బాబుకు తిక్క పుట్టిస్తున్న మంత్రి ఎవరు...?

Update: 2018-12-31 05:00 GMT

చంద్ర‌బాబు కేబినెట్‌లో అత్యంత కీల‌క‌మైన మంత్రిగా ఉన్న పొంగూరు నారాయ‌ణ‌కు, సాక్షాత్తూ. సీఎం చంద్ర‌బాబుకు మ‌ధ్య విష‌యం చెడిందా? వారిద్ద‌రి మ‌ధ్య ఇప్పుడు చాలా గ్యాప్ పెరిగిందా? అంటే.. తాజాగా తెర‌మీదికి వ‌చ్చిన అంశాల‌ను ప‌రిశీలిస్తే.. ఔన‌నే అంటున్నాయి అమ‌రావ‌తి వర్గాలు. రాష్ట్రంలో ఏ మంత్రికీ ఇవ్వ‌ని కీల‌క పాత్ర‌ను, కీలక పొజిష‌న్‌ను చంద్ర‌బాబు నారాయ‌ణ‌కు ఇచ్చారు. గ‌తంలో ప‌దేళ్ల కాలంలో పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉండ‌గా.. నారాయ‌ణ త‌న విద్యా సంస్థ‌ల ద్వారా పార్టీకి అండ‌గా నిలిచార‌నే విశ్వాసంతో చంద్ర‌బాబు త‌న ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌గానే ఆయ‌నకు పెద్ద పీట వేశారు. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో నారాయ‌ణ‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇచ్చి.. మంత్రిగా ప్ర‌మోట్ చేశారు.

యనమల ప్రయత్నించినా....

అంతేకాదు.. రాజ‌ధాని నిర్మాణ బాధ్య‌త‌ల‌ను కూడా నారాయ‌ణ‌పైనే ఉంచారు. అత్యంత కీల‌క‌మైన సీఆర్ డీఏ ఉపాధ్య‌క్ష ప‌ద‌వి కూడా నారాయ‌ణ‌కు క‌ట్ట‌బెట్టారు. నిజానికి ఈ ప‌ద‌వి కోసం య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు ప్ర‌య‌త్నించారు. నెంబ‌ర్‌-2గా ఉన్న య‌న‌మ‌ల అత్యంత కీల‌క‌మైన ఈ ప‌ద‌వి ద‌క్కితే.. త‌న‌కు తిరుగు ఉండ‌ద‌ని భావించారు. అయితే, నారాయ‌ణ వైపే చంద్ర‌బాబు మొగ్గారు. దీంతో కొన్ని రోజుల పాటు య‌న‌మ‌ల అలిగి కేబినెట్ స‌మావేశానికి కూడా డుమ్మా కొట్టారు. స‌రే! ఇక‌, నారాయ‌ణ విష‌యానికి వ‌స్తే.. భూ సేక‌ర‌ణ ద‌గ్గ‌ర నుంచి రాజ‌ధానిలో నిర్మాణాలు, సింగ‌పూర్ ప్ర‌తినిధుల‌తో చ‌ర్చలు, రాష్ట్ర రాజ‌ధాని డిజైన్ల నిర్ణ‌యం వంటి అనేక అంశాల బాధ్య‌త‌ను చంద్ర‌బాబు ఆయ‌న చేతిలోనే పెట్టారు.

దూకుడుగా వ్యవహరిస్తున్నందునేనా?

అయితే, ఇంత ప్రాధాన్యం ఇచ్చిన నారాయ‌ణ‌కు, చంద్ర‌బాబుకు మ‌ధ్య గ్యాప్ పెరిగిందనే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ప‌రిస్థితులు కూడా అలానే క‌నిపిస్తున్నాయి. గ‌తంలో ఏ కేబినెట్ మీటింగ్ జ‌రిగినా నారాయ‌ణ క‌నిపించేవారు. అలాగే చంద్ర‌బాబు ప్రెస్ మీట్లోనూ ఆయ‌న క‌నిపించేవారు. కానీ, ఇటీవ‌ల కాలంలో మాత్రం నారాయ‌ణ క‌నిపించ‌డం లేదు. దీనికి కార‌ణాలు ఏంటి? అని లోతుగా ప‌రిశీలిస్తే.. చంద్ర‌బాబు నిర్ణ‌యాల‌కు వ్య‌తిరేకంగా ఆయన దూకుడు ప్ర‌ద‌ర్శించ‌డ‌మే కార‌ణంగా క‌నిపిస్తోంది. రాజ‌ధానికి సంబంధించి స్పీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణం మొత్తం 18 కిలో మీట‌ర్లు. ఇది విజ‌య‌వాడ‌తో మంగ‌ళ‌గిరి వ‌ద్ద రాజ‌ధానిని క‌లుపుతుంది. ఇంత‌క‌న్నా త‌క్కువ మార్గం లేనేలేదు. దీనివ‌ల్ల రాజ‌ధానితో ప్ర‌జ‌ల‌కు అనుబంధం పెరుగుతుంది.

రోడ్డు నిర్మాణం ఆగిపోవడంతో....

