కేసీఆర్ మదిలో... 16....టెన్షన్...టెన్షన్...!!!

Update: 2018-12-23 08:30 GMT

టీఆర్ఎస్ నేతలకు అదృష్టం మామూలుగా పట్టడం లేదు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బంపర్ మెజారిటీ అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీకి త్వరలోనే పదవుల పందేరం జరగబోతోంది. అయితే వచ్చే నాలుగు నెలల్లో దాదాపు 16 ఎమ్మెల్సీ పోస్టులు ఖాళీ అవుతున్నాయి. ఈ ఎమ్మెల్సీల పదవుల కోసం టీఆర్ఎస్ నుంచి పెద్ద సంఖ్యలో ఆశావహులు కన్పిస్తున్నారు. పెద్దల సభకు వెళ్లేందుకు ఉత్సాహ పడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ రాని నేతలతో పాటు పార్టీకి బ్యాక్ బోన్ గా ఉన్న నేతలు కూడా ఈసారి ఎమ్మెల్సీ పదవులపై ఆశలు పెట్టుకున్నారు.

కష్టపడిన వారికే.....

టీఆర్ఎస్ ఇంత భారీ స్థాయిలో మెజారిటీ సాధించడానికి జిల్లాల వారీగా కొందరు నేతల శ్రమ కూడా కారణమని కేసీఆర్ ఇప్పటికే గుర్తించారు. పార్టీకోసం గత కొన్నేళ్లుగా కష్టపడుతున్న వారిని ఈ దఫా విస్మరించకూడదని నిర్ణయించుకున్నారు. అందుకోసం ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో కేసీఆర్ ఈసారి ఆచితూచి అడుగులు వేస్తారంటున్నారు. సామాజిక వర్గాల ఆధారంగా ఎంపిక ఉంటుందని గులాబీ బాస్ సన్నిహితుల వద్ద చెబుతున్నప్పటికీ ఆశావహులు మాత్రం కేటీఆర్ చుట్టూ ప్రదిక్షిణలు చేస్తున్నారు.

ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన వారికి....

శాసనసభ ఎన్నికలకు ముందు టిక్కెట్లు దక్కని వారికి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని కేసీఆర్ కొందరికి హామీ ఇచ్చారు. అప్పట్లో ఫిరాయింపులు లేకుండా హామీలు ఇచ్చారు. ఇప్పుడు వాళ్లందరికీ నామినేటెడ్ పదవులు ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్కువ మంది ఎమ్మెల్సీ పదవులపైనే ఆశలు పెట్టుకున్నారు. మొదటి దఫానే పదవులు పొందాలని ఆరాట పడుతున్నారు. ఇప్పటికే కేబినెట్ స్థానం దక్కించుకున్న మహమూద్ ఆలికి మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం దక్కనుంది. పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్సీలపై వేటు పడనుంది. రాములు నాయక్, కొండామురళి, యాదవరెడ్డి, భూపతిరెడ్డి స్థానాలు కూడా ఖాళీ అయ్యే ఛాన్సుంది.

మండలికి తీవ్ర యత్నాలు...

వీటితో పాటు ముగ్గురు శాసన మండలి సభ్యులు ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. పట్నం నరేందర్ రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు ఎమ్మెల్యేలుగా ఎన్నిక కావడంతో ఈ మూడు ఖాళీ కానున్నాయి. ఇక పట్టభద్రుల నియోజకవర్గాలు, ఉపధ్యాయ నియోజకవర్గాల నుంచి మార్చి నాటికి తొమ్మిది ఎమ్మెల్సీ పోస్టులు ఖాళీ కానున్నాయి. మొత్తం 16 ఎమ్మెల్సీలు స్థానాలు నాలుగు నెలల్లో ఖాళీ అవుతుండటంతో నేతలు పెద్దయెత్తున ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయిన మాజీ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పట్నం మహేందర్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు కూడా ఎమ్మెల్సీ పదవి దక్కుతుందన్న నమ్మకంతో ఉన్నారు. మరి కేసీఆర్ మదిలో ఎవరున్నారో తెలియక నేతలు టెన్షన్ పడుతున్నారు.

Similar News