‘‘పవర్’’ ప్లే లో టర్న్ చేసేశారా....?

Update: 2018-12-10 09:30 GMT

తెలంగాణ ఎన్నికల పోలింగ్ సరళి ఇప్పుడు ఏ పార్టీ నేతలకూ నిద్ర పట్టనివ్వడం లేదు. సాయంత్రం ఐదు గంటల వరకూ అన్ని చోట్ల 60 శాతానికి మించలేదు. ఆ తర్వాతే అసాధరణంగా పోలింగ్ శాతం పెరగడం ఎవరికి నష్టం? ఎవరికి లాభం? అన్న చర్చ తెలంగాణలో జోరుగా నడుస్తోంది. పోలింగ్ శాతం అనూహ్యంగా చివరి గంటల్లో పోలింగ్ పెరగడానికి గులాబీ బాస్ కారణమని చెబుతున్నారు. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. సాయంత్రం ఐదుగంటల వరకూ 60 దాటని పోలింగ్ శాతం చివరకు 73.20 శాతానికి చేరుకోవడం వెనక గులాబీ దళపతి వ్యూహముందంటున్నారు. చింతమడకలో ఓటు వేసుకున్న తర్వాత ఎర్రవెల్లిలోని తన ఫాంహౌస్ చేరుకున్న కేసీఆర్ అందరు అభ్యర్థులతో మాట్లాడి ఈ వ్యూహరచన చేశారంటున్నారు.

రాత్రి 9గంటల వరకూ.....

సాయంత్రం ఐదుగంటల నుంచి క్యూలైన్లు పెరిగాయి. క్యూలైన్లో ఉన్న వారందరికి ఓటు హక్కును కల్పించాల్సి రావడంతో ఎన్నికల కమిషన్ కూడా పోలింగ్ కేంద్రాలను తెరిచే ఉంచింది. కొన్ని ప్రాంతాల్లో రాత్రి 9గంటల వరకూ పోలింగ్ జరిగిందంటే ఆశ్చర్యం కలగక మానదు. అయితే టీఆర్ఎస్ అభ్యర్థులే చివరి ఘడియల్లో తమ అనుచరులను రంగంలోకి దింపి ఓటింగ్ రానివారందరినీ రప్పించారన్న టాక్ బలంగా విన్పిస్తోంది. క్యూలైన్లు ఎక్కువగా ఉండటంతో పోలింగ్ కేంద్రానికి వచ్చి తిరిగి వెనక్కు వెళ్లిపోయిన వారిని రప్పించడంలో గులాబీ పార్టీ సక్సెస్ అయిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

వ్యతిరేకత కాదా?

సహజంగా పోలింగ్ శాతం పెరిగితే అధికార పార్టీపై వ్యతిరేకత వల్లనేనన్నది నిపుణుల అంచనా. హస్తం పార్టీ నేతలు కూడా అదే లెక్కలు వేసుకున్నారు. పోలింగ్ సాయంత్రం నుంచి అనేక నియోజకవర్గాల్లో హస్తం పార్టీ అభ్యర్థులు మెత్తబడగా, టీఆర్ఎస్ అభ్యర్థులు మాత్రం బాస్ ఫోన్ లో ఆదేశాలతో తమకు అనుకూలంగా పోలింగ్ చేయించుకున్నారంటున్నారు. కొన్ని చోట్ల ఎక్కువగా దొంగ ఓట్లు కూడా పోలయ్యాయన్నది విపక్ష పార్టీల ఆరోపణ. సాధారణంగా ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకే పోలింగ్ బాగా జరుగుతుందని, తర్వాత అంతగా జరగదని ఎన్నికల కమిషన్ అధికారులు సయితం అంగీకరిస్తున్నారు. కాని దానికి భిన్నంగా జరగడంపై వారు సయితం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇరవై శాతం వరకూ....

చెన్నూరు, కొడంగల్, బెల్లంపల్లి, బోధన్, జుక్కల్, మంథని, పటాన్ చెర్వు, గజ్వేల్, ఇబ్రహీంపట్నం, కల్వకుర్తి, తాండూరు, కొడంగల్, నారాయణ్ పేట్, కోదాడ, ఇల్లెందు, సత్తుపల్లి నియోజకవర్గాల్లో సాయంత్రం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకూ పదిశాతం లోపే పోలింగ్ కాగా, ఐదు గంటల తర్వాత పదమూడు నుంచి ఇరవై శాతం వరకూ పోలింగ్ అయింది. చివరి నిమిషంలో ఈ నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం పెరగడం కూడా కేసీఆర్ వ్యూహంలో భాగంగానే జరిగిందన్నది కాంగ్రెస్ నేతలు సయితం అంగీకరిస్తున్నారు. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో తాము గట్టెక్కుతామని కాంగ్రెస్ పార్టీ విశ్వాసం వ్యక్తం చేస్తున్నా చివరి ఘడియలు కొంపముంచుతాయా? అన్న అనుమానం లేకపోలేదు.

Similar News