ఊహించిందే అయినా... పరీక్షల తర్వాతే...?

Update: 2018-12-15 05:00 GMT

కల్వకుంట్ల తారకరామారావు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి కి వర్కింగ్ ప్రెసిడెంట్ కావడం వెనుక అనేక ముళ్లపొదల్ని అవలీలగా దాటిన చరిత్ర సొంతం చేసుకున్నారు. రాత్రికి రాత్రి కేసీఆర్ కుమారుడికి పట్టాభిషేకం చేయలేదు. దానికి ముందు ఎన్నో పరీక్షలు పెట్టారు గులాబీ బాస్. వాటి అన్నిట్లో నూటికి నూరుశాతం మార్కులతో పాస్ అయ్యారు కె.టి.రామారావు. పేరుకి వారసత్వ రాజకీయాలే అయినా కేటీఆర్ అన్ని అగ్నిపరీక్షలే ఎదుర్కొన్నారు. తండ్రి వేసిన మార్గంలో ఆయనకు మించిన తనయుడిగా అడుగులు వేస్తూ సాగారు. పార్టీలో అందరి మన్ననలు అందుకున్నారు. భవిష్యత్తు గులాబీ దళపతిగా క్యాడర్ మెచ్చిన తరువాతే కేటీఆర్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పట్టాభిషేకం చేశారు తెలంగాణ చంద్రుడు.

నాటి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ...

అమెరికాలో ఉన్నత స్థానాన్ని వదులుకుని తండ్రి పిలుపు మేరకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు కేటీఆర్. అనేక సార్లు అరెస్ట్ లు జైళ్లు, క్లిష్టమైన రైల్వే కేసులు ఇప్పటికి కోర్టు ల చుట్టూ తిరిగే పరిస్థితి కెటిఆర్ ప్రస్థానంలో ఒక భాగం. ఎట్టకేలకు తండ్రి పోరాటం ఫలించి కోరుకున్న ప్రత్యేక రాష్ట్రం దక్కింది. దాంతో పాటు అధికారం గులాబీ జెండాదే అయ్యింది. తన కొడుకు సత్తాకు సిసలైన పరీక్ష పెడుతూ కీలక శాఖలను కేసీఆర్ అప్పగించారు ఆ శాఖలను సమర్ధవంతంగా నిర్వహిస్తూ తనదైన శైలిలో దూసుకుపోయారు కేటీఆర్.

భాగ్యనగర్ ఎన్నికల్లో సత్తా చాటి ...

వైఎస్ వున్నప్పుడు ఆ తరువాత కూడా టీఆర్ఎస్ కు భాగ్యనగర్ ఎన్నికలంటే భయమే. ఒక సందర్భంలో బలం లేని చోట పోటీ ఎందుకని నగరపాలక ఎన్నికలకు గులాబీ పార్టీ దూరం గా వుంది. అలాంటి చోట తండ్రిని మించిన తనయుడిగా సత్తా చాటి చెప్పారు కేటీఆర్. భాగ్యనగర్ నగరపాలిక ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఊహించని విజయాన్ని అందించి తన రాజకీయ పరిణతిని చిన్నవయస్సులోనే ప్రత్యర్థులకు చూపించి గులాబీ పార్టీకి భావి వారసుడిగా నిలిచారు. ఆ ఎన్నికల్లో పార్టీని విజయ తీరాలకు చేర్చాలిసిన బాధ్యతను కేసీఆర్ కుమారుడికి అప్పగించి పరీక్ష పెట్టారు. దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నారు కేటీఆర్.

ముందస్తు లోను సిసలు సవాల్.....

రాజకీయ వాతావరణం బాగుండటంతో ముందస్తు ఎన్నికలకు తెరతీశారు కేసీఆర్. మహాకూటమి రూపంలో విపక్షాలన్నీ ఒక్కటై దండెత్తిన సమయంలో కేటీఆర్ రూపంలో వున్న అస్త్రాన్ని వారిపై ప్రయోగించారు గులాబీ దళపతి. మళ్ళీ పాచిక పారింది. హైదరాబాద్ లో మహాకూటమి అత్యధిక స్థానాలు గెలుచుకుంటుంది అన్న అంచనాలను ఒంటిచేత్తో తలకిందులు చేస్తూ తండ్రి అంచనాలను ఏమాత్రం తగ్గకుండా ప్రత్యర్థులను ఘోరపరాజయానికి గురిచేశారు కేటీఆర్. అందుకోసం ఆయన పడిన శ్రమ అంతా ఇంతా కాదు. వేయని ఎత్తు లేదు చేయని పని లేదు అన్నట్లు సాగిపోయారు.

సమర్దుడిగా నిర్ధారించుకుని ...

పార్టీని భవిష్యత్తులో ముందుకు తీసుకువెళ్ళడానికి అన్ని రకాల సమర్థుడని నిరూపించుకున్నాకే కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని అప్పగించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీని మరింత ముందుకు తీసుకువెళ్లాలి అంటే చురుకైన సమర్ధుడైన నాయకుడు అవసరం. వృద్ధాప్యం మీద పడిన నేపథ్యంలో తనపై వున్న వత్తిడిని క్రమంగా తగ్గించుకుంటూ వస్తున్నారు కేసీఆర్ . జాతీయ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాలిసిన తరుణంలో తెలంగాణ రాజకీయ చరిత్రకు కొత్త అధ్యాయం లిఖించేందుకు సర్వ సైన్యాధ్యక్ష నియామకపత్రం జారీచేసి గులాబీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపారు కేసీఆర్.

Similar News