టెన్ష‌న్‌.. టెన్ష‌న్‌! రీజ‌న్ ఇదే..!!

Update: 2018-12-09 11:00 GMT

దేశ‌వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ‌ను రేపిన తెలంగాణా ఎన్నిక‌లు చెదురు మదురు ఘ‌ట‌న‌లు మిన‌హా ప్ర‌శాంతంగా ముగిశాయి. ఇక‌, ఇప్పుడు కొన్ని కోట్ల క‌ళ్లు మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించే రిజ‌ల్ట్‌పైనే దృష్టి పెట్టాయి. ఈ రిజ‌ల్ట్ ఎవ‌రికి అనుకూలంగా వ‌స్తుంది? ఎవ‌రికి ప్ర‌తికూలంగా వ‌స్తుంద‌నే టెన్ష‌న్ స‌హ‌జంగానే తెలంగాణాలో నేత‌ల‌కు, ప్ర‌జ‌ల‌కు కూడా ఉత్కంఠ‌గానే ఉంది. ముఖ్యంగా తెలంగాణా సీఎం కేసీఆర్ శిబిరంలోనూ ఉత్కంఠ రాజ్య మేలుతోంది. అయితే, వీట‌న్నింటికీ భిన్నంగా ఇప్పుడు తెలంగాణాలో ఉన్న టెన్ష‌న్ క‌న్నా ఎక్కువ‌గా ఏపీ సీఎం చంద్ర‌బాబు టెన్ష‌న్ గా ఫీల‌వుతున్నా రు. తెలంగాణాలో వ‌చ్చే రిజ‌ల్ట్‌పై ఆయ‌న వెయ్యి క‌ళ్ల‌తో ఎదురు చూస్తున్నారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం ఏంటి? ఆయ‌న కేవ‌లం 12 స్థానాల‌లోనే క‌దా పోటీ చేసింది? అనే సందేహాలు స‌హ‌జం. నిజ‌మే. చంద్ర‌బాబు కాంగ్రెస్‌తో జ‌ట్టుక‌ట్టి.. తెలంగాణా ఎన్నిక‌ల్లో కేవ‌లం 12 స్థానాల్లోనే పోటీ చేశారు.

లక్ష్యం నెరవేరుతుందా?

వాస్త‌వానికి కూట‌మి పొత్తులో భాగంగా 13 స్థానాలు ద‌క్కినా.. చివ‌రి నిముషంలో ఇబ్ర‌హీంప‌ట్నంలో కాంగ్రెస్ చెయ్యిచ్చింది. దీంతో ఇక్క‌డ టీడీపీ అభ్య‌ర్థి డ‌మ్మీగా మారిపోయారు. దీంతో 12 చోట్ల మాత్ర‌మే టీడీపీ రంగంలోకి దిగిన‌ట్ట‌యింది. అయితే, ఈ 12 చోట్ల కూడా టీడీపీ గెలిచినా కూడా చంద్ర‌బాబు ల‌క్ష్యం నెర‌వేరదు. చంద్ర‌బాబు.. నేరుగా వెళ్లి కాంగ్రెస్‌తో చేతులు క‌ల‌ప‌డంలో ఉన్న ల‌క్ష్యం చాలా సుదీర్ఘం.. సుదూరం కూడా! తెలంగాణాలో కేసీఆర్‌ను గ‌ద్దె దించాల‌నేది చంద్ర‌బాబు ప్ర‌థ‌మ ల‌క్ష్యం. అదేస‌మ‌యంలో త‌న పార్టీని అక్క‌డ గెలిపించుకోవ‌డం ద్వారా త‌న హ‌వాను తిరిగి ప్రారంభించాల‌నేది రెండో ల‌క్ష్యం. ఈ రెండు ల‌క్ష్యాల్లో రెండోది కుద‌ర‌క‌పోయినా.. అంటే త‌న పార్టీ త‌ర‌ఫున తెలంగాణాలో పోటీ చేసిన వారిలో స‌గానికి స‌గం మంది ఓడిపోయినా .. చంద్ర‌బాబుకు ఇబ్బంది లేదు. కానీ, కేసీఆర్ ప్ర‌భుత్వం మాత్రం గ‌ద్దె నెక్క‌కూడ‌దు. అలా కాకుండా టీడీపీకి మొత్తం అన్ని స్థానాల్లోనూ అంటే 12 స్థానాల్లోనూ గెలుచుకున్నా.. కేసీఆర్ అధికారంలోకి వ‌స్తే మాత్రం బాబు ల‌క్ష్యం నెర‌వేరన‌ట్టే!

