ఈ లెక్కలు మాకెందుకు..? జనం అసంతృప్తి..?

Update: 2018-12-24 05:00 GMT

రాష్ట్రంలో అబివృద్ది జ‌రుగుతోంద‌ని సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప‌దే ప‌దే చెబుతున్నారు. దీనికి సంబంధించి ఆయ‌న లెక్క‌లు కూడా చెబుతున్నారు. అంకెలు, సంఖ్య‌ల‌నుకూడా వివ‌రిస్తున్నారు అయితే, క్షేత్ర‌స్థాయిలో మాత్రం ప‌రిస్థితి ఇలా లేదు. ఈ లెక్క‌లు మాకెందుకు.. అని ప్ర‌శ్నిస్తున్న ప్ర‌జ‌ల సంఖ్య ఎక్కువ‌గా ఉంటోంది. ముఖ్యంగా కరువుతో అల్లాడుతున్న రాయ‌ల‌సీమ జిల్లాల్లో ప్ర‌జ‌లు ఇప్ప‌టికీ వ‌ల‌స బాట ప‌డుతున్నారు. దీనిని అరిక‌ట్టాల్సిన యంత్రంగా ఎవ‌రి ప‌నిలో వారు అన్న‌ట్టుగా బిజీగా ఉంది. అయితే, తాజాగా చంద్ర‌బాబు మాత్రం తాము సీమ ప్రాంతానికి ఎంతో చేస్తున్నామ‌ని గ‌ణాంకాలు బ‌య‌ట‌కు తీశారు. దీనిపై లేనిపోని విమ‌ర్శ‌ల‌ను ఆయ‌న మూట‌గ‌ట్టుకుంటున్నారు.

నదుల అనుసంధానంతో....

గోదావరి-కృష్ణా అనుసంధానం తో సీమ ప్రాంతానికి సమృద్ధిగా సాగు, తాగు నీటిని సరఫరా చేస్తున్నామని బాబు అంటున్నారు. యువతకు అత్యధిక ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఆటోమొబైల్‌ నుం చి ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ దాకా సీమలోనే స్థాపించేలా చూస్తున్నామని అంటున్నారు. ఇటు చెన్నై, అటు బెంగళూరుకు సమీపంలో భారీ పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు వస్తున్నారన్నారు. రాష్ట్రానికి రూ.15,73,172 కోట్ల పెట్టుబడులు తెచ్చే 2,632 పరిశ్రమలను ఆకర్షించగలిగామన్నారు. వీటి స్థాపన సాకారమైతే 33,03,671 మంది యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. ఇందులో రూ.6,30,457 కోట్ల పెట్టుబడులతో 1695 పరిశ్రమలు.. అనుమతుల నుంచి ఉత్పత్తి దశలో ఉన్నాయని.. వాటిలో 795 యూనిట్లు ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించాయని తెలిపారు.

కాగితాల మీదనేనా?

ఇంకో 638 పరిశ్రమలు డీపీఆర్‌ దశలో ఉన్నాయని తెలిపారు. భూ కేటాయింపుల దశకు చేరిన పరిశ్రమల ద్వారా 10, 23,782 మందికి ఉద్యోగావకాశాలు వస్తాయని చెప్పారు. ప్రారంభించిన పరిశ్రమల్లో రెండున్నర లక్షల మందికి పైగా ఉద్యో గాలు దక్కాయన్నారు. అయితే ఈ లెక్క‌ల‌ను ప్ర‌జ‌లు విశ్వ‌సించ‌డం లేద‌నేది వాస్త‌వం. పైకి బాబు చెబుతున్న లెక్క‌లు బాగానే ఉన్నా..క్షేత్ర‌స్థాయిలో మాత్రం ప్ర‌జ‌ల‌కు ఆశించిన మేర‌కు ఎక్క‌డా ఉపాధి క‌నిపించ‌డం లేదు. పైగా.. ఎక్క‌డిక‌క్క డ అవినీతి రాజ్య‌మేలుతోంది. దీనిని అరిక‌ట్ట‌కుండా ఏదో సాధిస్తాన‌ని చంద్ర‌బాబు చెప్ప‌డం కూడా హాస్యాస్పదంగానే ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఏదేమైనా ప్ర‌జ‌ల్లో సంతృప్తి స్థాయి పెర‌గాలంటే.. ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లోనే మార్పులు రావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటున్నారు. మ‌రి ఎన్నిక‌ల ముంగిట బాబు ఆదిశ‌గా ముందుకు వెళ్తారో లేదో చూడాలి.

Similar News