తలో దారి అయినా...అందరినీ దారిలోకి.....!!!

Update: 2018-12-12 09:30 GMT

సభికుల్ని సమ్మోహితుల్ని చేసేలా ప్రసంగాలు. ప్రత్యర్థులపై మాటల తూటాలు. చేసిన పని గోరంత అయినా కొండంతగా చెప్పగలిగే నేర్పరితనం. శత్రువుల ఊహకు అందని వ్యూహాలు వారి సొంతం. ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకోగలిగే చాణక్యం వారి సొంతం. ఇలాంటి ప్రతికూల అంశాలన్నీ మేళవించిన ఆ ముగ్గురు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. వీరు ముగ్గురు ముగ్గురే. తెలంగాణ లో గులాబీ జండా రెండోసారి రెపరెపలాడటంలో ఈ ముగ్గురు పోషించిన పాత్ర అనిర్వచనీయం.

తలా ఒక దారిలో.....

సుడిగాలిలా పర్యటిస్తూ, తెలంగాణ సెంటిమెంట్ ను రాజేస్తూ కెసిఆర్ చేసిన ప్రసంగాలు ఉద్వేగభరితంగా సాగేవి. ఆయన మాటలు ఒక్కోసారి సీమాంధ్రుల మనోభావాలు దెబ్బతీసేలా ఉండేవి. రోజుకు ఆరు నుంచి ఎనిమిది సభల్లో పాల్గొంటూ ఓటర్లు కన్ఫ్యూజ్ కావద్దంటూ కేసీఆర్ పదే పదే కోరారు. ఇందులో పెద్దగా గందరగోళం పడాల్సిన అవసరం లేదని, ఎన్నికల బరిలో కొత్తవారు ఎవరూ లేరని ప్రతి సభలో కేసీఆర్ చెప్పుకంటూ వచ్చారు. సీమాంధ్రుల మనోభావాలు దెబ్బతింటాయని తెలిసినా బాబుపై సెటైర్లు వేసేవారు.

సెటిలర్ల ఓట్లు.....

ఆ వెంటనే రంగంలోకి దిగి మీకు నేనున్నా అంటూ సీమాంధ్రులకు భరోసా ఇచ్చేవారు కెటిఆర్. దాంతో సెటిలర్స్ ఓటు సైతం గులాబీ కోటకి చేరిపోయింది. మరోపక్క కీలక కాంగ్రెస్ నేతలు పోటీ చేసే ప్రాంతాల్లో ధీటైన వారిని నిలబెట్టి గెలిపించే బాధ్యతను ట్రబుల్ షూటర్ హరీష్ రావు చేపట్టి సూపర్ సక్సెస్ అయ్యారు. ఒక్కటేమిటి కొడంగల్ వంటి నియోజకవర్గాన్ని కారు ఖాతాలో కలపడంలో హరీశ్ చొరవే కారణమని చెప్పక తప్పదు. ఇలా ముగ్గురు త్రిమూర్తులు అప్రతిహతంగా సాగిన కారు స్పీడ్ కి అసలు కారకులుగా నిలిచి కొత్త చరిత్ర లిఖించారు. వీరి ముగ్గురి దెబ్బకు కాంగ్రెస్ హేమా హేమీలు మట్టికరిచిపోయారు.

Similar News