ట్రాక్ రికార్డు.. చెదిరిపోతుందా?

Update: 2018-12-08 06:30 GMT

ఊరందరిదీ ఒక దారైతే... అన్న సామెతగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ సర్వే ఇప్పుడు చర్చనీయాంశమయింది. జాతీయ ఛానెళ్లన్నీ తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ సర్వేలో తేల్చి చెప్పగా, లగడపాటి సర్వే మాత్రం అందుకు భిన్నంగా వచ్చింది. లగడపాటి సర్వేలో ప్రజాకూటమి విజయం సాధిస్తుందని తేలింది. 65 స్థానాలకు మించి లేదా కొంత తక్కువగానైనా వచ్చి ప్రజాకూటమి అధికారంలోకి వస్తుందని ఆయన చెప్పారు. అయితే నిన్న మీడియా సమావేశంలో లగడపాటి హావభావాలు, కొంత అసహనంతో ఉండటం చూస్తుంటే సర్వే తేడా ఉందన్న అనుమానాలు ఇటు కాంగ్రెస్ నేతలకు కూడా కలుగుతున్నాయి.

ఉత్సాహంగా లేరని....

నాలుగు రోజులు క్రితం లగడపాటి సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నప్పుడు చాలా ఉత్సాహంగా కన్పించారు. చివరకు గజ్వేల్ ఫలితంపై కూడా కె.చంద్రశేఖర్ రావు ఓటమి పాలయ్యే అవకాశముందని పరోక్షంగా చెప్పారు. అప్పుడు కూడా ప్రజాకూటమి అధికారంలోకి వస్తుందని చెప్పారు. గత ఎన్నికల్లో తెలంగాణలో 68.5 శాతం ఓట్లు పోలయ్యాయని, అంత కంటే ఎక్కువ వస్తే ప్రజాకూటమి విజయం ఖాయమని నాలుగురోజులు క్రితం చెప్పారు. ఈ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా 69.1 శాతం ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ శాతం గత ఎన్నికల కంటే పెరగడంతో ప్రజాకూటమి విజయం సాధిస్తుందనేది లగడపాటి విశ్లేషణ. అయితే ఆయన నిన్న జరిగిన మీడియా సమావేశంలో ఉత్సాహంగా లేరు.

బాడీ లాంగ్వేజీలో తేడా....

అంతేకాదు గతంలో ఆయన తమిళనాడు,కర్ణాటకల్లో జరిపిన సర్వేలు కూడా విజయవంతం కాలేదని టీఆర్ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు. లగడపాటి బాడీ లాంగ్వేజీ చూస్తేనే అర్థమవుతుందని గులాబీ పార్టీనేతలు అంటున్నారు. నాలుగు రోజుల క్రితం తాను లీక్ చేసిన విషయాన్నే లగడపాటి నిన్న అధికారికంగా ప్రకటించారని,ఇందులో పెద్దగా ఆశ్చర్యపడాల్సిన పనిలేదంటున్నారు. గజ్వేల్ విషయంలో లగడపాటి సర్వే ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. నిన్న మీడియా సమావేశంలో లగడపాటి తనమాటల్లోనే ఈసారి ఎన్నికల్లో ఫలితం తేల్చడం కష్టమని, చాలా ఫ్యాక్టర్స్ ఈసారి ఎన్నికల్లో ప్రభావం చూపుతున్నాయని చెప్పడాన్ని టీఆర్ఎస్ నేతలు లగడపాటి లాజిక్ గా భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి పది స్థానాల్లో ఏడు వస్తాయని చెప్పడాన్ని బట్టి సర్వే ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చంటున్నారు.

ధనప్రవాహం పనిచేసిందని....

అలాగే ఈసారి తెలంగాణలో ధన ప్రవాహం పనిచేసిందని చెప్పడం కూడా లగడపాటి తన సర్వే ఫలితం ఫలించబోదని చెప్పకనే చెప్పేశారని కొందరు విశ్లేషిస్తున్నారు. ప్రేమ, మంచి,హామీలు, విశ్వాసం ఇలాంటి పదాలను వాడిన లగడపాటి తన సర్వేపై తనకే నమ్మకం లేదనట్లుగా వ్యవహరించారంటున్నారు. లగడపాటి సర్వేకు ఒక ట్రాక్ రికార్డ్ ఉంది. విశ్వసనీయత ఉంది. అయితే నిన్న మీడియా సమావేశంలో లగడపాటిలో ఎక్కడా కాన్ఫిడెన్స్ కన్పించడం లేదన్నది కొందరి వాదన. మొత్తం మీద లగడపాటి ఈ సర్వే ద్వారా ఆయన విశ్వసనీయతను కాపాడుకుంటారో? లేదో? అన్నది తేలాలంటే ఈ నెల 11వ తేదీ వరకూ ఆగాల్సిందే.

Similar News