ఫినిష్... అయిపోతామని వద్దంటున్నారే.....!!

Update: 2018-12-21 06:30 GMT

ఆ పదవి అంటేనే భయపడిపోతున్నారు. ఆ పదవి మాకొద్దు అంటూ కాళ్లా వేళ్లా పడుతున్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఈపదవి హాట్ టాపిక్ గా మారింది. ఆ పదవి తీసుకున్నారో....ఇక రాజకీయ జీవితం ముగిసినట్లేనని పొలిటికల్ లీడర్స్ డిసైడ్ అయిపోయారు. అధిష్టానం పదవి ఇస్తామన్నా వద్దు పొమ్మంటున్నారు. ఇంతకీ ఏంటా పదవి? ఎందుకు వద్దంటున్నారు? అదే ఆర్టీసీ ఛైర్మన్ పదవి. ఈ పదవి తీసుకున్న వారెవ్వరికీ రాజకీయాలు అచ్చిరావడం లేదన్న సెంటిమెంట్ బలంగా పాతుకుపోయింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన గులాబీ బాస్ నామినేటెడ్ పోస్టులపైనా దృష్టి పెడుతుండటంతో ఈ పదవి తమకు రాకుండా చూడమని వేయి దేవుళ్లకు మొక్కుకుంటున్నారట.

ఆర్టీసీ ఛైర్మన్ పదవి కోసం....

రెండోసారి ముఖ్యమంత్రిగా కె.చంద్రశేఖర్ రావు ఈసారి మంత్రివర్గంలో తక్కువమందికి స్థానం కల్పించాలని భావిస్తున్నారు. అందులో భాగంగా మంత్రి పదవి దక్కని వారికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు. అయితే ఏ పదవి అయినా పరవాలేదు కాని, ఆర్టీసీ ఛైర్మన్ పదవి వస్తే తాము తీసుకునేది లేదని చెబుతున్నారట. ఎందుకంటే ఈ పోస్టుకు చాలా చరిత్ర ఉంది. ఈ పదవిని తీసుకున్న వారు ఆ తర్వాత రాజకీయంగా కనుమరుగై పోయారు. తాజా ఎన్నికల్లో కూడా ఇదే రిపీటీ్ కావడంతో ఆ పోస్టు వద్దనే వారి సంఖ్య ఎక్కువగా కన్పిస్తోంది. రాజకీయంగా ఎదుగుదల లేని వారికి ఈ పదవి ఇస్తే బాగుంటుందని మరి కొందరు సూచిస్తుండటం విశేషం.

ఎమ్మెఎస్...గోనెలు.....

గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎం. సత్యనారాయణరావు ఈ పదవిని చేపట్టారు. రెండుసార్లు ఆర్టీసీ ఛైర్మన్ గా పనిచేశారు. గవర్నర్ పదవిని ఆశించిన ఎమ్మెఎస్ కు అది దక్కకపోగా ఈ పదవి చేపట్టిన తర్వాత రాజకీయంగా పూర్తిగా తెరమరుగై పోయారు. ఆ తర్వాత గోనె ప్రకాశరావు ఆర్టీసీఛైర్మన్ పదవిని చేపట్టారు. గోనెకు పిలిచి మరీ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ పదవి ఇచ్చారు. కానీ గోనె ప్రకాశరావు ఆ తర్వాత రాజకీయాల నుంచే కనుమరుగై పోయారు. ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ ఆయనకు ఇక రాజకీయంగా ఎదుగుదల కష్టమే.

సోమారపు ఓటమితో.....

తాజాగా 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణకు కేసీఆర్ ఆర్టీసీ ఛైర్మన్ పదవిని అప్పగించారు. ఆయన మూడున్నరేళ్ల పాటు ఆర్టీసీ ఛైర్మన్ గా బాధ్యతలను నిర్వర్తించారు. కానీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో రామగుండం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన సోమారపు సత్యనారాయణ ఓటమిపాలయ్యారు. రాజకీయంగా ఈ పదవి చేపట్టి దెబ్బతిన్న మూడో వ్యక్తి సోమారపు సత్యనారాయణకావడం విశేషం. దీంతో నేతలెవ్వరూ ఈ పదవి చేపట్టానికి ఇష్టపడటం లేదు. మరి ఈసారి ఎవరిని ఈ పదవి వరిస్తుందో చూడాలి.

Similar News