శత్రువులు ఎలా అయ్యారంటే ...?

Update: 2018-12-30 17:30 GMT

ఏపీ పాలిటిక్స్ లో తెలంగాణ సిఎం కేసీఆర్ ఎన్నడూ వేలు పెట్టేందుకు ఆసక్తి చూపలేదు. కానీ మొన్నటి ఎన్నికల్లో ఎపి సిఎం చంద్రబాబు ఎప్పుడైతే తెలంగాణ లో కూటమి కట్టి గోదాలోకి దిగారో అప్పటి నుంచి సందర్భం వచ్చినప్పుడల్లా ఎపి రాజకీయాల్లో కెసిఆర్ చురుగ్గా స్పందించడం మొదలు పెట్టారు. అది ఏ స్థాయిలో అంటే ఎపి లోని ఇతర రాజకీయ పక్షాలకన్నా ఇప్పుడు కెసిఆర్ ప్రధాన పక్షంగా చంద్రబాబు అండ్ టీం భావించే స్థాయిలో. దాంతో టిడిపి కి నిత్యం తెలంగాణ నేతల నుంచి తలపోట్లు వచ్చే ఎన్నికల వరకు తప్పేలా లేవు. సొంత రాష్ట్రంలో విపక్షంపై దాడి ప్రతిదాడి సమర్ధవంతంగా చేస్తున్నప్పటికీ పక్క రాష్ట్ర అధినేత తిట్ల దండకం వినలేక టిడిపి నేతలు చెవులు మూసుకునే లా పరిస్థితి ఏర్పడింది. ఇది తమ అధినేత స్వయం కృతమే అని ఇప్పుడు టిడిపి వర్గాలే మదన పడుతున్నాయి.

భవిష్యత్తు మరింత బాధాకరం ...

తెలంగాణ అధినేత కెసిఆర్ గట్టున వున్నారు. ఆయనకు ఎన్నికలు పూర్తి అయి అఖండ విజయం దక్కి తిరిగి పీఠం ఎక్కేశారు. అదే చంద్రబాబు పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా వుంది. ఆయన వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను ఒకేసారి ఎదుర్కోవాలి. ఇందులో ఏ మాత్రం తేడా కొట్టినా అటు జాతీయ స్థాయిలో ఇటు రాష్ట్రస్థాయిలో అభాసుపాలౌతారు. అసలే ప్రభుత్వ వ్యతిరేక పవనాలు ఎదుర్కోవాలి. మరోపక్క విపక్షం గత ఎన్నికల్లో అతి స్వల్ప తేడాతో మాత్రమే అధికారం కోల్పోయింది. ఈసారి ఎన్నికల్లో గతంలో సహకరించిన జనసేన, బిజెపి లేవు.

కలిసొస్తుందో...రాదో...తెలియని...

కలిసొస్తుందో రాదో తెలియని కాంగ్రెస్ చెయ్యి పట్టుకుని నడవాలిసిన దుస్థితి. ఇన్ని బాధలు ఉండగా ఎపి ప్రయోజనాల సంగతి పక్కన పెట్టి తెలంగాణ ఎన్నికల్లో చెయ్యి పెట్టి కాల్చుకుని లేని శత్రువును టీఆర్ఎస్ రూపంలో కొనితెచ్చుకున్నారు చంద్రబాబు. దాంతో ఆయన ముప్పేట దాడికి గురౌతున్నారు. విఫల ముఖ్యమంత్రిగా అసమర్దుడిగా, దద్దమ్మ, లఫంగి వంటి తీవ్ర పరుష పదజాలంతో కెసిఆర్ తో అవమానాలు పొందడానికి సిద్ధమయ్యారు. దాంతో భవిష్యత్తు రాజకీయాల్లో టిడిపి వర్గాలు టి నేతల నుంచి మరిన్ని అవమానకర విమర్శలు ఆరోపణలు ఎదుర్కోక తప్పేలా లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Similar News