లగడపాటి సర్వే అందుకోసమేనా ...?

Update: 2018-12-09 03:30 GMT

తెలుగు రాష్ట్రాల్లో మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్ సర్వేకు ఒక క్రేజ్ వుంది. ఎన్నికలు ఎక్కడ జరిగినా అక్కడ వాలిపోవడానికి ఆయన టీం లు సదా సిద్ధంగా ఉంటాయి. ఇలా సర్వేలు జరపడం ఆ తరువాత ఆ డేటా ను ప్రజలతో మీడియా ద్వారా పంచుకోవడం లగడపాటికి గత దశాబ్ద కాలంగా అలవాటుగా మారిపోయింది. దేశంలో జరిగే కీలక ఎన్నికల సమయంలో బయటకు వచ్చే లగడపాటి నివేదికలు విశ్వసనీయతతో కూడి ఉండటానికి చాలా శాతం ఆయన సర్వేలు వాస్తవరూపం దాల్చడమే. అయితే ఇవన్నీ రాజకీయ సన్యాసం పుచ్చుకున్న రాజగోపాల్ ఎందుకు చేస్తున్నట్లు అనే ప్రశ్నకు అనేక ప్రచారాలు వున్నాయి.

బెట్టింగ్ బంగార్రాజులకు బంగారమే ...

లగడపాటి కానీ ఇతర అనేక జాతీయ ఛానెల్స్ ఇచ్చే సర్వేలు బెట్టింగ్ బంగార్రాజులకు బంగారం తెచ్చి పెడుతున్నాయి. ఇచ్చే సర్వేలకు వచ్చే ఫలితాలకు ఒక్కోసారి పూర్తి భిన్నమైన పరిస్థితి ఎక్కువ సార్లు ఎదురవుతుంది. ఫలితంగా ఈ సర్వేలను నమ్ముకున్న పంటర్లు వేలకోట్ల రూపాయలు నష్టాన్ని ఎదుర్కొంటారు వీటిలో హుషారుగా పాల్గొనే వారు. బెట్టింగ్ వేసేవారిని పక్కదారి పట్టించేందుకు సర్వేలు ఎంతో ఉపకరిస్తాయి. వాటిని నమ్ముకుని గుడ్డిగా పందాలు కట్టి దెబ్బ తింటారు పంటర్లు. పందాలు కాసే వారి బలహీనతే పెట్టుబడిగా సర్వేలను పక్కాగా తెరపైకి తెస్తారు. దీనివెనుక పెద్ద రాకెట్ నడుస్తుందని నిఘా వర్గాల అంచనా.

మొదట శాంపిల్ ...

పోలింగ్ జరిగిన వెంటనే వచ్చే ఎగ్జిట్ పోల్స్ సర్వేలు అన్ని బెట్టింగ్ నిర్వాహకులకు అనుకూలమని విశ్లేషకులు చెబుతున్నారు. వీటిని చూసి పందాలు కాస్తే మొదటికే మోసానికి గురౌతారని కొందరు హెచ్చరిస్తున్నారు. బెట్టింగ్ మాఫియా వలలో పడి నిలువుదోపిడికి గురికావొద్దని కూడా పిలుపునిస్తున్నారు. లగడపాటి సర్వేనే పరిశీలిస్తే ఆయన తొలి విడత ఇచ్చిన నివేదిక పంటర్లను అయోమయంలో పెట్టేందుకేనని కౌటింగ్ ముందు ఇచ్చే నివేదిక మాత్రం కొంత వాస్తవం అవ్వచ్చని గత అనుభవాలు చెప్పుకొస్తున్నారు. అందుకే రాజగోపాల్ మరో రెండు రోజుల తరువాత విశ్లేషించి చెబుతానని చెప్పడం అందుకే అన్న గుట్టు విప్పుతున్నారు. పారిశ్రామిక వేత్తగా కోట్ల రూపాయలకు పడగలు ఎత్తిన లగడపాటి బెట్టింగ్ బాబుల కోసం ఇలాంటివి చేస్తారా ? అన్న సందేహం కూడా పలువురిలో వ్యక్తం అవుతుంది. అయితే డబ్బు ఎవరికి చేదు అన్న చర్చా నడుస్తుంది.

Similar News