లోకేష్ కు ఆ ఛాన్స్ ఎప్పుడంటే..?

Update: 2018-12-14 14:30 GMT

రెండు తెలుగు రాష్ట్రాలు వేరైనా రాజకీయ పరంగా కొన్ని పోలికలున్నాయి. అక్కడ చంద్రబాబునాయుడు, ఇక్కడ చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రులుగా ఉన్నారు.ఇద్దరూ తమ రాజకీయ వారసులను అరంగేట్రం చేయించేశారు. కేసీఆర్ కుమారుడు కె.టి.రామారావు విదేశాల్లో ఉన్నత ఉద్యోగాన్ని వదులుకుని తెలంగాణ ఉద్యమంలో భాగస్వామిగా మారారు. ఆ తర్వాత ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. నాలుగు సార్లు కేటీఆర్ ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి 2014లో రావడంతో మంత్రి అయి ముఖ్యమైన పురపాలక, ఐటీ శాఖలను సమర్ధవంతంగానిర్వహించారు. ఈరోజే కేసీఆర్ ఆయనకు ప్రమోషన్ కూడా ఇచ్చారు. పార్టీ బాధ్యతలను కేటీఆర్ కు పూర్తిగా అప్పగించారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత.....

ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయానికి వస్తే అక్కడ చంద్రబాబునాయుడు 2014 అధికారంలోకి రాగానే తనయుడు లోకేష్ ను రాజకీయాల్లోకి తీసుకురాలేదు. అప్పటి వరకూ వెనక నుంచి పార్టీని నడిపిస్తున్న నారా లోకేష్ ను రెండేళ్ల క్రితమే ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేశారు. అది కూడా తొలుత ఎమ్మెల్సీని చేసి ఆ తర్వాత మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఆయనకు కూడా కీలకమైన ఐటీ, పంచాయతీ రాజ్ శాఖలను చంద్రబాబు అప్పగించారు. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను చూస్తుంటే భవిష్యత్తులోనూ ఏపీలో కూడా సేమ్ సీన్ ఉంటుందన్నది పరిశీలికుల భావన.

ముందు చూపుతో.....

కేసీఆర్ ఇప్పుడు ఫ్రీ అయ్యారు. ఆయనకు ఎటువంటి బాదరాబందీ లేదు. తనయుడిని అందలం ఎక్కించడమే ఆయన ముందున్న లక్ష్యం. కావాల్సిన మెజారిటీ ఉంది. అందుకే ఆయన ముందు పార్టీ పగ్గాలు, ఆతర్వాత ప్రభుత్వ పగ్గాలు అప్పగించేందుకు సిద్ధమయ్యారు. కేటీఆర్ గత నాలుగేళ్ల నుంచే పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు సయితం ముఖ్యమైన పని మీద కేటీఆర్ ను కలవాల్సిందే. జిల్లా స్థాయి కమిటీలు కూడా కేటీఆర్ సిఫార్సు మేరకే జరిగాయంటారు. ఇప్పుడు పూర్తిగా పార్టీ చేతులోకి వచ్చింది కాబట్టి నేతలంతా కేటీఆర్ గ్రిప్ లోనే ఉంటారు. తర్వాత ముఖ్యమంత్రిని చేసినా పెద్దగా అసంతృప్తులుండవన్నది కేసీఆర్ ఆలోచన.

ఈసారి గెలిస్తేనే......?

అయితే ఆంధ్రప్రదేశ్ లో ఇందుకు భిన్నమైన పరిస్థితులున్నాయి. 2019లో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగనున్నాయి. ఈఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిస్తేనే నారా లోకేష్ కు ముఖ్యమైన పదవి దక్కుతుంది. చంద్రబాబు నాయుడి అంతిమ లక్ష్యం కూడా అదే. కొడుకును సీఎం సీటులో కూర్చోబెట్టి తాను జాతీయ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలని భావిస్తున్నారు. అందుకోసమే ఇప్పుడు బీజేపీయేతర కూటమి అంటూ అన్ని రాష్ట్రాలూ తిరుగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో నారా లోకేష్ పోటీ చేస్తారా? లేదా? అన్నది ఇంకా తెలియలేదు. పార్టీ మొత్తం ఇప్పటికే లోకేష్ కనుసన్నల్లో నడుస్తోంది. అయితే వచ్చే ఎన్నికల్లో గెలిస్తేనే కాస్త అటు ఇటుగానైనా లోకేష్ ముఖ్యమంత్రి కావడం ఖాయమంటున్నారు. మొత్తం మీద కేటీఆర్ కు పట్టిన అదృష్టం లోకేష్ కు ఎప్పుడు పడుతుందోనని చినబాబు అనుచరులు ఆశగా ఎదురుచూపులు చూస్తున్నారు.

Similar News