కూటమిలో కుంపట్లు రగిలాయే....!!!

Update: 2018-12-23 16:30 GMT

ప్రధాని మోదీ, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటుకు వరుస కష్టాలు వస్తున్నాయి. కూటమి ఏర్పాటు కాకముందే, లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో విపక్ష కూటమిలో కుంపట్లు రగలిపోతున్నాయి. ఇప్పటికే మాయావతి, మమత బెనర్జీ రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వంపై అభ్యంతరం తెలుపుతున్నారు. మాయావతి తన పుట్టినరోజున నాడు ఏకంగా పొత్తులపై స్పష్టమైన ప్రకటన ఇస్తారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ఏర్పాటుకు ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రయత్నాలు చేస్తుంటే వాటికి ఆదిలోనే విఘ్నం కలిగేలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

రాహుల్ అభ్యర్థిత్వంపై....

మమత బెనర్జీ , అఖిలేష్ యాదవ్ లాంటి నేతలు ఇప్పటికే రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల అనంతరమే విపక్షాలన్నీ కలసి ప్రధాని అభ్యర్థిగా ఎవరు ఉండాలో నిర్ణయించాలని వారు చెబుతున్నారు. కమ్యునిస్టుల పార్టీది కూడా అదే పాట. ఈనేపథ్యంలో తమకు దగ్గరవుతారని భావిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా కాంగ్రెస్ కు దూరం జరగాలని నిర్ణయించుకున్నట్లుంది. అరవింద్ కాంగ్రెస్, బీజేపీ యేతర ఫ‌్రంట్ వైపే మొగ్గుచూపుతారన్న సంకేతాలు వెలువడుతున్నాయి.

ఆమ్ ఆద్మీ పార్టీకూడా....

1984 లో సిక్కుల ఊచకోత విషయంలో అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి ఇచ్చిన భారతరత్న పురస్కారాన్ని వెనక్కు తీసుకోవాలంటూ ఢిల్లీ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టడం కాక రేపింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సిక్కుల ఊచకోతను రాజీవ్ గాంధీ నివారించలేకపోయారని, అందుకోసమే ఆయనకు ఇచ్చిన భారతరత్న పురస్కారాన్ని వెనక్కు తీసుకోవాలన్నది తీర్మానం సారాంశం. ఈ తీర్మానాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే జర్ నైల్ సింగ్ ప్రవేశపెట్టారు.

తేడా వచ్చినట్లేనా....?

అయితే ఇది అరవింద్ కేజ్రీవాల్ కు తెలియకుండా జరిగిందని ఆప్ వివరణ ఇచ్చుకున్నా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కేవలం తీర్మానాన్ని మాత్రమే ప్రవేశపెట్టామని, ఆమోదం తెలపలేదన్న విషయాన్ని ఆప్ ఈ సందర్భంగా గుర్తు చేసినా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆప్ పై మండిపడుతోంది. అరవింద్ ప్రమేయం లేకుండా ఈ తీర్మానం అసెంబ్లీలో ప్రవేశపెట్టలేరన్నది కాంగ్రెస్ వాదన. దీంతో కాంగ్రెస్, ఆప్ ల మధ్య పొత్తు విఘాతం కలిగిందంటున్నారు. ఈ తీర్మానం విషయంలో ఆప్ నేతల్లోనూ విభేదాలు బయటపడటం విశేషం. కొందరు తీర్మానాన్ని సమర్థిస్తుండగా, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. మొత్తం మీద లోక్ సభ ఎన్నికల ముందే కూటమిలో కుంపట్లు రగలుకున్నాయి.

Similar News