ఎల్బీనగర్ లో ఎడ్జ్ ఎవరికి..?

Update: 2018-11-01 02:30 GMT

రంగారెడ్డి జిల్లాలోని కీలక నియోజకవర్గాల్లో ఎల్బీనగర్ ఒకటి. టీఆర్ఎస్ ఇప్పటికే ఇక్కడ అభ్యర్థిని ప్రకటించగా... ప్రజా కూటమి అభ్యర్థి ఎవరనేది పెద్ద గందరగోళంగా మారింది. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మళ్లీ పోటీ చేస్తారా..? చేస్తే ఏ పార్టీ నుంచి చేస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది. సెటిలర్ల ప్రభావం ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో ఆయన టీఆర్ఎస్ అభ్యర్థి రామ్మోహన్ గౌడ్ పై విజయం సాధించారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి సుధీర్ రెడ్డి మూడో స్థానానికే పరిమితమయ్యారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి టిక్కెట్ తనకే అని ధీమాగా ఉన్నారు. అయితే, ఈ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కూడా ఆశిస్తోంది.

కృష్ణయ్య పోటీలో ఉంటారా..?

సీమాంధ్ర సెటిలర్లతో పాటు తెలంగాణలోని నల్గొండ, ఖమ్మం వంటి జిల్లాల నుంచి వచ్చి స్థిరపడిన ఓటర్లు ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఎక్కువగా ఉంటారు. 2009లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి సుధీర్ రెడ్డి విజయం సాధించారు. స్థానికంగా ఆయన మంచి పట్టు సంపాదించుకున్నారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైనా 56 వేల ఓట్లు సాధించారు. ఈ ఎన్నికల్లో ఆయన ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించారు. అయితే, ప్రజాకూటమిలో ఈ సీటు ఎవరికి దక్కుతుందనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. తెలుగుదేశం పార్టీకి సిట్టింగ్ స్థానం కావడంతో ఆ పార్టీ ఈ స్థానాన్ని కోరుతోంది. రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి టిక్కెట్ ఆశిస్తున్నారు. ఆయన 2009లో టిక్కెట్ అడగగా అప్పుడు ఎస్వీ కృష్ణప్రసాద్ కి ఇచ్చారు. ఇక 2014లోనూ గట్టిగా ప్రయత్నించినా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యకు టిక్కెట్ కేటాయించారు. దీంతో రెండుసార్లూ నిరాశచెందిన రంగారెడ్డి ఈసారి కచ్చితంగా టిక్కెట్ కావాలంటున్నారు. ఆయన కూడా ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. దీంతో టిక్కెట్ ఎవరికి దక్కుతుందనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఇక ఆర్.కృష్ణయ్య కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఆయన ఎల్బీనగర్ నుంచే బరిలో ఉంటారా.? ఉంటే, టీడీపీ నుంచే పోటీ చేస్తారా, కాంగ్రెస్ లో వెళ్లనున్నారా లేదా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా అనేది తెలియడం లేదు. వచ్చే నెల 4న జరగనున్న బీసీల బహిరంగ సభలో ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.

కూటమి అసంతృప్తి టీఆర్ఎస్ కి కలిసొస్తుందా..?

ఇక టీఆర్ఎస్ అభ్యర్థిగా గత ఎన్నికల్లో పోటీ చేసిన ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ కే టిక్కెట్ ఖాయం చేశారు. దీంతో ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో విజయం సాధించారు. దీంతో ఆ పార్టీ బలం ఇప్పటికే స్పష్టమైంది. అయితే, కార్పొరేటర్లపై ఉన్న కొంత వ్యతిరేకత ఆ పార్టీకి నష్టం కూడా చేసే అవకాశం ఉంది. ఇక నియోజకవర్గంలో టీఆర్ఎస్ ప్రభుత్వ ఏర్పడ్డాక అభివృద్ధి కార్యక్రమాలు కూడా బాగానే జరిగాయి. ఇక బీజేపీ ఎల్బీనగర్ అభ్యర్థిత్వాన్ని పేరాల శేఖర్ రావుకు ఖాయం చేసింది. అయితే, టీఆర్ఎస్, ప్రజాకూటమి మధ్య ద్విముఖ పోటీనే ఉండే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. కానీ, సుధీర్ రెడ్డి లేదా సామ రంగారెడ్డికి టిక్కెట్ ఇస్తే మరొకరు పూర్తిస్థాయిలో సహకరించే పరిస్థితి లేదు. అవసరమైతే ఇండిపెండెంట్ గా కూడా బరిలో దిగే అవకాశం ఉంది. మొత్తానికి మొదటిసారి ఎల్బీనగర్ లో గులాబీ జెండా ఎగరేయాలని టీఆర్ఎస్ పట్టుదలకు ప్రజాకూటమిలోని గందరగోళం కలిసివచ్చేలా కనిపిస్తోంది.

Similar News