వాళ్లు వస్తే... బాబుకి బూస్ట్ దొరికినట్లే..!

Update: 2018-12-16 05:00 GMT

మూడు నెలల పాటు హాట్ హాట్ గా సిగిన తెలంగాణ రాజకీయం ముగిసింది. ఇక ఇప్పుడు అందరి కళ్లూ ఆంధ్రప్రదేశ్ పై పడ్డాయి. మరో నాలుగు నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే, తెలంగాణ ఎన్నికల ప్రభావం ఏపీ ఎన్నికలపై ఉంటుందో ఉండదో కానీ తెలంగాణలో నాయకులు చేసిన వ్యాఖ్యలు మాత్రం కచ్చితంగా ప్రభావం చూపేలా ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... చంద్రబాబుకు ‘రిటర్న్ గిఫ్ట్’ ఉంటుందని చెప్పడం, ఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఓవైసీ... తన స్నేహితులు జగన్ తరపున ప్రచారం చేస్తాననడం... చంద్రుడూ.. ఐయాం కమ్మింగ్ టూ ఆంధ్రప్రదేశ్ అంటూ సినిమా స్టైల్ లో చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిన్న కేటీఆర్ కూడా జాతీయ రాజకీయాల్లో తాము కీలకమవుతున్నామని, అందులో భాగంగా ఏపీ రాజకీయాల్లోనూ తమ పాత్ర ఉంటుందని చెప్పుకొచ్చారు. పైగా ఏపీలో ఎన్నికల తర్వాత టీడీపీ పాత్ర నామమాత్రం అవుతుందని, బలమైన ప్రాంతీయ పార్టీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పడం ఆసక్తికరంగా మారింది.

చంద్రబాబును కట్టడి చేయడానికే...

ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటామని ఎన్నికల ముందు కేటీఆర్, ఎన్నికల తర్వాత కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే, నిజంగానే టీఆర్ఎస్ పార్టీ నేరుగా ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టే అవకాశం ఉందా..? అంటే అనుమానమే. తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు ప్రత్యక్షంగా పాల్గొని ప్రచారం చేశారు. కేసీఆర్ ను, ఆయన పాలనను తీవ్రస్థాయిలో విమర్శించారు. ఏపీలోని తన బలగాన్నంతా తెలంగాణలో దించారు. దీంతో చంద్రబాబు స్పీడ్ ను తగ్గించి, కట్టడి చేయడానికే కేటీఆర్ ఆ సమయంలో అటువంటి వ్యాఖ్యలు చేశారు కానీ నిజంగా వారు ఏపీలోకి ఎంటర్ అయ్యే అవకాశం లేదంటున్నారు.

కూకట్ పల్లిలో మద్దతిచ్చినా...

చంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కూకట్ పల్లి నియోజకవర్గంలో టీఆర్ఎస్ కి జగన్, పవన్ అభిమానులు సహకరించారనడంలో ఎటువంటి సందేహం లేదు. జగన్ తో టీఆర్ఎస్ పెద్దలకు మంచి సంబంధాలే ఉన్నాయి. కానీ, మరీ అంత దగ్గరగా ఏమీ లేరు. పవన్ కళ్యాణ్ మాత్రం కేసీఆర్ ని కలిసి ఆయన పాలనను పొగిడారు. అయితే, తెలంగాణ ఎన్నికల్లో సహకరించినందుకు ప్రతిఫలంగా కేసీఆర్ జగన్, పవన్ కి సహకరించవచ్చు. కానీ, ఏకంగా ఏపీలోకి వెళ్లి ప్రచారం చేస్తారనడం మాత్రం ఊహనే అవుతుంది. కేసీఆర్ కి తెలంగాణలో కొందరు అభిమానులు తయారుకావచ్చు. కానీ, విభజనకు కారకుడిగా, ఉద్యమ సమయంలో ఆంధ్ర ప్రజలను తిట్టిన వ్యక్తిగా ధ్వేషించే వాళ్లే ఎక్కువ. ఇవన్నీ పక్కనపెట్టినా... కేసీఆర్ ప్రచారం చంద్రబాబు నాయుడు నెత్తిన పాలు పోసినట్లే అవుతుంది. ఇందుకు తెలంగాణ ఎన్నికలే ఉదాహరణ. తెలంగాణలో అప్పటి వరకు టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా ఉన్న వార్ లో చంద్రబాబు ఎంటరయ్యి టీఆర్ఎస్ చేతిలో ఒక అస్త్రమయ్యారు. కేసీఆర్ ప్రతి ప్రసంగంలోనూ చంద్రబాబుని టార్గెట్ చేసి ఆయన పెత్తనం అవసరమా అనే ప్రజల్లోకి బాగా తీసుకెళ్లారు. దీంతో చంద్రబాబు ప్రచారం కాస్త బూమరాంగ్ అయ్యి టీఆర్ఎస్ కి భారీ విజయాన్ని కట్టుబెట్టిందనే విశ్లేషణలు ఉన్నాయి.

