డేంజర్ సిగ్నల్స్......!!

Update: 2018-12-19 17:30 GMT

కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ అధిష్టానంపై వత్తిడి ప్రారంభమవుతోంది. ఈ నెల 22వ తేదీన మంత్రి వర్గ విస్తరణ ఉందని అగ్రనేతలు ప్రకటించడంతో అసంతృప్త నేతలు తమ గళాన్ని మరింత పెంచారు. ఈసారి మంత్రి పదవులు దక్కకుంటే తమ దారి తాము చూసుకుంటామన్న సిగ్నల్స్ ఇచ్చేస్తున్నారు. పదవుల పందేరంపై నాన్చుకుంటే వెళితే ఇక సహించేది లేదని, భారీ మూల్యం చెల్లించక తప్పదని గట్టిగానే వార్నింగ్ లు ఇస్తున్నారు. ముఖ్యమంత్రి కుమారస్వామిపై నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయనను కంట్రోల్ చేయకుంటే పరిస్థితి మరింత దిగజారుతుందని అగ్రనేతలు సయితం ఆందోళనలో ఉన్నారు.

మంత్రి వర్గ విస్తరణ......

ఈనెల 20వ తేదీన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర, పీసీసీ చీఫ్ దినేష్ గుండూరావులు కలసి మంత్రి వర్గ విస్తరణపై చర్చించనున్నారు. ఆశావహులు ఎక్కువగా ఉండటం, మంత్రి పదవులు కేవలం ఆరుమాత్రమే భర్తీ చేయాల్సి రావడంతో కొంత ఇబ్బందులు తప్పేట్లు లేదు. కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో పరిస్థిితిని అగ్రనేతల ముందు ఎండగట్టారు. ముఖ్యంగా ఉత్తర కర్ణాటకకు జరుగుతున్న అన్యాయాన్ని సహించి చూస్తూ ఉండలేమని, ఇదే పరిస్థితి కొనసాగితే జరిగే పరిణామాలకు తాము బాధ్యత వహించమని తేల్చి చెప్పారు.

అసంతృప్త ఎమ్మెల్యేలు....

ముఖ్యంగా కుమారస్వామిపై అసంతృప్త ఎమ్మెల్యేలు నిప్పులు చెరుగుతున్నారు. కేవలం ఒక ప్రాంతానికే ఆయన ముఖ్యమంత్రిలా వ్యవహరిస్తున్నారని, బెంగళూరు కేంద్రంగా చేసుకుని కుమారస్వామి పదవుల పందేరం చేయడాన్ని వారు నిలదీశారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లకపోతే తమ దారి తాము చూసుకోక తప్పదని కూడా కొందరు ఎమ్మెల్యేలు హెచ్చరించారు. ఇప్పటికీ భారతీయజనతా పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల కోసం కాచుక్చూర్చున్న విషయాన్ని మర్చిపోవద్దని కూడా వారు సుతిమెత్తంగా, పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. యడ్యూరప్ప ఇప్పటికే కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో టచ్ లో ఉన్నారంటున్నారు.

టెన్షన్ తప్పదా.....?

కాగా ముఖ్య సమావేశానికి సీనియర్ కాంగ్రెస్ నేతలు డుమ్మా కొట్టడం కూడా చర్చనీయాంశమైంది. మంత్రిపదవిని ఆశిస్తున్న కొందరు నేతలు శాసనసభ పక్ష సమావేశానికి హాజరుకాకపోవడం డేంజర్ సిగ్నల్స్ ను సూచిస్తున్నాయన్న అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. ఎంబీపాటిల్, రామలింగారెడ్డి, రోషన్ బేగ్, రమేష్ జార్ఖిహోళి, సతీష‌ జార్ఖిహోళి, డాక్టర్ సుధాకర్, నాగేంద్ర వంటి వారు డుమ్మా కొట్టడం చర్చనీయాంశమైంది. మొత్తం మీద ఈనెల 22వ తేదీన మంత్రి వర్గ విస్తరణ జరిగినా.... జరగకున్నా ముప్పు తప్పేట్లు లేదన్నది మాత్రం వాస్తవం.

Similar News