లగడపాటి పత్తా లేకుండా పోయాడా??

Update: 2018-12-13 06:30 GMT

లగడపాటి రాజగోపాల్... తెలంగాణ ఎన్నికలకు ముందు సంచలనం సృష్టించిన లగడపాటి రాజగోపాల్ పత్తా లేకుండా పోయారా? తన మీద ఇన్నివిమర్శలు వస్తున్నా ఆయన ఎందుకు స్పందించడం లేదు. బెట్టింగ్ ల కోసమే లగడపాటి తప్పుడు సర్వేలు బయటపెట్టారని అనేకమంది ఆరోపణలు ఇస్తున్నా ఆయన మాత్రం ఎందుకు సమాధానం ఇవ్వడం లేదు. తెలంగాణ రాజకీయాలు కూడా ఇప్పుడు లగడపాటి చుట్టూనే తిరుగుతున్నాయి. మహాకూటమి ఓటమికి లగడపాటి రాజగోపాల్ కూడా ఒక కారణమన్న విశ్లేషణలు రెండు రాష్ట్రాల్లో విన్పిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి టూల్ గా లగడపాటి మారి, తప్పుడు సర్వేలు ప్రజల ముందుకు తెచ్చారని కాంగ్రెస్ నేతలు సయితం అంతర్గత సమావేశాల్లో అంగీకరిస్తున్నారు.

ఆ సర్వే వల్ల కూడా....

అంతకు ముందువరకూ మహాకూటమికి కొంత ఆశాజనకంగానే ఉందని, లగడపాటి సర్వేను పోలింగ్ కు ముందు వెల్లడించడంతో తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు దీన్ని బాగా ఉపయోగించుకున్నారు. సోషల్ మీడియా ద్వారా లగడపాటి మరోసారి తెలంగాణపై సర్వే స్ప్రే చల్లుతున్నారని, దాన్నుంచి మనల్ని మనం కాపాడుకోవాలన్న పోస్టింగ్ లు తెలంగాణలో పోలింగ్ కు ముందు వైరల్ అయ్యాయి. మరోవైపు చంద్రబాబు కూడా లగడపాటి సర్వే చెబితే ఆయనను బెదిరిస్తున్నారని ఖమ్మం జిల్లాలో జరిగిన బహిరంగ సభలో వెనుకేసుకురావడం కూడా పార్టీకి డ్యామేజ్ అయిందని కాంగ్రెస్ నేతలు గట్టిగా నమ్ముతున్నారు. అయితే బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటులో చంద్రబాబు కీలకం కావడంతో ఆయనకు వ్యతిరరేకంగా కాంగ్రెస్ నేతలు కామెంట్స్ చేయడానికి ధైర్యం చేయలేకపోతున్నారన్నది వాస్తవం.

కోట్ల రూపాయలు హాంఫట్.....

సరే.. లగడపాటి రాజగోపాల్ సర్వేతో కేసీఆర్ విజయం సాధించారా? లేదా? అన్న విషయాన్ని కాసేపు పక్కనపెడితే... రెండు తెలుగు రాష్ట్రాల్లో లగడపాటి బాధితులు వేలమందికి చేరుకున్నారు. ఆయన సర్వే పట్ల విశ్వసనీయత ఉండటంతో ముఖ్యంగా టీడీపీ అభిమానులు కోట్లాది రూపాయలు బెట్టింగ్ లలో పోగొట్టుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో ఒక నేత ఐదు ఎకరాలు పోగొట్టుకున్నారని, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందని ఒక టీడీపీ నాయకుడికి యాభై లక్షల రూపాయల మేరకు చేతి చమురు వదిలిందంటున్నారు. అలాగే కర్నూలు జిల్లలో నంద్యాలలో కూడా కోట్లాది రూపాయల బెట్టింగ్ లు జరిగాయి.

క్షమాపణ చెప్పాల్సిందే.....

ప్రధానంగా కూకట్ పల్లి, కొడంగల్ నియోజకవర్గాలు, ప్రజాకూటమి గెలుపుపైనే ఎక్కువ బెట్టింగ్ లు జరిగాయంటున్నారు. ఇప్పుడు లగడపాటి బయటకు వచ్చి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆయన చేసిన సర్వే పూర్తిగా రివర్స్ అవ్వడానికి కారణాలు ఆయన ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నికలకు ముందు ఊ అంటే మీడియా ముందుకు వచ్చే లగడపాటి ఫలితాలు వచ్చి మూడు రోజులవుతున్నా పత్తాలేకుండా పోయారు. వేలాది మంది ఆయన సర్వేతో ఆరిపోయారు. వీరందరికి బహిరంగంగా ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. సర్వేలు ఇక చేయబోనని ఆయన చెప్పాలంటున్నారు. సబ్బం హరి కూడా ప్రజకూటమి వస్తుందని చెప్పి ఫలితాల తర్వాత ఆయన ప్రజలకు క్షమాపణ చెప్పిన సంగతి తెలిసిందే. లగడపాటీ కలుగులో దాక్కుంటే సరిపోదు.. బయటకు వచ్చి వివరణ ఇవ్వు... అని టీఆర్ఎస్ నేతలు కోరుతున్నారు.మరి లగడపాటి ఎప్పుడు సర్వే పై స్పందిస్తారో చూడాలి.

Similar News