కసి తీర్చుకునేందుకు....

చంద్ర‌బాబు ల‌క్ష్యం కేసీఆర్‌ను గ‌ద్దె దింప‌డం, అది కూడా కాంగ్రెస్‌తో క‌లిసి ప్రజాకూట‌మి గా ఏర్ప‌డి ఆయ‌న ఇక్క‌డ చ‌క్రం తిప్ప‌డం. దీని వెనుక బాబు ప్ర‌ధాన ఉద్దేశం.. ఏనాడు త‌న‌ను ఎమ్మెల్సీ ఎన్నిక‌ల విష‌యంలో ఓటుకు నోటు కేసు తెర‌మీదికి వ‌చ్చి.. హైద‌రాబాద్‌ను విడిచి పెట్టాల‌నే ష‌రుతు కేసీఆర్ పెట్టాడో.. ఇప్పుడు క‌నుక కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వ‌స్తే.. తాను తిప్పిన చ‌క్రం వ‌ల్లే కేసీఆర్ గ‌ద్దె దిగాడ‌నే విష‌యాన్ని ఆయ‌న ప్ర‌చారం చేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. అంటే.. కేసీఆర్‌పై ఉన్న క‌సి ఆ విధంగా తీర్చుకునే ఛాన్స్ ఉంటుంది. ఇక‌, కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకు వ‌చ్చింది తానేన‌ని చెప్పుకొనేందుకు కూడా బాబుకు అవ‌కాశం ఉంటుంది. ఇది, రేపు వ‌చ్చే ఏడాది జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఒక‌వేళ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే.. అక్క‌డ చ‌క్రం తిప్పేందుకు ఉపయోగ ప‌డుతుంది. దీనికంటే ముందు.. తెలంగాణాలో క‌నుక కాంగ్రెస్‌తోకూడిన మ‌హా కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాటైతే..

హోదా వస్తుందని చెప్పి.....

దీనిని చూపించి ఏపీలో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించే ఛాన్స్ ఉంటుంది. తెలంగాణాలో ఎలాగూ కాంగ్రెస్ వ‌చ్చింది కాబ‌ట్టి.. కేంద్రంలోనూ కాంగ్రెస్ వ‌స్తే.. ఏపీకి ప్ర‌త్యేక హోదా వ‌స్తుంద‌ని త‌ద్వారా ఏపీ అభివృద్ధి చెందుతుంద‌ని చెప్పుకొనేందుకు చంద్ర‌బాబుకు అవ‌కాశం ఉంటుంది. అలా కాని ప‌క్షంలో బాబుతో పొత్తు పెట్టుకుని మేం న‌ష్ట‌పోయామ‌ని చెప్పుకొనే అవ‌కాశం కాంగ్రెస్‌కు, కాంగ్రెస్‌తో జ‌ట్టు క‌ట్ట‌డాన్ని ప్ర‌జ‌లు హ‌ర్షించ‌లేద‌ని చెప్పుకొనేందుకు చంద్ర‌బాబు ప్ర‌య‌త్నించ‌డం త‌ప్ప మిగిలేది లేక‌పోగా.. ఈ ప‌రిణామం తాలూకు ఎఫెక్ట్ ఏపీపై ప‌డే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇక‌, తెలంగాణాలో పోయిపోయి.. టీడీపీతో పొత్తు పెట్టుకున్నా కాంగ్రెస్ గెల‌వ‌క‌పోతే..వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కేంద్రంలో కాంగ్రెస్ గెలిచే ప‌రిస్థితి కూడా ఉండ‌ద‌నేది మ‌రోమాట‌! ఇలా ఎలా చూసినా.. కేసీఆర్ క‌న్నా కూడా తెలంగాణాలో రిజ‌ల్ట్‌పై చంద్ర‌బాబుకే ఎక్కువ టెన్ష‌న్ ప‌ట్టుకుంద‌న‌డంలో సందేహం లేదు!!

Similar News