సౌత్ ‘సారీ’ అంటోంది... నార్త్ ‘నో‘ అంటే..?

Update: 2018-12-22 02:30 GMT

తెలంగాణ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సాధించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు అదే ఊపుతో దేశ రాజకీయాల్లో కీ రోల్ ప్లే చేసే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. ఆయన వచ్చే వారం వివిధ రాష్ట్రాల్లో పర్యటించి పలువురు కీలక నాయకులను కలువనున్నారు. ప్రాంతీయ పార్టీల కూటమి దేశాన్ని పాలించాలని బలంగా కోరుకుంటున్న కేసీఆర్ వాస్తవానికి ఆరు నెలల క్రితమే కేసీఆర్ ఈ దిశగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అప్పుడే వివిధ రాష్ట్రాల్లో పర్యటించి, పలువురు నాయకులతో సమావేశమై తన ఆలోచనలను పంచుకున్నారు. తర్వాత ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు ఆగిపోయాయి. ఇప్పుడు ఆయన మరోసారి ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. వచ్చే వారం ఆయన నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీ, మాయవతి వంటి వారిని కలిసేందుకు షెడ్యూల్ ఖరారైంది.

దక్షిణాదిన అయితే ఛాన్స్ లేదు...

కేసీఆర్ ఆలోచన విధానం బాగున్నా ఆయన ప్రయత్నాలు ఫలిస్తాయా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో బలమైన నాయకులు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తోనో, బీజేపీతోనూ కలిసి ఉన్నారు. మరికొందరైతే అవకాశం వస్తే తామే దేశాన్ని పాలించాలనుకుంటున్నారు. ఈ దశలో కేసీఆర్ చేస్తున్నా ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో చెప్పలేం. ప్రధానంగా దక్షిణాదిన కేసీఆర్ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు లేవు. తెలంగాణను వదిలేసి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే... ఇక్కడ చంద్రబాబు ఇప్పటికే కాంగ్రెస్ తో ప్రయాణం ప్రారంభించారు. ఇక జగన్మోహన్ రెడ్డి.. ప్రత్యేక హోదా ఇచ్చిన వారికి మా మద్దతు అని స్పష్టంగా చెప్పారు. కేసీఆర్ ఏమో ఏపీకి ప్రత్యేక హోదాను వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఏపీలో కేసీఆర్ వైపు ఉండే వారు ప్రస్తుతానికి ఎవరూ లేరు. తమిళనాడులో స్టాలిన్... కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీనే అని మొన్ననే ప్రకటించేశారు. ఇక అన్నా డీఎంకే విషయానికి వస్తే జయలలిత మరణించాక... బీజేపీ సిట్ అంటే సిట్... స్టాండ్ అంటే స్టాండ్ అనేలా ఆ పార్టీ తయారైంది. దీంతో అక్కడా ఛాన్స్ లేదు.

వారితో కూటమి సాధ్యమేనా..?

కర్ణాటకలో ఆయన జేడీఎస్ పైన గతంలో ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. ఇంతకుముందు దేవెగౌడ, కుమారస్వామిని కలిసి వచ్చారు. అయితే, ఆ తర్వాత కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత జేడీఎస్ కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో ఆ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తోనే ఉంటుంది. మొత్తానికి దక్షిణాదిన కేసీఆర్ ప్రయత్నాలకు కలిసి వచ్చే పార్టీలు ప్రస్తుతానికి ఏమీ లేవు. దీంతో ఆయన ఉత్తరాది పార్టీలపై దృష్టి సారించారు. కానీ, అక్కడ ఉన్న నేతలు బలమైన వారు, వారి రాష్ట్రాల్లో ఎక్కువ పార్లమెంటు స్థానాలను గెలుచుకోగలిగిన వారు. దీంతో ఏమాత్రం అవకాశం ఉన్నా కూటమి తామే ఏర్పాటు చేయాలని, ప్రధాని పదవిని చేపట్టాలని కోరికతో ఉన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ఆమెనే కూటమి కట్టాలని భావిస్తున్నారు. అయితే, కేసీఆర్ ఆలోచనా విధానాన్ని ఆమె ఏకీభవించే అవకాశం ఉంది కానీ కేసీఆర్ నాయకత్వాన్ని ఒప్పుకునే పరిస్థితి ఉండకపోవచ్చు. ఇక ఉత్తరప్రదేశ్ లో కీ రోల్ పోషించనున్న మాయావతి, అఖిలేష్ కూడా ఓసారి కాంగ్రెస్ తో ఉన్నామంటారు... మరోసారి దూరంగా జరుగుతున్నారు. వారు కాంగ్రెస్ కూటమికి రాహుల్ గాంధీ నాయకత్వాన్నే అంగీకరించడం లేదు. మరి, కేసీఆర్ నాయకత్వానికి ఓకే అంటారని చెప్పలేం.

నాయకత్వాన్ని ఆశించకపోతే...

ఇక, నవీన్ పట్నాయక్ విషయంలో మాత్రం కేసీఆర్ కొంత సానుకూలత ఉండే అవకాశం ఉంది. ఆయన జాతీయ రాజకీయాలు పెద్దగా పట్టించుకోరు. తన రాష్ట్ర ప్రయోజనాలే ఆయనకు ముఖ్యం. దీంతో ఆయన కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇదే సమయంలో, నాయకత్వం ఆశించకుండా సమన్వయకర్తగా కేసీఆర్ ఉంటే మాత్రం ఆయన ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. మమతా బెనర్జీ కలిసిరావచ్చు. ఇప్పటికే యూపీలోని సీట్లను చెరి సగం పంచుకుని కాంగ్రెస్ తమతో ఉన్నా లేకున్నా ఒకటే అన్నట్లుగా వ్యవహరిస్తున్న అఖిలేష్, మాయవతి కూడా కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ లో కలిసే అవకాశం ఉంది. వాస్తవానికి, కేసీఆర్ కూడా ఎక్కడా తానే నాయకుడిగా ఉంటానని ఇప్పటి వరకైతే చెప్పలేదు. మొత్తానికి కేసీఆర్ ఆశలపై దక్షిణాది రాష్ట్రాల నేతలు పూర్తిగా నీళ్లు చల్లగా... ఉత్తరాది నేతలు మాత్రం ఇంకా ఆయన ఆశలను సజీవంగా ఉంచుతున్నారు.

Similar News