కాంప్రమైజ్ అయినట్లుందే.....!!!

Update: 2018-12-20 06:30 GMT

కేవీపీ రామచంద్రరావు క్రమంగా కాంప్రమైజ్ అవుతున్నారా? తెలుగుదేశం పార్టీతో పొత్తుతో ఆయన ఇటీవల కాలంలో కొంత ఇబ్బంది పడుతున్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబునాయుడిపై ఒంటికాలి మీద లేచే కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు తెలంగాణ ఎన్నికల తర్వాత కొంత మెత్తబడినట్లు కన్పిస్తోంది. తాజాగా పార్లమెంటు ఆవరణలో ప్రత్యేక హోదా కోసం నిరసనదీక్షలకు దిగిన తెలుగుదేశం పార్టీ ఎంపీలకు ఆయన సంఘీభావం ప్రకటించడం కూడా చర్చనీయాంశమైంది. ఆయన తొలుత కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ పొత్తును వ్యతిరేకించిన తెలుగు నేతల్లో మొదటి వారు.

వెంపర్లాడింది లేదని.....

సుదీర్ఘకాలం టీడీపీతో పోరాటం చేశామని, ఆ పార్టీతో కలసి ప్రయాణం చేస్తే ప్రజలు ఆదరించరని అధిష్టానానికి సయిత నచ్చ జప్పే ప్రయత్నం చేశారు. కాని జాతీయ రాజకీయాలు, మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించే ఎత్తుగడల్లో భాగంగా అన్ని పార్టీలనూ కలుపుకు పోవాలన్నదే కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం. బీజేపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు తనంతట తానే కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించారని, ఇందులో కాంగ్రెస్ వెంపర్లాడింది ఏమీ లేదని కూడా అగ్రనేతలు కొందరు కేవీపి రామచంద్రరావుకు నచ్చ జెప్పినట్లు తెలిసింది.

నివేదిక ఇచ్చినా....

అయితే తెలంగాణలో మహాకూటమి దారుణంగా వైఫల్యం చెందడంపై కూడా కేవీపీ ప్రత్యేకంగా ఒక నివేదికను పార్టీ హైకమాండ్ కు ఇచ్చినట్లు సమాచారం. తెలంగాణాలో చంద్రబాబు పార్టీని కలుపుకుని పోకుండా తెలంగాణ జనసమితి, సీపీఐ వంటి పార్టీలతో కలసి వెళ్లి ఉంటే ఇంత దారుణ ఓటమి చవిచూసి ఉండేవాళ్లం కాదని ఆయన తన నివేదికలో పేర్కొన్నారని చెబుతున్నారు. అయితే దీనిపై హైకమాండ్ నుంచి పెద్దగా స్పందన లేదని సమాచారం. మరోవైపు లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో దక్షిణాది రాష్ట్రాల్లో బలహీనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రాంతీయ పార్టీల సహకారం అవసరమని కూడా కాంగ్రెస్ అధినేత రాహుల్ గట్టిగా భావిస్తున్నారు. అందుకోసమే వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో చంద్రబాబు అంగీకారంతోనే కలసి వెళ్లాలని కూడా నేతలకు చెప్పినట్లు సమాచారం.

సీట్ల కోసం పట్టు వద్దంటూ....

అలాగే సీట్ల కోసం కూడా పంచాయతీ పెట్టవద్దని కూడా రాహుల్ పరోక్షంగా కేవీపీకి సంకేతాలు ఇచ్చినట్లు చెబుతున్నారు. ఏపీలో కాంగ్రెస్ బలహీనంగా ఉండటంతో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన సీట్లతోనే సర్దుకుపోవాలని, ఎంపీ స్థానాలను కొంచెం ఎక్కువగా కోరాలని ఆ పార్టీ భావిస్తోంది. తెలంగాణ ఎన్నికలలో టీడీపీ ఎక్కువ సీట్ల కోసం పట్టుబట్టకపోవడాన్ని కూడా కాంగ్రెస్ అగ్రనేతలు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఇలా కాంగ్రెస్, టీడీపీ కలసి పోటీ చేయాలన్నది దాదాపుగా ఖాయమవ్వడంతో కేవీపీ రామచంద్రరావు కూడా హైకమాండ్ మాటను కాదనలేక కాంప్రమైజ్ అయ్యారన్న గుసగుసలు విన్పిస్తున్నాయి. మరి వైఎస్ ఆత్మగా చెప్పుకునే కేవీపీ భవిష్యత్తులో ఆయన అభిమానులకు ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.

Similar News