ఏ సైడో...డిసైడ్ చేసేది...???

Update: 2018-12-27 05:00 GMT

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో కీ రోల్ పోషించనున్నారా? దాదాపు మూడేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన అనుభవాన్ని కాంగ్రెస్ అధిష్టానం పరిగణనలోకి తీసుకోనుందా? వచ్చే ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లో కనీస స్థానాలను సంపాదించాలన్న వ్యూహంతో హస్తం పార్టీ ఉంది. తెలుగుదేశం పార్టీతో కొందరు ఏపీ కాంగ్రెస్ నేతలు వ్యతిరేకిస్తున్నప్పటికీ.. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం పొత్తు ఉండాల్సిందేనన్న నివేదికను అధిష్టానానికి పంపినట్లు తెలుస్తోంది. ఏపీలో కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకోకుంటే జరిగే నష్టాలు...పొత్తు పెట్టుకుంటే ఒనగూరే ప్రయోజనాలను గూర్చి సవివరంగా కాంగ్రెస్ హైకమాండ్ కు ఇప్పటికే తెలియజేసినట్లు సమాచారం.

తెలంగాణలో విఫలమయినా.....

తెలంగాణలో ఇప్పటికే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంది. మహాకూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి దిగినా అక్కడ అధికారంలోకి రాలేకపోయింది. త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లోనూ ఇదే మహాకూటమిని కంటిన్యూ చేయాలన్నది ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆలోచన. లోక్ సభ ఎన్నికల్లో అయినా తెలంగాణలో కూటమితో కసీనం పది స్థానాలను దక్కించుకోవాలన్నది కాంగ్రెస్ హైకమాండ్ భావన. అందుకే పార్లమెంటు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మహాకూటమితో కలసి నడుస్తుందన్నది దాదాపుగా తేలిపోయింది.

కొందరు వ్యతిరేకిస్తున్నా....

అయితే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మాత్రం కొందరు నేతలు పొత్తుకు అడ్డుపడుతున్నారు. కాని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం పొత్తు ఉంటే కనీసం నాలుగైదు పార్లమెంటు స్థానాలు దక్కించుకోవచ్చని చెబుతున్నారు. ఏపీ కాంగ్రెస్ లో అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులకు కొరత ఉందేమో కాని, పార్లమెంటు నియోజకవర్గాల అభ్యర్థులకు మాత్రం కొదవలేదు. ఉద్దండులు, సీనియర్ నేతలు ఉన్నారు. టీడీపీ కూడా కాంగ్రెస్ తో జత కలిస్తే ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోవచ్చని, జగన్ పార్టీకి చెందిన ఓట్లను కూడా చీల్చి ఏపీలో అధికారంలోకి వచ్చే అవకాశముందని కూడా కిరణ్ తన సన్నిహితుల వద్ద చెబుతున్నట్లు తెలుస్లోంది.

నల్లారి నివేదికతో.....

ఏపీలో కాంగ్రెస్ కు ఎంత లేదన్నా ఇప్పటికీ ఐదునుంచి ఏడు శాతం ఓట్లు పదిలంగా ఉన్నాయంటున్నారు కిరణ్ కుమార్ రెడ్డి. గత ఎన్నికల్లో రాష్ట్ర విభజన చేసినప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థులకు వచ్చిన ఓట్లను కూడా ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు. అప్పటికి, ఇప్పటికీ పరిస్థితులు మారిపోయాయని, ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పడంతో ప్రజలు కాంగ్రెస్ పై ఆగ్రహం చల్లారిందని, హోదా ఇవ్వని బేజీపీపైనే మండిపడుతున్నారని కిరణ్ అంటున్నారు. అందుకే ఏపీలోటీడీపీ, కాంగ్రెస్ కలసి పోటీ చేస్తే ఇటు రాష్ట్రంలో అధికారంలోకి వైసీపీ అధినేత జగన్ ను రానివ్వకుండా, అటు పార్లమెంటు స్థానాలను కూడా తమ ఖాతాలోకి వేసుకోవచ్చని కిరణ్ గణాంకాలతో చెబుతున్నారు. కిరణ్ గణాంకాలు చూసిన హైకమాండ్ పొత్తుతోనే ముందుకువెళ్లాలని డిసైడ్ అయినట్లు టాక్ విన్పిస్తోంది. మొత్తంమీద కిరణ్ చివర్లో పార్టీలో చేరినా డిసైడ్ చేసేది తానేనని అంటున్నారట.

Similar News