ఆయన అనుకున్నట్లే అంతా జరుగుతుందే...!

Update: 2018-04-25 14:30 GMT

మ‌హారాష్ట్ర అద‌న‌పు డీజీపీ, సీబీఐ పూర్వ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ స్వ‌చ్ఛంద ఉద్యోగ విర‌మ‌ణ‌(వీఆర్ఎస్‌)కు ప్ర‌భుత్వం ఆమోదం తెలిపింది. వీఆర్ఎస్ కోరుతూ ల‌క్ష్మీనారాయ‌ణ ఇటీవ‌ల ఆ రాష్ట్ర డీజీపీకి ద‌ర‌ఖాస్తు చేసుకున్న విష‌యం తెలిసిందే. దీంతో ఆయ‌న రాజ‌కీయ అరంగేట్రంపై అప్పుడే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నిజానికి.. ఈ మ‌ధ్య ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్న ఆయ‌నను రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నారా..? అని ప‌లువురు విలేక‌రులు అడిగినా దాట‌వేశారు త‌ప్ప రాన‌ని మాత్రం చెప్ప‌లేదు.

త్వరలో కార్యాచరణ......

అదేవిధంగా కొద్దిరోజులుగా ఆయ‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రుగుతున్న ప‌లు కార్య‌క్ర‌మాల‌కు త‌రుచూ హాజ‌ర‌వుతున్నారు. ఈ క్ర‌మంలో త‌న వీఆర్ఎస్‌కు ఆమోదం తెలిపిన త‌ర్వాత కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టిస్తాన‌ని చెప్పారు. అయితే వీఆర్ఎస్‌కు ప్ర‌భుత్వం ఆమోదం తెలుప‌డంతో ల‌క్ష్మీనారాయ‌ణ రాజ‌కీయాల్లోకి రావ‌డం ఖాయ‌మ‌నే చ‌ర్చ‌లు అప్పుడే మొద‌ల‌య్యాయి. ఇప్ప‌టికే ఏపీలో రాజ‌కీయంగా క్లిష్ట ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఉద్య‌మం ఉధృతంగా కొన‌సాగుతోంది. ఇందులో టీడీపీ, వైసీపీ, జ‌న‌సేన‌, వామ‌ప‌క్షాలు విడివిడిగా ఉద్య‌మిస్తున్నాయి. విమ‌ర్శ‌లు, ప్ర‌తివిమ‌ర్శ‌ల‌తో వేర్వేరుగా హోదా నినాదంతో ముందుకు వెళ్తున్నాయి.

రాజకీయ అరంగేట్రం చేస్తారా?

ఇక బీజేపీ మాత్రం ఏపీలో ఇర‌కాటంలో ప‌డిపోయింది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ల‌క్ష్మీనారాయ‌ణ రాజ‌కీయ అరంగేట్రం చేస్తార‌నే ప్ర‌చారం అంద‌రిలో ఆస‌క్తిని రేపుతోంది. నిజంగానే ఆయ‌న రాజ‌కీయాల్లోకి వ‌స్తేమాత్రం కీల‌క మార్పులు త‌ప్ప‌వ‌నే టాక్ కూడా వినిపిస్తోంది. ఇదిలా ఉండ‌గా.. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌వి విష‌యంలో ఉత్కంఠ కొన‌సాగుతూనే ఉంది. ఇటీవ‌ల ఆ ప‌ద‌విని ఓ రిటైర్డ్ అధికారికి క‌ట్ట‌బెడుతార‌నే ప్ర‌చారం కూడా ఉంది. ల‌క్ష్మీనార‌ాయణపై కొంత హిందూ భావ‌జాల ప్ర‌భావితం ఉంటుంద‌నీ, దీంతో ఆయ‌న బీజేపీవైపే మొగ్గుచూపుతార‌నే ఊహాగానాలు వినిస్తున్నాయి.

ఎందరో అభిమానులు....

అయితే గ‌తంలో డిప్యుటేష‌న్‌పై ఉమ్మ‌డి ఏపీలో సీబీఐ జాయింట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసిన ల‌క్ష్మీనారాయ‌ణ నిజాయితీగల అధికారిగా పేరు పొందారు. కొన్ని కీల‌క కేసుల్లో చూపించిన తెగువ‌తో ఆయ‌న‌కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అంతేగాకుండా ఆయ‌న ప్ర‌సంగం చాలా ప్ర‌భావితంగా ఉంటుంది. ఈ నేప‌థ్యంలో రాజ‌కీయాల్లోకి వ‌చ్చేందుకే ల‌క్ష్మీనారాయ‌ణ ఉద్యోగానికి స్వ‌స్తి చెప్పార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ ప్ర‌చారంపై ఆయ‌న ఎలా స్పందిస్తారో చూడాలి మ‌రి.

Similar News