కేటీఆర్... తొలి అడుగు... తర్వాత..?

Update: 2018-12-14 08:00 GMT

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర ప్రజలు తిరుగులేని మెజారిటీతో కేసీఆర్ ను మరోసారి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడంతో ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. దేశ రాజకీయాలపై దృష్టి పెడతానని ముందు నుంచే చెబుతున్న ఆయనకు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు అడ్డంకిగా ఉండేవి. దీంతో ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్లి విజయం సాధించి జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారు. దీంతో ఆయన తనయుడు కేటీఆర్ కి కీలక బాధ్యతలు అప్పగించారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ గా కేటీఆర్ ను నియమించారు. పేరుకు పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ ఉన్నా ఇక నుంచి పార్టీ వ్యవహారాలన్నీ కేటీఆర్ చూసుకోనున్నారు. అయితే, ఇది తొలి అడుగేనని... దీని తర్వాత కేటీఆర్ ను ముఖ్యమంత్రి పీఠం ఎక్కిస్తారనే ఊహాగానాలు వస్తున్నాయి.

ప్రత్యర్థుల విమర్శలకూ ఆస్కారం లేదు...

అమెరికాలో ఉన్నతోద్యోగం వదులుకుని వచ్చిన కేటీఆర్ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. సిరిసిల్ల నుంచి నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా పనిచేశారు. దీంతో ఆయన అనుభవానికి కొరతేమీ లేదు. ఇప్పటికే అనధికారికంగానైనా పార్టీ వ్యవహారాలు ఆయనే చూసుకుంటున్నారు. ఇక, కుటుంబ పాలన, వారసత్వం అనే ప్రత్యర్థుల ఆరోపణలకు కేసీఆర్, కేటీఆర్ ఇప్పటికే ధీటైన జవాబు ఇచ్చారు. తానేమీ నేరుగా మంత్రిని కాలేదని, ప్రజల నుంచి గెలిచే వచ్చానని ఆయన ఆ విమర్శలను తిప్పికొట్టారు. ఇక, ఇటీవలి ఎన్నికల్లోనూ కేటీఆర్ ను గద్దేనెక్కించడానికే ముందస్తుకు వెళ్లారంటూ ప్రత్యర్థి పార్టీలు ప్రజల్లోకి తీసుకెళ్లినా ప్రజలు టీఆర్ఎస్ కే పట్టం కట్టారు. దీంతో ఇప్పుడు ప్రత్యర్థి పార్టీల నోళ్లూ మూతపడ్డాయి. దీంతో కేసీఆర్ ప్రమాణస్వీకారం చేసిన మరుసటి రోజే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. దీంతో గత రెండేళ్లుగా కేటీఆర్ ను వర్కింగ్ ప్రసిడెంట్ చేస్తారని వార్తలు వస్తున్నా... కేసీఆర్ సరైన సమయం కోసం వేచి చూసి ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు.

పార్లమెంటు ఎన్నికలకు ముందా... తర్వాతా..?

వచ్చే ఎన్నికల్లో గెలిచాక కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలనుకోవడం పెద్ద ప్రయోగమే అవుతుంది. ఎందుకంటే సహజంగా పదేళ్లు అధికారంలో ఉన్న పార్టీ పట్ల వ్యతిరేకత ఉంటుంది. భారీగా సానుకూలత ఉంటే తప్ప మళ్లీ గెలిచే అవకాశాలు తక్కువగా ఉంటాయి. మళ్లీ అధికారం కోసం ఎనేళ్లు ఆగాలో తెలియదు. అందుకే ఇప్పుడే కేటీఆర్ ను అధికార పీఠం ఎక్కించాలని కేసీఆర్ భావిస్తున్నారని అంటున్నారు. అయితే, పార్లమెంటు ఎన్నికలకు ముందు ఈ నిర్ణయం తీసుకుంటారా లేదా తర్వాత తీసుకుంటారా అనే చర్చ నడుస్తోంది. ముందే తీసుకోవాలనుకుంటే జాతీయ రాజకీయాల్లో బిజీగా ఉన్నందున కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చెస్తున్నట్లు చెప్పవచ్చు. అయితే, ఈ ప్రభావం పార్లమెంటు ఎన్నికల్లో పడి పార్టీకి కొంత వ్యతిరేకంగా మారే అవకాశమూ ఉంటుంది. పార్లమెంటు ఎన్నికల తర్వాత చేయాలనుకుంటే మాత్రం సహేతుక కారణం ఏదీ ఉండకపోవచ్చు. మొత్తానికి, కేటీఆర్ ను ముఖ్యమంత్రి పీఠం ఎక్కించడం ఖాయమే కానీ... పార్లమెంటు ఎన్నికలకు ముందా... తర్వాతా అనేది తేలాల్సి ఉంది.

Similar News