కేజ్రీ డెసిషన్ పెండింగ్....!!!

Update: 2018-12-18 17:30 GMT

అవినీతికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ అది. సామాన్యుడి పార్టీ అది. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉద్భవించిన పార్టీ అది. అందుకే జనం రెండు సార్లు అందలమెక్కించారు. అవినీతికి వ్యతిరేకంగా అన్నాహజారే స్ఫూర్తితో ఆవిర్భవించిన ఈ పార్టీపై ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ కాంగ్రెస్ తో కలసి తప్పు చేస్తారా? అన్న చర్చ సోషల్ మీడియాలో జోరుగా విన్పిస్తుంది. కుంభకోణాలకు, అవినీతికి నిలయమైన పార్టీతో ఎలా చేతులు కలుపుతారన్న ప్రశ్నలు నెటిజన్లు సూటిగాప్రశ్నిస్తున్నారు. కేజ్రీవాల్ నిర్ణయం పార్టీకి చేటు తెస్తుందేమోనన్న ఆందోళన ఆ పార్టీలోనే వ్యక్తమవుతుండటం విశేషం.

కాంగ్రెస్ కు దగ్గరయితే.....?

కేజ్రీవాల్ గత కొన్నాళ్లుగా కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్నారన్న ఊహాగానాలు విన్పిస్తున్నాయి. బీజేపీ యేతర కూటమిలో ఆయన చేరతారన్న సంకేతాలు కన్పిస్తున్నాయి. మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించే లక్ష్యంగా కేజ్రీ కాంగ్రెస్ తో చేతులు కలుపనున్నారని పార్టీ అంతర్గత వర్గాల సమాచారం. దీనికితోడు 2019 లోక్ సభ ఎన్నికల్లో మోదీని దించడమే లక్ష్యమని కేజ్రీవాల్ పలు సందర్భాల్లో చేస్తున్న వ్యాఖ్యలు దీనికి అద్దం పడుతున్నాయి. ఈనేపథ్యంలో కాంగ్రెస్ తో కలవడం మంచిదా? కదా? అన్న చర్చ పార్టీలో బలంగా జరుగుతుందని తెలుస్తోంది.

గతంలో కలసి పనిచేసినా....

2013 లో జరిగిన ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో కేజ్రీవాల్ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాలేదు. అయితే బీజేపీని గద్దెనెక్కకుండా చూడాలని కేజ్రీవాల్, కాంగ్రెస్ పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కానీ 49 రోజులకే రెండు పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి. జన్ లోక్ పాల్ బిల్లు విషయంలో కాంగ్రెస్ అడ్డం తిరగడంతో ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీ ప్రజలు పూర్తి స్థాయి మెజారిటీ అప్పగించారు. జన్ లోక్ పాల్ బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకించడాన్ని ఇప్పటీకి ఆప్ నేతలు మర్చిపోవడం లేదు.

కాంగ్రెస్ తో చేతులు కలిపితే.....?

వచ్చే ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో సయితం త్రిముఖ పోటీ తప్పక ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలసి పనిచేయడం కేజ్రీవాల్ పార్టీకి ఇబ్బందే. అందుకే ఆయన వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మోదీని దెబ్బ తీయాలంటే కాంగ్రెస్ కూటమిలో చేరాలన్న ఒత్తిడి కూడా బాగానే పెరుగుతోంది. మతోన్మాద శక్తులను తరిమికొట్టాలన్న నినాదంతో కాంగ్రెస్ తో చేతులు కలిపితేనే బాగుంటుందన్న మేధావుల సూచనలు కూడా కేజ్రీ పరిగణనలోకి తీసుకోనున్నారు. అందుకే ఆయన కూటమిలో చేరడంపై ఇంతవరకూ అధికారికంగా ప్రకటనలు చేయడంలేదు. ఒకవేళ దేశంలో బీజేపీ, కాంగ్రెస్ యేతర కూటమి ఏర్పడితే దానికి జై కొట్టాలన్నది కేజ్రీవాల్ ఆలోచన గా ఉంది. మొత్తం మీద కేజ్రీవాల్ నిర్ణయం కోసం విపక్ష కూటమిలోని పార్టీలన్నీ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

Similar News