కుమారస్వామి కొత్త ఎత్తుగడ...?

Update: 2018-08-01 18:29 GMT

కర్ణాటకలో రాజకీయాలు ప్రాంతీయ రంగును సంతరించుకుంటున్నాయి. ఓ వైపు ఉత్తర కర్ణాటకకోసం డిమాండ్ రోజురోజుకూ ఉదృతమవుతుండగా, తాజాగా రెండో రాజధాని అంశం తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ తో కలిసి అధికారం పంచుకుంటున్న హెచ్.డీ.కుమారస్వామి గత నెలలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ నేతలు, ముఖ్యంగా గాలి సోదరుల అనుచరుడు శ్రీరాములు చేసిన వ్యాఖ్యలతో అక్కడి రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. బడ్జెట్ లో జేడీఎస్ ఎక్కువ స్థానాలు గెలిచిన దక్షిణ కర్ణాటకకే ఎక్కువ నిధులు కేటాయించారని, ఉత్తర కర్ణాటకకు అన్యాయం జరుగుతుందని శ్రీరాములు ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక ఉత్తర కర్ణాటక డిమాండ్ ఉన్న అంశాన్ని లేవనెత్తారు.

కుమారస్వామి కొత్త స్కెచ్...

దీంతో ఎప్పటి నుంచో ఉన్న ఈ డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. ఆందోళనలు మొదలయ్యాయి. అయితే, తన ఉద్దేశ్యం ఉత్తర కర్ణాటక రాష్ట్రం కావాలని కాదని, కేవలం బడ్జెట్ లో అన్యాయం జరిగిందనే అని శ్రీరాములు వివరణ ఇచ్చారు. అయినా, ఆందోళనలు కొనసాగాయి. మొత్తానికి కుమారస్వామి హయాంలో ఉత్తర కర్ణాటకకు అన్యాయం జరుగుతుందనే వాదన ప్రజల్లోకి వెళ్లింది. దీంతో తేరుకున్న కుమారస్వామి కొత్త ప్లాన్ వేశారు. కర్ణాటకకు రెండో రాజధాని అంశాన్ని తెరపైకి తెచ్చారు. రెండో రాజధానిగా బెళగావిని ఏర్పాటుచేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వంలోని కొన్ని శాఖల కార్యాలయాలు అక్కడి పంపించాలని ఆలోచన ఉన్నట్లు స్పష్టం చేశారు. అంతేకాదు, మంగళూరును ఆర్థిక రాజధాని చేయలనే ఆలోచన కూడా ఉన్నట్లు చెప్పారు.

నేను అప్పుడే చెప్పా...

వాస్తవానికి 2006వ సంవత్సరంలో బీజేపీతో కలిసి అధికారం పంచుకుని ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే కుమారస్వామి ప్రభుత్వం రెండో రాజధానిగా బెళగావిని చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేయించారు. కానీ, తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని కుమారస్వామి అంటున్నారు. మరో 10-15 రోజుల్లో రెండో రాజధాని అంశంపై స్పష్టమైన ప్రకటన ఇస్తానంటున్నారు. మొత్తానికి ప్రాంతాల పేరుతో రాజకీయాలు కర్ణాటకలో ఉపందుకున్నాయి. ఉత్తర కర్ణాటకకు అన్యాయం అనే వాదనను ఆదిలోనే అంతం చేసేందుకు కుమారస్వామి రెండో రాజధాని స్కెచ్ వేశారు. అయితే, అభివృద్ధి ఒకేచోట కేంద్రీకరించడం కంటే ఇలా రెండో రాజధాని, ఆర్థిక రాజధాని పేర్లతో వికేంద్రీకరించడం ద్వారా అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందుతాయనేది మాత్రం వాస్తవమే అంటున్నారు విశ్లేషకులు.

Similar News