ఆ సాహసం చేయగలరా...?

Update: 2018-12-08 05:00 GMT

తెలంగాణ ఎన్నికలు చంద్రబాబు పీకల మీదకొచ్చినట్లుంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కె.చంద్రశేఖర్ రావు గెలుస్తారో? లేదో? పక్కన పెడితే పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మాత్రం తెలంగాణ ఎన్నికలు కఠిన పరీక్షను పెట్టబోతున్నాయని చెప్పకతప్పదు, ఆంధ్రప్రదేశ్ లోనూ ఎన్నికలకు పెద్దగా సమయం లేదు. ఇంకా ఆరు నెలలు మాత్రమే టైం ఉంది. అయితే చంద్రబాబు వివిధ సంస్థల చేత చేయిస్తున్న సర్వేలు, రియల్ టైం గవర్నెన్స్ ద్వారా వస్తున్న ఫిర్యాదులను చూస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నది అర్థమవుతుంది.

బాబుపై వ్యతిరేకత లేకున్నా....

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం చంద్రబాబునాయుడిపై వ్యక్తిగతంగా పెద్దగా వ్యతిరేకత లేదు. ఆయన కాంగ్రెస్ తో తెలంగాణలో పొత్తు పెట్టుకున్నప్పటికీ ఏపీలో పెద్దగా వ్యతిరేకత కనపడలేదు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీని గత ఎన్నికల్లోనూ ఏపీ ప్రజలు శాస్తి చేశారు. ఇప్పుడు దానిపై అంత వ్యతిరేకత కన్పించడం లేదు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే ముందే గత రెండు నెలలుగా చంద్రబాబు కాంగ్రెస్ పార్టీని వెనకేసుకొస్తున్నారు. అసలైన శత్రువు బీజేపీయేఅన్నది ఆయన ప్రొజెక్ట్ చేస్తూ రావడంతో తెలంగాణలో పొత్తు పెట్టుకున్నా ఏపీలో దాని ప్రభావం లేకుండా చంద్రబాబు తన రాజకీయ చతురతను ఉపయోగించారు.

కేసీఆర్ ఇవ్వడంతో....

అయితే తెలంగాణలో అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె. చంద్రశేఖర్ రావు సిట్టింగ్ లందరికీ దాదాపుగా సీట్లు ఇచ్చేశారు. అయితే చంద్రబాబుకు అది సాధ్యం కాదు. ఎందుకంటే కాంగ్రెస్ తో పొత్తు ఒకవైపు ఉండగా, ఎక్కువ మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చకుంటే ఈసారి ప్రభుత్వం ఏర్పాటుచేయడం కష్టమేనన్నది సర్వేలు తేల్చడం. అందువల్ల దాదాపు ముప్ఫయి నుంచి నలభై మంది వరకూ ఎమ్మెల్యేలను మార్చాల్సి ఉంటుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారిస్తే ఏం జరుగుతుందో పక్కన ఉన్న తెలంగాణలో చూశాం. వాళ్లు బీఎస్పీయో, మరో పార్టీకో వెళ్లి అక్కడి నుంచి పోటీ చేయడం ఖాయం. రెబల్స్ గానైనా బరిలోకి దిగే అవకాశముంది.

బలంగా ఉన్న సిట్టింగ్ లు....

అందుకే చంద్రబాబు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎటూ వెళ్లకుండా చివరి నిమిషంలో అభ్యర్థులను ప్రకటిస్తారన్నది ఆ పార్టీ నేతల నుంచి విన్పిస్తున్న మాట. ఎంత చివరి నిమిషంలో ప్రకటంచినా రెబల్స్ గా బరిలోకి దిగితే ఏమీ చేయలేని స్థితి. చంద్రబాబునాయుడు తన వ్యూహం ప్రకారం ఈసారి ఐదారు జాబితాలను విడతల వారీగా విడుదలచేస్తారన్న టాక్ ఆ పార్టీలో బలంగా విన్పిస్తోంది. ఇప్పటికే కొందరి ఎమ్మెల్యేలకు చంద్రబాబు పరోక్ష సంకేతాలిస్తూ వస్తున్నారు. అయితే సిట్టింగ్ లందరూ ఆర్థికంగా బలంగా ఉండటం, నియోజకవర్గంలో కొంత క్యాడర్ , ఓటు బ్యాంకును కలిగి ఉండటంతో చంద్రబాబు ఆ సాహసానికి ఒడిగడతారా? అన్న అనుమానం కూడా ఉంది. కానీ సిట్టింగ్ లను మార్చకుంటే అధికారంలోకి రావడం కల్ల అని ఆయన ముందున్న సర్వేనివేదికలు ఎప్పటికప్పుడు బాబుకు గుర్తు చేస్తూనే ఉన్నాయంటున్నారు నేతలు. మరి ఏం చేస్తారో చూడాలి.

Similar News