అదే మంత్రం...అక్కడ పనికిరాదట...!!!

Update: 2018-12-22 12:30 GMT

అన్ని చోట్లా అదే మంత్రం... కాని ఒక్కచోట మాత్రం ఆయన అడ్డం తిరుగుతున్నారు. ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ పేపర్లు పెట్టాలంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయిలో ఉద్యమానికి దిగబోతోంది. అన్నింటా టెక్నాలజీ పాట పాడే చంద్రబాబు ఈవీఎంల విషయంలోకి వచ్చేసరికి మాట మారుస్తున్నారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం సులువని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలతో ఇది తేలిపోయిందని బాబు గట్టిగా విశ్వసిస్తున్నారు. తన రాజకీయ జీవితంలో ఏ ఎన్నికల్లోనూ అభ్యర్థులకు ఇంత భారీ మెజారిటీలు రావడం చూడలేదని, ట్యాంపిరింగ్ కారణంగానే అన్ని ఓట్లు వచ్చాయని తెలుగుదేశం పార్టీ బలంగా నమ్ముతోంది.

టెక్నాలజీని ఆహ్వానిస్తున్నా....

అందుకోసమే త్వరలోనే ఈవీఎంల స్థానంలో జాతీయ స్థాయిలో ఉద్యమం చేపట్టాలని చంద్రబాబు నిర్ణయించారు. ప్రజాస్వామ్యాన్ని టెక్నాలజీ చేతుల్లో పెట్టకూడదని ఆయన గట్టిగా వాదిస్తున్నారు. మరో నాలుగైదు నెలల్లో పార్లమెంటు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఈవీఎంల ట్యాంపరింగ్ కు పాల్పడుతుందన్న సందేహం బాబులో స్పష్టంగా కనిపిస్తోంది. అదే జరిగితే తాము తీవ్రంగా నష్టపోతామని భావిస్తున్న చంద్రబాబు జాతీయ స్థాయిలో ఈవీఎంలకు వ్యతిరేకంగా ఉద్యమం చేయాలని నిర్ణయించారు. టెక్నాలజీని తాను ఆహ్వానిస్తానని, అయితే ప్రజాస్వామ్యాన్ని మాత్రం దాని చేతుల్లో ఉంచకూడదని ఆయన పలు సమావేశాల్లో తన అభిప్రాయాన్ని చెప్పేశారు.

నష్టం జరుగుతుందనేనా?

ఈవీఎంలపై అనేక అనుమానాలు ఉన్నాయంటున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. గతంలోనూ తాము ఈవీఎంలపై జాతీయ స్థాయిలో ఉద్యమం చేశామన్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. సాధారణంగా చంద్రబాబు ఒక అంశాన్ని చేపడితే అంత సులువుగా వదలరు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో తనకు నష్టం కల్గిస్తుందని అనుమానిస్తున్న ఈవీఎంలను తొలగించి దాని స్థానంలో బ్యాలెట్ పేపర్లను ఉంచాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం ఆయన త్వరలోనే జాతీయ స్థాయి నేతలను కలిసిన తర్వాత కేంద్ర ఎన్నికల కమిషన్ ను కూడా కలవనున్నట్లు సమాచారం.

కాంగ్రెస్ మాత్రం.....

ఈవీఎంలను సులువగా ట్యాంపరింగ్ చేయవచ్చంటున్నారు టీడీపీ నేతలు. తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెల్లడయిన తర్వాత తమకు ఈవీఎంలపై నమ్మకం పూర్తిగా పోయిందంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తమపై ఈవీఎంల ద్వారా కక్ష సాధించే అవకాశముందని చెబుతున్నారు. అయితే జాతీయ పార్టీ నేతలు చంద్రబాబుకు ఏమేరకు మద్దతిస్తరనేది ప్రశ్నార్థకంగా మారింది. కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో ఆ పార్టీ ఇప్పటికే ఈవీఎంలపై రచ్చ చేయడం అనవసరమన్న నిర్ణయానికి వచ్చింది. మరి జాతీయ స్థాయిలో చంద్రబాబు ఏ విధంగా ఉద్యమం చేయనున్నారో చూడాల్సి ఉంది.

Similar News