నల్లారి అట్టర్ ఫెయిల్ అయ్యారా?

Update: 2018-12-09 05:00 GMT

ప్రతి చోటా అదే జరుగుతుంది. ఇతర పార్టీలకు చెందిన నేతలను పార్టీలోకి తీసుకున్నప్పుడు వారు తమ వర్గానికే ప్రాధాన్యత ఖచ్చితంగా ఇస్తారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే అప్పటి వరకూ పార్టీకి సేవలందించిన నేతలకు మాత్రం కొత్తగా వచ్చిన వారి నుంచి తలనొప్పులు ప్రారంభమవుతాయి. పీలేరులో అదే జరిగింది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు పీలేరు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని తీసుకురావడం ఏమాత్రం తప్పుకాదు. బలంగా ఉన్న వైసీపీని ఓడించాలంటే నల్లారి లాంటినేతలు పీలేరుకు అవసరం. అందుకే తనకు శత్రువైనా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని చంద్రబాబు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

పట్టించుకోక పోవడం వల్లనే.....

అదే సమయంలో అప్పటి వరకూ పార్టీకి సేవలందించిన నేతకు చంద్రబాబు సహకారం అందించాల్సి ఉంది. పీలేరు నియోజకవర్గంలో పార్టీకి అండగా దశాబ్దకాలంగా ఇక్బాల్ అహ్మద్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. ఓటమి అనేది ఎవరి చేతుల్లో ఉండదు. ప్రజాభిప్రాయం ప్రకారం నడుచుకోవల్సిందే. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయించిన అభ్యర్థుల్లో ఇక్బాల్ అహ్మద్ ఒక్కరే మైనారిటీ వర్గానికి చెందిన వారు కావడం విశేషం. ఆయన ఓటమి పాలయినప్పుడే ఇక్బాల్ కు ఏదో ఒక పదవి ఇచ్చి ఉంటే సరిపోయేది.ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా గౌరవంగా ఉండేదని ఇక్బాల్ అనుచరులు చెబుతున్నారు.

నల్లారి కూడా పక్కన పెట్టడంతో....

పార్టీ కోసం దశాబ్దకాలం నుంచి పనిచేసి 2014 ఎన్నికల్లో ఖర్చు పెట్టుకున్నా ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయిందన్నది ఇక్బాల్ వాదనగా విన్పిస్తోంది. పైగా పదవి ఇవ్వకపోగా ఇక్బాల్ అహ్మద్ ను నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి దగ్గరకు కూడా రానిచ్చే వారు కాదట. తన వర్గం వారికి, తన వెంట పార్టీలోకి వచ్చిన వారితోనే ఎక్కువ సమయం కేటాయిస్తూ వారికే ప్రయోజనాలు చేకూరుస్తున్నారన్నది ఇక్బాల్ చేస్తున్న ఆరోపణ. తనను చంద్రబాబు నిలువునా ముంచారని ఆయన మీడియా సమావేశంలోనే చెప్పారంటే ఆయన ఆవేదన అర్థం చేసుకోవచ్చు.

ఇప్పుడు ఏం చేయాలి?

తనకు పదవి ఇవ్వకపోగా అప్పుడే చేరిన కిషోర్ కుమార్ రెడ్డికి నామినేటెడ్ పదవి ఇవ్వడాన్ని కూడా మహ్మద్ ఇక్బాల్ తప్పుపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిపోయారు. పీలేరులో ముస్లిం ఓటర్లు సంఖ్య గణనీయంగా ఉంది. ఇక్బాల్ అహ్మద్ ను పార్టీని వీడకుండా చేయడంలో నల్లారి ఫెయిల్ అయ్యారన్నది స్వపక్షం నుంచి విన్పిస్తున్న ఆరోపణ. ఎటూ పీలేరు టిక్కెట్ నల్లారిదే. అందులో ఎవరికీ అనుమానం లేదు. అలాంటప్పుడు ఇక్బాల్ కు సరైన రీతిలో గౌరవించి ఉండాల్సిందని పార్టీ నాయకత్వం కూడా అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మొత్తం మీద పీలేరు నియోజకవర్గంలో ఇక్బాల్ అహ్మద్ పార్టీని వీడటం పార్టీకే కాకుండా నల్లారికి కూడా కొంత ఇబ్బందేనన్నది పరిశీలకుల భావన.

Similar News