‘‘సీన్’’ సితారే...??

Update: 2018-12-24 09:30 GMT

సినిమాల‌కు-స‌మాజానికి మ‌ధ్య అవినాభావ సంబంధం చాలానే ఉంది! సినిమాల‌ను అనుస‌రించేవారు. నాయ‌కుల‌ను ఆరాధించేవారు ద‌క్షిణాది రాష్ట్రాల్లో చాలా మందే ఉన్నారు. గ‌తంలో ప్ర‌జ‌ల అభిమానాన్ని విశేషంగా చూరగొన్న ఎన్టీఆర్‌, ఎంజీఆర్‌, క‌రుణానిధి, జ‌య‌ల‌లిత వంటి కీల‌క నాయ‌కులు సినీ రంగం నుంచి వ‌చ్చిన వారే. సీఎంలుగా పీఠాలెక్కి.. ప్ర‌జ లను పాలించిన వారే! ఇలా సినీ రంగం నుంచి వ‌చ్చిన వారికి, సినిమాల‌కు కూడా ప్ర‌జ‌లు జేజే లు ప‌లికారు. క‌ట్ చేస్తే.. ఇప్పుడు అలాంటి నాయ‌కులు చాలా త‌గ్గిపోయారు. మెగాస్టార్ చిరంజీవిని ప్ర‌జ‌లు గుండెల్లో దాచుకున్నా.. ఆయ‌న‌ను మాత్రం రాజ‌కీయ నేత‌గా ప‌రిగ‌ణించేందుకు అంగీక‌రించ‌లేదు. స‌రే తర్వాత జ‌రిగిన ప‌రిణామాలు అంద‌రికీ తెలిసిందే.

ప్రతి కోణాన్ని....

ఇక‌, ఇప్పుడు మ‌రోసారి ప్ర‌జ‌ల‌పై భారీ రేంజ్‌లో సినిమాల ప్ర‌భావం రాజ‌కీయంగా ప‌డ‌నుంది! వ‌చ్చే నాలుగు మాసాల్లోనే ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గనున్నాయి. ఈ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న టీడీపీ, వైసీపీలు ప్ర‌తి కోణాన్ని త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించాయి. ఈ క్ర‌మంలోనే ప్ర‌జ‌ల్లో ఉన్న సినిమా సెంటిమెంటును త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేలా మూవీల‌కు రంగం సిద్ధం చేసుకున్నాయి. టీడీపీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర‌లోని కొన్ని కీల‌క రాజ‌కీయ సంఘ‌ట‌న‌ల‌తో అధికార పార్టీ టీడీపీ తెర‌చాటు స‌హ‌కారంతో ఆయ‌న కుమారుడు, ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ .. ఎన్టీఆర్.. క‌థానాయ‌కుడు చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఇది జ‌న‌వ‌రి 9న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

టీడీపీ ఓటు బ్యాంకును....

ఇది టీడీపీ ఓటు బ్యాంకును మ‌రింత‌గా పెంచ‌డంతో పాటు అన్న‌గారి అభిమానులు తిరిగి టీడీపీకి ఓటేసేలా చేస్తుంద‌ని టీడీపీ భావిస్తోంది. అయితే, ఇది జ‌న‌వ‌రిలో సంక్రాంతి ముంగిట విడుద‌ల‌కు సిద్ధం అవుతుండ‌గా... మ‌రో మూవీ ఎన్టీఆర్‌. మ‌హానాయ‌కుడు పేరుతో.. బాల‌య్యే సీక్వెల్ చేస్తున్నారు. ఇది ఖ‌చ్చితంగా ఎన్నిక‌ల‌కు ముందు విడుద‌ల కానుంది. ఫ‌లితంగా ఈ రెండు సినిమాలు అధికార పార్టీ ఓటు బ్యాంకును ప్ర‌భావితం చేస్తాయ‌ని అంచ‌నా వేసుకుంటున్నారు. ఇక, ఇదేస‌మ‌యంలో వైసీపీ కూడా వైఎస్ జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కిస్తున్న చిత్రం 'యాత్ర' కూడా ఎన్నిక‌ల ముంగిటే ప్ర‌జ‌ల్లోకి రానుంది. ఆరోగ్య శ్రీ, ఇందిర‌మ్మ ఇళ్లు, ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ వంటి కీల‌క ప‌థ‌కాల‌తో ప్ర‌జ‌ల హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్న వైఎస్‌ను తెర‌మీదికి తెస్తున్నారు.

వైసీపీ కూడా....

త‌ద్వారా వైసీపీ త‌న ఓటు బ్యాంకును పెంచుకునేందుకు యాత్ర అనే సెంటిమెంటును తెర‌మీదికి తెస్తోంది. వైఎస్ చేసిన పాద‌యాత్ర రాష్ట్ర చ‌రిత్రలో కీల‌క అధ్యాయం. ఇదే టైటిల్‌తో వ‌స్తున్న మూవీ.. త‌మ‌కు అధికార పీఠాన్ని దగ్గ‌ర చేస్తుంద‌ని వైసీపీ భావిస్తోంది. ఇక‌, మ‌రోప‌క్క‌, ఈ రెండు పార్టీల‌కు భిన్నంగా.. రామ్‌గోపాల్ వ‌ర్మ కూడాల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌.. అనే కోణంలో విభిన్న శైలితో ఎన్టీఆర్ జీవితంలో... చివ‌రి ద‌శ‌లో ఏర్ప‌డిన రాజ‌కీయ సంక్షోభం ఆధారంగా మూవీని తెర‌కెక్కిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న దీనిని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని నిర్మిస్తున్నారు. అయితే, దీని ప్ర‌భావం చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా ఉండే సూచ‌న‌లు ఉన్నాయ‌ని ఆది నుంచి వెలుగులోకి వ‌స్తున్న స‌మాచారమే. సో.. ఇలా మొత్తంగా 2019 ఏపీ ఎన్నిక‌ల‌పై ఈమూడు సినిమాల ప్ర‌భావం భారీగానే ప‌డుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Similar News