100 డేస్ మోర్ ...!!

Update: 2018-12-16 17:30 GMT

దేశంలో సార్వత్రిక ఎన్నికల నగారా మొగడానికి వందరోజుల సమయం మాత్రమే మిగిలివుంది. ఫిబ్రవరి చివరి వారంలో లేదా మార్చి మొదటివారంలో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తూ ఉండటంతో అన్ని పార్టీలు సేనలను సిద్ధం చేస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో అనుసరించాలిసిన వ్యూహాలకు పదును పెడుతూ అన్ని వర్గాలను, కులాలలను, మతాలను ఆకర్షించే పనిలో బిజీ అయ్యాయి. ముఖ్యంగా వివిధ రాష్ట్రాల్లో అధికారంలో వున్న పార్టీలు సంక్షేమ మంత్రం పఠిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు స్కెచ్ లు గీస్తున్నాయి. ఎన్నికల మ్యానిఫెస్టో లను రూపొందించేందుకు కసరత్తులు చేస్తున్నాయి.

ఐదు రాష్ట్రాల ఎన్నికలే ప్రాతిపదికగా ...

తాజాగా జరిగిన రాజస్థాన్, చత్తిస్ ఘడ్, మధ్య ప్రదేశ్, మిజోరాం, తెలంగాణ ఎన్నికల ఫలితాలను దేశంలో అన్ని పార్టీలు మదనం చేస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో విజయబావుటా ఎగురవేసిన వారు అనుసరించిన ఫార్ములాను విశ్లేషిస్తున్నాయి. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని ఎక్కువ సీట్లు సాధిస్తే ప్రాంతీయ పార్టీలకు కేంద్రంలో అంతటి హవా నడుస్తుందని గమనించి తమ శక్తి యుక్తులను పూర్తి స్థాయిలో కేంద్రీకరిస్తున్నాయి. మరో పక్క ఐదేళ్లుగా అధికారానికి దూరమై అల్లాడుతున్న కాంగ్రెస్, అధికారం లో వున్న భారతీయ జనతా పార్టీ తిరిగి పీఠాన్ని దక్కించుకోవాలనే వ్యూహాలకు పదును పెడుతున్నాయి. మూడు రాష్ట్రాల్లో హిట్ కొట్టి ఫామ్ లో కాంగ్రెస్ ఉండగా ఓటమి పాలై డీలా పడ్డ బిజెపి రాబోయే ఎన్నికల్లో అనుసరించాలిసిన కొత్త వ్యూహం సిద్ధం చేసే పనిలో వుంది. ఇటు రాహుల్ గాంధీ, అటు నరేంద్ర మోదీ లోక్ సభ ఎన్నిలకు సమాయత్తమయినట్లే కన్పిస్తోంది.

సర్వేలపై సర్వేలు ...

ప్రజల నాడి పట్టుకునేందుకు అన్ని పార్టీలు ప్రస్తుతం సర్వేల పైనే ఆధారపడ్డాయి. విస్తృత స్థాయిలో సర్వేలు చేయిస్తూ ఎప్పటికప్పుడు తమ దిశను మారుస్తున్నాయి. ఓటర్ల నాడి చిక్కితే తాము అనుసరించాలిసిన వ్యూహం ఖరారు చేసుకునేందుకు ఆస్కారం ఏర్పడుతుందని పార్టీలు భావిస్తున్నాయి. కోట్లాది రూపాయలు సర్వేల కోసమే ఇప్పుడు అన్ని పార్టీలు ఖర్చు చేస్తుండటం విశేషం. వీటితో పాటు పత్రికలూ, ఛానెల్స్, సోషల్ మీడియా విభాగాలకు డబ్బును వెదజల్లుతున్నాయి. వచ్చే వందరోజుల్లో పార్టీల జాతకాలు తేలిపోయే రోజు సమీపిస్తు ఉండటంతో ఎన్నికల ఫీవర్ దేశవ్యాప్తంగా వేడి పుట్టించడం విశేషం.

Similar News