అయ్యన్న లక్ష్మణ రేఖ గీశారే..... !!

Update: 2018-12-16 06:30 GMT

మన ప్రజాస్వామ్యం కుటుంబస్వామ్యంగా మారిపోయాక ఇంక అందులోనుంచి తప్పులు ఎన్నుకోవడానికి ఏమీ లేదు. రాజుల తరహాలో కుటుంబంలోని ఒకరి తరువాత ఒకరు వారసులుగా రావడం, జనం వారిని నెత్తిన పెట్టుకోవడం జరుగుతూనే ఉంది. ఇపుడు కూడా ప్రతీ పార్టీలోనూ అలాగే చేస్తున్నారు. అవకాశం ఉండాలే కానీ కుటుంబలోని ప్రతి ఒక్కరూ పదవులు కోరుకునే వారే. ఇచ్చే వారుంటే పుచ్చుకునేవారే. విషయానికి వస్తే విశాఖ జిల్లాలో సీనియర్ మోస్ట్ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు రాజకీయ వారసత్వం ఇపుడు పెద్ద చర్చగా ఉంది. ఓ వైపు తమ్ముడు, నర్శీపట్నం మునిసిపాలిటీ వైస్ చైర్మన్ సన్యాసిపాత్రుడు, మరో వైపు కుమారుడు విజయ పాత్రుడు పోటీ పడుతూండగా ఇపుడు తెరపైకి కొత్తగా అయ్యన్న సతీమణి పద్మావతి వస్తున్నారు.

తమ్ముడికి చెక్ పెట్టడానికేనా....

అయ్యన్న తమ్ముడు సన్యాసిపాత్రుడు తన అన్న గారి రాజకీయ వారసత్వాన్ని కోరుకుంటున్నారు. అయ్యన్న కనుక రాజకీయాల్లో నుంచి విరమించుకుంటే తాను ఎమ్మెల్యే కావాలనుకుంటున్నారు. అయితే అయ్యన్న పెద్ద కుమారుడు విజయ్ కూడా తండ్రికి అసలైన వారసుడిని తానేనని అంటున్నారు. ఈ గొడవ ఇలా ఉంటే ఇపుడు పద్మావతి రంగంలోకి వచ్చేశారు. ఈ మధ్య జరిగిన టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమలో ఆమె మంత్రి అయ్యన్నతో కలసి వచ్చారు. అలాగే పార్టీ కార్యక్రమాల్లోనూ చురుకుగా పాలు పంచుకుంటున్నారు. అయ్యన్న వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయకుండా తన సతీమణిని బరిలోకి దించాలని పధక రచన చెస్తున్నారని అంటున్నారు. ఇలా చేయడం ద్వారా తమ్ముడు సీటు అడగకుండా చేయడంతో పాటు పదవిని ఇంట్లోనే ఉంచుకోవచ్చునని వ్యూహం రూపొందిస్తున్నారని అంటున్నారు.

కొడుకు అక్కడ నుంచి....

ఇక తనయుడు విజయ్ ని అనకాపల్లి ఎంపీ సీటు నుంచి పోటీకి పెట్టాలని కూడా అయ్యన్న డిసైడ్ అయ్యారట. ఈ రెండు సీట్లకు బాబుతో రాయబేరాలు జరుపుతున్నారని టాక్. డైరెక్ట్ గా కుమారుడే ఎమ్మెల్యేగా బరిలో ఉంటే తమ్ముడు సహకరించడని, అదే వదినగారిని బరిలో దించితే తప్పకుండా వెంట నడుస్తారని అయ్యన్న ప్లాన్ అంటున్నారు. అదే టైంలో విజయ్ ని ఎంపీని చేస్తే ఆ తరువాత వచ్చే ఎన్నికల్లో మళ్లీ నర్శీపట్నం ఎమ్మెల్యేగా తీసుకురావచ్చునని, తల్లి నుంచి కుమారుడికి వారసత్వం గా సీటు బదిలీ చేయవచ్చునని ప్లాన్ గా ఉందని అంటున్నారు. మరి, ఈ ప్లాన్ సక్సెస్ కావాలంటే ముందు అధినేత చంద్రబాబు ఒప్పుకోవాలి. తరువాత తమ్ముడు సహకరించాలి. అయితే అయ్యన్న మంత్రాంగం మాత్రం బాగానే ఉందని, బెడిసి కొడితే మాత్రం విపక్షాలకు బంపర్ ఆఫరేనని కూడా సెటైర్లు పడుతున్నాయి.

Similar News