చంద్రబాబుకు అవకాశం ఇస్తారా..?

ఇక, రాజకీయాల్లో వ్యూహాలు పన్నడం దిట్ట అయిన కేసీఆర్... చంద్రబాబు చేసిన తప్పిదం చేసే అవకాశం ఏమాత్రం లేదు. ఒకవేళ కేసీఆర్ నేరుగా ఏపీకి వెళ్లి జగన్ తరపునో, పవన్ తరపునో ప్రచారం చేస్తే చంద్రబాబు దీనిని పూర్తిగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. కేసీఆర్ గతంలో ఆంధ్ర ప్రజలపై చేసిన వ్యాఖ్యలు, విభజనకు కారకుడనే అంశం, పోలవరంపై అభ్యంతరం తెలపడం, ఏపీకి ప్రత్యేక హోదాను వ్యతిరేకించడం వంటి అంశాలను చంద్రబాబు బాగా ప్రచారం చేసే అవకాశం ఉంది. ఒకవేళ కేసీఆర్ కి బలపరిచే పార్టీనే గెలిస్తే ఇవన్నీ ఆగిపోతాయని, కేసీఆర్ చేతిలో ఏపీ ప్రభుత్వం ఉంటుందనే వాదన తెరపైకి తెచ్చే అవకాశం ఉంది. ఇది చంద్రబాబుకు బాగా కలిసివస్తుంది. కాబట్టి, చంద్రబాబు ఓడిపోవాలని భావిస్తున్న కేసీఆర్ ఆయనకు ఒక అవకాశంగా మారే ఛాన్స్ లేదు. పైగా, కేసీఆర్ ప్రచారంతో జగన్ లేదా పవన్ కి పెద్దగా ఒరిగేదేమీ లేదు. కాకపోతే కేసీఆర్ వారికి ఇతర విధాలుగా సహకరించవచ్చు కానీ... నేరుగా ప్రచారం చేస్తే మాత్రం మొదటికే మోసం వస్తుంది. ఈ విషయం కేసీఆర్ కి తెలుసని, అందుకే ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఏపీ రాజకీయాల్లో కానీ, ఎన్నికల్లో కానీ నేరుగా జోక్యం చేసుకోరని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

అసదుద్దిన్ వచ్చినా అంతేనా..?

ఇక, ఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఓవైసీ అయితే ఏకంగా తాను జగన్ తరపున ప్రచారం చేస్తా అని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ లో ముస్లిం మైనారిటీల ప్రభావం ఎక్కువగా అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లోనే ఎక్కువగా ఉంటుంది. అయితే, ముస్లిం మైనారిటీలు ఎక్కువగా జగన్ వైపే ఉన్నారనే అంచనాలు ఉన్నాయి. ఈ సమయంలో అసద్ ప్రచారం వల్ల జగన్ కు అదనంగా కలిగే లబ్ది ఏమీ ఉండకపోవచ్చు. పైగా ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అసద్ ను తీసుకువచ్చి ప్రజల మధ్య విభజన తీసుకువస్తున్నారని జగన్ వ్యతిరేక టీడీపీ ప్రచారం చేసే అవకాశం కూడా ఉంది. ఇది జగన్ కు చాలా మైనస్ చేస్తుంది. కాకపోతే, ‘బీజేపీతో జగన్ స్నేహం’ అంటూ టీడీపీ చేస్తున్న ప్రచారానికి మాత్రం కొంత చెక్ పెట్టే అవకాశం ఉంది. ఒకవేళ జగన్ బీజేపీ పక్షాన్నే ఉన్నట్లయితే బీజేపీకి బద్ధ వ్యతిరేకి అయిన అసదుద్దిన్ ఓవైసీ జగన్ తరపున ఎందుకు ప్రచారం చేస్తారనే అంశం తెరపైకి వస్తుంది. ఇది జగన్ కి కొంత మేలు చేసే అవకాశం ఉంది. మొత్తానికి, కేసీఆర్, ఓవైసీ... జగన్ వైపు ఉంటే వచ్చే నష్టమేమీ లేదు... కానీ నేరుగా ఏపీకి ఎంటర్ అయ్యి ప్రచారం చేస్తే మాత్రం అది జగన్ కే నష్టం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Similar News