అయితే, ఈ రోడ్డు విష‌యంలో నారాయ‌ణ ప్ర‌ద‌ర్శించిన దూకుడుతో నిర్మాణం ఆగిపోయింది. మొత్తం 15 కిలో మీట‌ర్ల రోడ్డు నిర్మాణం పూర్త‌యింది. అయితే, మిగిలిన మూడు కిలోమీట‌ర్ల దూరం నిర్మాణం చేసేందుకు సంబంధిత భూ య‌జ‌మానులు త‌మ భూములు ఇచ్చేందుకు ముందుకు రాలేదు. దీంతో చంద్ర‌బాబు వారిని న‌యాన ఒప్పించి భూములు తీసుకోవాల‌ని సూచించారు. కానీ, నారాయ‌ణ మాత్రం భూములు ఇవ్వ‌క‌పోతే.. మీ అంతు చూస్తాం.. సేక‌ర‌ణ చ‌ట్టం ప్ర‌యోగిస్తే.. మీకు దిక్కు కూడా ఉండ‌దు అంటూ బెదిరించారు. దీంతో విష‌యం వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డి దృష్టికి వెళ్ల‌డంతో ఆయ‌న కోర్టు ద్వారా ఈ భూముల సేక‌ర‌ణ‌కు అడ్డు ప‌డ్డారు. దీంతో ఈ నిర్మాణం ఆగిపోయింది.

బాబు మాటలను పక్కనపెట్టి....

వాస్త‌వానికి ఈ రోడ్డు నిర్మాణం క‌నుక ముందుకు వెళ్తే.. అటు గుంటూరు, ఇటు విజ‌య‌వాడ‌ల మ‌ధ్య ప్ర‌ధానంగా మంగ‌ళ గిరి నుంచి రాజ‌ధానికి అత్యంత త‌క్కువ స‌మ‌యంలో త‌క్కువ దూరంలోనే ప్ర‌జ‌లు చేరుకునే అవ‌కాశం ఉంది. అంతేకాదు, రియ‌ల్ ఎస్టేట్ బిజినెస్‌కు అవ‌కాశం త‌ద్వారా అభివృద్ధి జ‌రిగి.. రాజ‌ధానికి మ‌రింత గుర్తింపు ప్ర‌చారం వ‌చ్చేది. కానీ, నారాయ‌ణ అక్క‌డి య‌జ‌మానుల‌ను ఒప్పించ‌డంలో బాబు మాట‌ను ప‌క్క‌న పెట్టి వ్య‌వ‌హ‌రించారు. ఇది బాబుకు ఆగ్ర‌హం తెప్పింది. ఈ ఒక్క విష‌య‌మే కాదు. రాష్ట్ర రాజ‌ధానిలో భూముల విష‌యంలోనూ నారాయ‌ణ త‌న సొంత పెత్త‌నం చేశారు. రాష్ట్ర రాజ‌ధానిలో ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు, హైకోర్టు న్యాయ‌మూర్తులు, లాయ‌ర్ల‌కు కూడా.. ఇళ్లు నిర్మించి ఇవ్వాల‌నేది బాబు ప్లాన్‌.

ఇళ్ల స్థలాలను ఇస్తామంటూ....

అంటే.. నిర్ణీత స్థలంలో అపార్ట్ మెంట్ల‌ను క‌ట్టి వాటిని ఆయా ఉద్యోగుల స్థాయికి త‌గిన విధంగా నిర్మించి.. ఎలాట్ చేయాల‌ని బాబు నిర్ణ‌యించారు. అయితే, ఉద్యోగులు మాత్రం సాధార‌ణంగానే ఇండివిడ్యువ‌ల్ ఫ్లాట్లు కోరుకున్నారు. త‌మ‌కు భూమి ఇస్తే.. తామే క‌ట్టుకుంటామ‌ని వారు ప్ర‌తిపాదించారు. అయితే, ఇలా చేస్తే... స్థానిక రాజ‌ధానిరైతుల‌కు ఆగ్ర‌హం వ‌చ్చే అవ‌కాశం ఉంటుంద‌ని భావించారు. ఈ క్ర‌మంలోనే ఉద్యోగుల విన‌తిని ప‌క్క‌న పెట్టి .. అంద‌రికీ అపార్టు మెంట్లు క‌ట్టించాల‌ని బాబు భావించారు. అదేవిధంగా రాజ‌ధానిలో ప‌నిచేసే జ‌ర్న‌లిస్టుల‌కు కూడా ఇలానే నిర్మించి ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. కానీ, ఈ విష‌యంలో వేలు పెట్టిన మంత్రి నారాయ‌ణ‌.. ఉద్యోగుల‌కు తాము స్థ‌లాలు ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు ప్ర‌క‌టించి చంద్ర‌బాబుకు తిక్క పుట్టించారు.

ఇబ్బందిగా మారడంతో...

ఉద్యోగుల‌కు అవ‌స‌ర‌మైన‌న్ని.. చాలిన‌న్ని భూములు ఎక్క‌డి నుంచి తీసుకురావాలి? అనేది ఆయ‌న ప్ర‌శ్న‌. దీనికి నారాయ‌ణ స‌మాధానం చెప్ప‌డం అటుంచి.. ఇక‌, అప్ప‌టి నుంచి ఉద్యోగులు త‌మ‌కు స్థ‌లాలే కావాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. ఈ ప‌రిణామం ప్ర‌భుత్వానికి ఇబ్బందిగా ప‌రిణ‌మించింది. దీంతో రాజ‌ధాని విష‌యాల‌పై ఇక‌పై మౌనంగా ఉండాల‌ని ప్ర‌భుత్వం ఒక పాల‌సీ పెట్టుకున్న‌ప్పుడు దానికి అనుగుణంగా ప్ర‌వ‌ర్తించ‌క‌పోతే.. తాను తిప్పలు ప‌డాల్సి వ‌స్తోంద‌ని ఘాటుగానే హెచ్చ‌రించార‌ట చంద్ర‌బాబు. ఈ ప‌రిణామంతో నారాయ‌ణ కూడా కొన్ని రోజులు తాను తెర‌మ‌రుగైతేనే బెట‌ర్ అనుకుని దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌. ఈ క్ర‌మంలోనే కొంత‌కాలంగా నారాయ‌ణ ఎక్క‌డా మ‌న‌కు ద‌ర్శ‌నం ఇవ్వ‌డం లేదు!!

Similar News