రిటర్న్ గిఫ్ట్ అదేనంటగా ...?

Update: 2018-12-12 03:30 GMT

ఎపి సిఎం చంద్రబాబు కి రిటర్న్ గిఫ్ట్ తప్పదన్నారు తెలంగాణ సిఎం కేసీఆర్. తెలంగాణ పాలిటిక్స్ లో ఎపి సీఎం వేలుపెట్టడాన్ని టీఆర్ఎస్ ముందు నుంచి తప్పు పడుతూ వచ్చింది. కేసీఆర్ వ్యాఖ్యలకు ముందు ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లోనే పుట్టలో వేలుపెడితే చీమలు కూడా కుడతాయని మరి పక్క రాష్ట్ర చంద్రబాబు తెలంగాణ రాజకీయాల్లో వేలుపెడితే చూస్తూ సహించమని ఏపీలో కూడా తమ జోక్యం ఉంటుందని ముందే హెచ్చరించారు కేటీఆర్. ఆ విషయాన్నీ తాజాగా ఎన్నికల ఫలితాలు వచ్చాక గులాబీ అధినేత మరోసారి గుర్తు చేశారు. చంద్రబాబు కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వకపోతే తెలంగాణ వారికి సంస్కారం లేదంటారని ప్రతీకార సంకేతాలు ఇచ్చారు.

ఫస్ట్ గిఫ్ట్ అది ... సెకండ్ గిఫ్ట్ ఇదా ...

కేసీఆర్ ఇవ్వబోయే గిఫ్ట్ పై ఇప్పుడు సర్వత్రా చర్చ మొదలైంది. ఏపీ తెలుగుదేశం పార్టీలో కూడా కేసీఆర్ వ్యాఖ్యలు ఒకింత అలజడి రేపాయి. ఆయన ఇచ్చేది ఇదేనేమో అంటూ అటు సోషల్ మీడియా లోను ఇటు విశ్లేషకులు చర్చ మొదలు పెట్టేశారు. ఓటుకు నోటు కేసును వేగవంతం చేయడం ద్వారా గులాబీ బాస్ బాబుకు తొలి షాక్ ఇస్తారంటున్నారు. గత కొంతకాలంగా ఈకేసు పెండింగ్ లో ఉంది. దీన్ని వేగవంతం చేయడం ద్వారా బాబుకు తానేంటో చూపించాలని కేసీఆర్ భావిస్తున్నారని చెబుతున్నారు.

లోపాయికారిగా జగన్ కు....?

సెకండ్ గిఫ్ట్ గా ఎపి రాజకీయాల్లో బాబుకు వ్యతిరేకంగా వున్న జగన్, పవన్ లకు అవసరమైన సాయం అందించడం రెండో గిఫ్ట్ గా వుండబోతుందటున్నారు. బాబు చేసిన తప్పు కేసీఆర్ చేయరని టీఆర్ఎస్ ఏపీలో పోటీ చేసేది ఉండదని స్పష్టం చేస్తున్నారు. మొత్తానికి బాబు ఊహించింది ఒకటైతే జరిగింది మరొకటిగా మారి ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఉవ్విళ్లూరుతున్న ఎపి చంద్రుడికి ఇక చిక్కులు తప్పకపోవొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి బాబు భవిత ఎలా వుండబోతుందో వేచి చూడలి.

Similar News