లగడపాటీ..... ఇక సర్దుకో....!!!

Update: 2018-12-11 17:00 GMT

ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి సర్వే ముక్కలయింది. కేటీఆర్ చెప్పినట్లుగా ఇప్పుడు ఆయన రాజకీయ సన్యాసమే కాదు సర్వే సన్యాసం కూడా తీసుకోవాల్సిన పరిస్థతి వచ్చింది. లగడపాటి రాజగోపాల్ కు చెందిన ఆర్ జే ఫ్లాష్ టీం సర్వేకు క్రెడిబులిటీ ఉంది. ఆయన గతంలో జరిపిన అనేక సర్వేలు ఖచ్చితమైన ఫలితాలు ఇచ్చాయి. దీంతో లగడపాటి సర్వేలంటే ప్రజల్లో విశ్వసనీయత ఉంది. అయితే తెలంగాణ ఎన్నికల్లో లగడపాటి రాజగోపాల్ సర్వే తలకిందులయింది. ఆయన పోలింగ్ కు నాలుగు రోజుల ముందు సర్వే ఫలితాలను ప్రకటించడం కూడా అనేక అనుమానాలకు తావిచ్చింది.

ప్రజాకూటమి గెలుస్తుందని.....

లగడపాటి రాజగోపాల్ తెలంగాణ ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజాకూటమి గెలుస్తుందని చెప్పారు. ప్రజాకూటమికి దాదాపు 65 స్థానాలు వస్తాయని చెప్పారు. అంతేకాదు టీఆర్ఎస్ కు 35 స్థానాలకు మించి రావని తెలిపారు. ఈసర్వే ను రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు విశ్వసించారు. జాతీయ ఛానెళ్లన్నీ దాదాపు తెలంగాణ రాష్ట్ర సమితి విజయం సాధిస్తుందని చెప్పినా అందుకు విరుద్థంగా లగడపాటి సర్వే వెలువడటంతో కొంత అయోమయం నెలకొంది. లగడపాటి రాజగోపాల్ సర్వే పరాకాష్టగా మారింది.

ముందే వెల్లడించడంతో.....

లగడపాటి రాజగోపాల్ నాలుగు రోజుల ముందే సర్వే ఫలితాలను వెల్లడించడం కూడా మహాకూటమికి చేటయిందన్నది విశ్లేషకుల అంచనా. లగడపాటి అలా చెప్పి ఉండకపోతే కొంత తెలంగాణ ఓటర్లు మహాకూటమి వైపునకు మొగ్గు చూపే వారంటున్నారు. కానీ రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంటులో పెప్పర్ స్ప్రే చల్లిన లగడపాటిని తెలంగాణ ప్రజలు నేటికీ మర్చిపోలేదు. దీంతో చివరి రెండురోజుల్లో తెలంగాణ వాసులు తమ మనసును మార్చుకున్నారన్నది స్పష్టంగా తెలుస్తోంది.

సర్వేలు మానేస్తారా...?

మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఇక సర్వేల జోలికి వెళ్లకపోతేనే మంచిదని సోషల్ మీడియాలో వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ఆయన కేవలం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగానే సర్వే ఫలితాలను ముందుగా వెల్లడించారన్న అనుమానంతోనే తెలంగాణ ప్రజలు గులాబీ పార్టీకి అండగా నిలిచారంటున్నారు. మొత్తం మీద లగడపాటి రాజగోపాల్ సర్వే రివర్స్ అయింది. ఇప్పుడు ఆయన ఏం సమాధానం చెబుతారో చూడాలి.

Similar News