ముద్రగడ రెడీ అయిపోతున్నారు...!!

Update: 2018-12-09 06:30 GMT

సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం మళ్లీ సమర శంఖం పూరించనున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమ డిమాండ్లను సాధించుకోవడం కోసం ముద్రగడ మళ్లీ ఉద్యమ బాట పట్టనున్నారు. అయితే ఉద్యమ కార్యాచరణ ఎలా ఉండాలి? అన్న దానిపై ముద్రగడ చర్చలు జరుపుతున్నారు. ఉద్యమ కార్యాచరణపై క్లారిటీ వచ్చిన తర్వాత త్వరలోనే తూర్పు గోదావరి జిల్లాలో కాపు నేతలతో పెద్దయెత్తున సమావేశం పెట్టాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణను ముద్రగడ రూపొందిస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

కొంతకాలంగా మౌనంగా....

ముద్రగడ పద్మనాభం గత కొంతకాలంగా కాపు రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే గతంలో ఆయన కాపు రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ కిర్లంపూడి నుంచి అమరావతి వరకూ తలపెట్టిన పాదయాత్రను పోలీసులు అడ్డుకుని ఆయనను గృహ నిర్భంధంలో ఉంచారు. అప్పటి నుంచి ముద్రగడ మళ్లీ కాపు రిజర్వేషన్లపై ఎటువంటి ఉద్యమం చేయలేదు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకాపులకు రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. తమ చేతిలో ఏమీ లేదని,కేంద్ర ప్రభుత్వం ఆమోదించడమే తరువాయి అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెబుతున్నారు.

మరాఠాల బాటలోనే....

అయితే ఇటీవల మహారాష్ట్ర మరాఠాలు రిజర్వేషన్ల ఉద్యమంపై స్పందించిన అక్కడి సర్కార్ రిజర్వేషన్లు ఆమోదించడమే కాకుండా దాని కేంద్ర ప్రభుత్వానికి పంపారు. మంత్రి వర్గ ఉప సంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు. దాదాపు మూడేళ్లుగా మరాఠాలు తమకు రిజర్వేషన్లు కావాలని అక్కడ ఉద్యమిస్తున్నారు. ఎట్టకేలకు విద్యా, ఉపాధి రంగాల్లో మరాఠాలకు 16 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ శానసనభ ఆమోదం తెలియజేసింది. ఇక్కడ కూడా ఏపీలాగానే బంతిని కేంద్ర ప్రభుత్వం కోర్టులోకి నెట్టారు. అక్కడ మరాఠాలు మంత్రి వర్గం ఆమోదించినా ఇంకా ఆందోళనలు విరమించలేదు. తమకు రిజర్వేషన్లుఅమలయ్యేంత వరకూ ఉద్యమిస్తామని వారంటున్నారు. ఫలాలు దక్కేంత వరకూ పోరాటం ఆగదని కూడా చెబుతున్నారు.

త్వరలోనే ఉద్యమ కార్యాచరణ.....

ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉద్యమాన్ని నిలిపేస్తే ప్రయోజనం ఉండదని గ్రహించిన ముద్రగడ పద్మనాభం మరోసారి ఉద్యమానికి రెడీ అవుతున్నారు. ప్రధానంగా శాసనసభ లో ఆమోదం పేరిట కాపు జాతిని మోసం చేశారంటూ చంద్రబాబునే ఆయన టార్గెట్ చేసేలా కన్పిస్తోంది. రిజర్వేషన్ల తమ చేతిలో లేవన్న వై.ఎస్. జగన్ నుకూడా వదలకూడదని ముద్రగడ నిర్ణయించుకున్నారు. త్వరలోనే తూర్పు గోదావరిజిల్లాలో సమావేశం నిర్ణయించిన తర్వాత ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్నారు. ఎన్నికల సమయంలోనే తాము ఉద్యమంలోకి దిగి అనుకున్నది సాధించాలని భావిస్తున్నారు.మరి ముద్రగడ మలి విడత ఉద్యమం ఎలా ఉంటుందో చూడాలి.

Similar News