సింబల్ గాయబ్ అవుతుందా?

Update: 2018-12-24 00:30 GMT

కొత్తగా పార్టీని పెట్టారు. ఉద్యమంలో నుంచి వచ్చామని చెప్పారు. ముందస్తు ఎన్నికలకు వచ్చేసరికి ఒంటరిగా బరిలోకి దిగలేక కూటమిలో సెట్ అయిపోయారు. కాని ఎన్నికల ఫలితాలను చూసి తమకు దక్కిన సింబల్ , పార్టీ గుర్తింపు కూడా ఉంటుందా? ఊడుతుందా? అన్న భయం పట్టుకుంది. ప్రొఫెసర్ కోదండరామ్ నేతృత్వంలో తెలంగాణ జనసమితికి ఇప్పుడు గుర్తింపు భయం పట్టుకుంది. కోదండరామ్ అంటే తెలంగాణ ప్రజలకు ఎనలేని గౌరవం. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన పాత్ర కాదనలేనిది. ఆయన జేఏసీ ఛైర్మన్ గా వ్యవహరించిన తీరు కూడా ప్రశంసనీయమే. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంకాక్షలు నెరవేరడం లేదంటూ కోదండరామ్ ప్రత్యేక పార్టీ పెట్టుకున్నారు.

బలపడకముందే.....

అయితే కోదండరామ్ క్షేత్రస్థాయిలో బలపడకముందే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లిపోయారు. బలపడే సమయం లేదు. దీంతో కోదండరామ్ తాను పెట్టిన తెలంగాణ జనసమితిని మహాకూటమిలో చేర్చారు. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐతో కలసి పోటీ చేశారు. పొత్తులో భాగంగా మొత్తం 8 స్థానాల్లో తెలంగాణ జన సమితి పోటీ చేసింది. అయితే ఒక్క చోట మినహా అన్ని చోట్ల డిపాజిట్లు కూడా గల్లంతయ్యాయి. ఎన్నికల కమిషన్ తెలంగాణ జన సమితికి కామన్ సింబల్ గా అగ్గిపెట్టె గుర్తును కేటాయించింది. ప్రాంతీయ పార్టీగా గుర్తింపు దక్కింది.

డిపాజిట్ కూడా దక్కక....

కాని ఎన్నికల ఫలితాలను చూస్తే కోదండరామ్ పార్టీకి కేవలం 0.5 శాతం ఓట్లు మాత్రమే లభించడం విశేషం. దీంతో గుర్తింపు దక్కుతుందా? లేదా? అన్న టెన్షన్ లో ఆ పార్టీ నేతలున్నారు. తక్కువ కాలంలో వచ్చి ఎనిమిది స్థానాల్లో పోటీ చేస్తే కనీసం అభ్యర్థులకు డిపాజిట్ కూడా దక్కకపోవడంతో ఆ పార్టీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. తనను ప్రజలు ఆదరిస్తారని ఎంతో నమ్మకం పెట్టుకున్న కోదండరామ్ ఫలితాల తర్వాత నిరాశ పడ్డారు. ఈ ఎన్నికల ఫలితాల ఆధారంగానే శాశ్వత కామన్ సింబల్ ను ఎన్నికల కమిషన్ కేటాయిస్తుంది.

వచ్చిన ఓట్లను బట్టి...

ఎనిమిది స్థానాల్లో పోటీ చేసిన తెలంగాణ జన సమితికి కేవలం 95వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. ఓట్ల శాతం 0.5 శాతం మాత్రమే. జాతీయ పార్టీలయితే నాలుగు లేదా ఐదు రాష్ట్రాల్లో పది స్థానాలకు తక్కువ కాకుండా పోటీ చేసి 6 శాతం ఓట్లు తెచ్చుకోవాల్సి ఉంటుంది. కాీన ప్రాంతీయ పార్టీలు మాత్రం ఎన్నికల నిబంధనలను అనుసరించి నలభై అయిదు నుంచి యాభై స్థానాల్లో పోటీ చేయాల్సి ఉంటుంది. అందులో కనీసం ఆరు శాతం ఓట్ల శాతాన్ని సాధించాలి. అప్పుడే కామన్ సింబల్, పార్టీ గుర్తింపు ఉంటుందంటున్నారు. అయితే వచ్చే పార్లమెంటు ఎన్నికల వరకూ తెలంగాణ జనసమితికి కామన్ సింబల్ ఉంటుందని, ఆ ఎన్నికలలో ఓట్ల శాతాన్ని బట్టి గుర్తును తొలగిస్తారని కొందరు చెబుతున్నారు. మొత్తం మీద కామన్ సింబల్, పార్టీ గుర్తింపు భయం జనసమితి నేతల్లో పట్టుకుంది.

Similar News