గంలో శత్రువులను మిత్రులుగా చేసుకోవడానికి సమయం చిక్కింది.

ముందుగానే ప్రకటిస్తే.....

అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలన్న డిమాండ్ తెలుగుదేశం పార్టీలో పెరుగుతోంది. సాధారణంగా నామినేషన్లకు నాలుగైదు రోజులు ముందు అభ్యర్థులను ప్రకటించే సంప్రదాయం తెలుగుదేశం పార్టీలో ఉంది. చంద్రబాబు నాయుడుకూడా వివిధ సర్వేల ఆధారంగా ప్రత్యర్థి సామాజిక వర్గం, ఆర్థిక సామర్థ్యం వంటివి పరిశీలనలోకి తీసుకున్న తర్వాతే అభ్యర్థులను ఎప్పుడైనా ప్రకటిస్తూ వస్తున్నారు. ప్రత్యర్థి పార్టీని చిత్తు చేయగల అభ్యర్థికే అవకాశమివ్వాల్సి ఉన్నందున టీడీపీలో నామినేషన్ చివరి ఘడియల వరకూ అభ్యర్థులెవరనీ ప్రకటించరు.

వారిని పక్కనపెట్టి.....

అయితే తెలంగాణలో కేసీఆర్ అనుసరించిన విధానాన్ని ఇక్కడా అప్లై చేయాలన్నది తెలుగు తమ్ముళ్ల డిమాండ్. చంద్రబాబు ఎటూ ఇంటలిజెన్స్, ప్రయివేటు ఏజెన్సీలతో సర్వేలు చేయిస్తున్నారు. దాదాపు 30 నుంచి 40 మంది వరకూ సిట్టింగ్ లను మార్చేందుకు అవకాశముందన్నట్లు వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు సర్వేల్లో ప్రజల్లో అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలను పక్కన పెట్టి మిగిలిన అభ్యర్థుల పేర్లను ముందుగా ప్రకటించాలని చాలా మంది నేతలు కోరుతున్నారు. ఇంకా ఎన్నికలకు ఆరు నెలలే సమయం ఉండటంతో జనవరి నెలాఖరుకు అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తే తాము ప్రజలకు చెంతకు వెళతామని అంటున్నారు. ఇప్పటికే మంత్రి నారాలోకేష్ వద్ద సీనియర్ టీడీపీ నేతలు ఈ ప్రతిపాదన ఉంచినట్లు తెలుస్తోంది.

పొత్తులపై స్పష్టత లేకపోవడంతో....

కానీ చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తారా? లేక తెలంగాణలో మాదిరిగా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని వెళతారా? అన్నదానిపై స్పష్టత లేదు. మరోవైపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, జనసేనాని పవన్ కల్యాణ్ లు ఎలాంటి వ్యూహాలురచిస్తారో తెలియదు. దీంతో ముందుగానే అభ్యర్థులను ప్రకటించేందుకు అవకాశాలు తక్కువేనని పార్టీ అధినేత నుంచి సమాచారం వచ్చినట్లుతెలుస్తోంది. ప్రతి ఒక్కరూ తాము అభ్యర్థి అని ప్రజల వద్దకు ఇప్పటి నుంచే వెళ్లి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించాలని, అప్పటికి ఎవరు సమర్థులని తేలితే వారికేటిక్కెట్లు ఇస్తామని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. మొత్తం మీద కేసీఆర్ లాగా ముందుగానే అభ్యర్థులను ప్రకటించే అవకాశం లేదంటున్నాయి టీడీపీ వర్గాలు.

Similar News