లోకేష్‌ను మించిపోయిన రాజ‌ప్ప.... ఎందుకు? ఎలా?

Update: 2018-04-11 11:30 GMT

లేటుగా వ‌చ్చినా లేటెస్టుగా వ‌స్తా!! అనే ఓ తెలుగు మూవీ డైలాగు. అక్షరాలా దీనిని రుజువు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు త‌న‌యుడు, ప్రస్తుత ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌బాబు. ఏడాది కింద‌ట ఎమ్మెల్సీగా ఎన్నికైన లోకేష్‌.. వెంట‌నే మంత్రి ప‌ద‌విని చేప‌ట్టారు. అయితే, అప్పటి వ‌ర‌కు ఉన్న కీల‌క‌మైన నేత‌ల‌ను ఆయ‌న ప‌క్కకు నెట్టేశారు. వారితో ప‌నే లేద‌న్న ట్టుగా అన్నీ తానై వ్యవ‌హ‌రిస్తున్నారు. ఉద్యోగుల కీల‌క బ‌దిలీల నుంచి ప్రాజెక్టు కాంట్రాక్టర్ల వ‌ర‌కు అన్ని విష‌యాల్లోనూ ఆయ‌న వేలు పెడుతూనే ఉన్నార‌న్న టాక్ ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో... ముఖ్యంగా అధికార పార్టీలోనూ ఈ చ‌ర్చ ఉంది. ఎంతైనా చంద్రబాబు కుమారుడు కావ‌డంతో సీనియ‌ర్లు సైతం మౌనం వ‌హించే ప‌రిస్థితి వ‌చ్చింది. కొంద‌రు ఈ విష‌యంలో అలిగి మూతి బిగించుకున్నా.. చేసేది లేక స‌ర్దుకు పోయారు. అయితే, ఇప్పుడు తాజాగా డిప్యూటీ సీఎం, హోం శాఖ మంత్రి చిన‌రాజ‌ప్ప మాత్రం లోకేష్‌ను మించిపోయార‌నే వార్తలు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో.....

ఏపీని అభివృద్ధి ప‌థంలో న‌డిపించేందుకు ప్రతి ఒక్కరూ క‌ష్టప‌డి ప‌నిచేయాల‌ని చంద్రబాబు ప‌దే ప‌దే పిలుపు నిచ్చిన విష‌యం తెలిసిందే. ఈ క్రమంలోనే మంత్రుల వ‌ద్ద పనులు ఏవీ పెండింగ్‌లో లేకుండా చేయాల‌ని కూడా బాబు ప‌లు మార్లు ఆదేశించారు. దీంతో మంత్రులు త‌మ వ‌ద్దకు అధికారుల నుంచి వ‌చ్చే ఫైళ్లను పెండింగ్‌లో లేకుండా చూసు కుంటున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు సైతం పైకి ఆదేశాలు ఇచ్చి వ‌దిలేకుండా ఏయే మంత్రులు క‌ష్టప‌డి ప‌నిచేస్తున్నారు. ప్రభుత్వాన్ని ముందుకు న‌డిపిస్తున్నార‌నే విష‌యాల‌ను ఎప్పటిక‌ప్పుడు త‌న ఇంటిలిజెన్స్ వర్గాల ద్వారా రిపోర్టులు తెప్పించుకుంటున్నారు. ఇలా తెప్పించుకున్న తాజా నివేదికలో హోం మంత్రి చిన‌రాజ‌ప్ప దూసుకు పోతున్నార‌ని తెలిసింది.

ఈ నివేదిక ప్రకారం....

అంతేకాదు, ఈ నివేదిక ప్రకారం మంత్రి లోకేష్ క‌ంటే చిన రాజ‌ప్పే మొద‌టి స్ధానంలో ఉండ‌డం విశేషం. చిన రాజప్ప, లోకేష్, నారాయణలు సగటున గంట వ్యవధిలో ఫైళ్ల క్లీరెన్సు చేస్తున్నార‌ని చంద్రబాబుకు తెలిసింది. అయితే, వీరిలోనూ మంత్రి లోకేష్ కొంచెం ఫాస్ట్‌గా ఉంటే.. ఆయ‌న‌ను మించి చిన రాజ‌ప్ప మ‌రింత ఫాస్ట్‌గా దూసుకుపోతున్నా ర‌ట‌. ఇక‌, మంత్రి అచ్చెన్నాయుడు రెండు గంటలు, దేవినేని ఉమా 14 గంటలు, కాల్వ శ్రీనివాసులు 15 గంటలు సగటు సమయం తీసుకుంటున్నారని నివేదిక వెల్లడించ‌డం గ‌మ‌నార్హం. అదేవిధంగా, మంత్రి పరిటాల సునీత సగటున ఒకరోజు 6 గంటలు, గంటా శ్రీనివాసరావు 3 రోజుల 14 గంటలు, నక్కా ఆనందబాబు ఒకరోజు 8 గంటలు, యనమల రామకృష్ణుడు 7 రోజుల 23 గంటలు చొప్పున ఫైళ్లు క్లియ‌ర్ చేసేందుకు స‌మ‌యం తీసుకుంటున్నారు.

మరో డిప్యూటీ సీఎం.....

ఇక‌, మ‌రో డిప్యూటీ సీఎం కె.ఇ.కృష్ణమూర్తి 3 రోజుల 5 గంటలు, అయ్యన్నపాత్రుడు 2 రోజుల 4 గంటలు, ఆదినారాయణ రెడ్డి 2 రోజుల 19 గంటలు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 13 గంటలు, కొల్లు రవీంద్ర 5 రోజుల 1 గంటలా సమయం తీసుకుంటున్నట్టు చంద్రబాబుకు తెలిసింద‌ని అమ‌రావ‌తి వ‌ర్గాలు అంటున్నాయి. ఏదేమైనా.. మొద‌ట్లో కొంచెం వెనుక‌బ‌డినా.. ఇప్పుడు లోకేష్‌ను మించి చిన‌రాజ‌ప్ప దూసుకు పోతుండ‌డంపై బాబు ఆనందంతో ఉన్నా.. త‌న‌కుమారుడిని మించిపోవ‌డంపై లోలోనే కొంత బాధ‌ప‌డుతున్నార‌ని తెలుస్తోంది. సో.. ఇదీ మొత్తంగా లోకేష్‌పై చిన‌రాజ‌ప్ప దూకుడుగా వెళ్లున్నవిష‌యాన్ని స్పష్టం చేస్తోంది.

Similar News