కన్నడ మాస్టర్ మైండ్ తెలంగాణాదే...!

Update: 2018-05-15 07:30 GMT

కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ తిరుగులేని విజయం సాధించింది. అధికార కాంగ్రెస్ పార్టీని, అందునా బలమైన నాయకుడిగా ఉన్న సిద్ధరామయ్యను గద్దె దించింది. అన్ని అంచనాలను తలకిందులు చేస్తూ స్పష్టమైన మెజారిటీ సాధించింది. కానీ, ఈ విజయం కేవలం ఎన్నికల సమయంలో చేసిన ప్రచారంతోనో, ఎన్నికల హామీలతోనే సాధ్యమైంది కాదు. కర్ణాటక విజయం వెనక గత కొంతకాలంగా ఆ పార్టీ పన్నిన రాజకీయ వ్యూహాలు మామూలివి కావు. పక్కా ప్రణాళికతో బూత్ స్థాయి నుంచి పార్టీకి అనుకూలంగా పరిస్థితులను మార్చారు. కాగా, కర్ణాటకలో బీజేపీ విజయం వెనుక కీలకపాత్రను మాత్రం పోషించింది మాత్రం తెలుగు నాయకుడే. మోడీ-షా ధ్వయానికి అత్యంత నమ్మకస్థుడిగా ఉన్న ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు. కర్ణాటకకు గత రెండేళ్లుగా బీజేపీ ఇంఛార్జిగా పనిచేస్తున్నారు. ఇక్కడ అధికారం చేజిక్కించుకుని దక్షిణాదిన పార్టీని బలంగా చేయాలనే సంకల్పంతో ముందస్తు వ్యూహంగానే మురళీధరరావు కు ఈ బాధ్యతలు అప్పగించింది ఆ పార్టీ. తనపై మోడీ, షా పెట్టుకున్న నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకున్నారు. పార్టీ విజయం సాధించడంలో కీలకంగా పనిచేశారు.

ఎవరీ మురళీ....?

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామానికి చెందిన మురళీధరరావుది సాధారణ వ్యవపాయ కుటుంబం. వరంగల్లో ఉంటూ డిగ్రీ చదువుతున్న రోజుల్లో ఆయన ఆర్ఎస్ఎస్ భావాలకు ఆకర్షితులయ్యారు. అప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ లో పనిచేయడంతో పాటు ఏబీవీపీలోనూ చేరారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అడుగుపెట్టిన మురళీధరరావు విద్యార్థి నాయకుడిగా ఎదిగారు. ఈ క్రమంలో ఆయన వ్యతిరేకులు హత్యాప్రయత్నం చేశారు. ఈ కాల్పుల నుంచి బయటపడిన ఆయనను సురక్షితంగా ఉంచేందుకు ఆర్ఎస్ఎస్ రాజస్థాన్ కు పంపించింది. ఇదే ఆయనను బీజేపీ జాతీయ నాయకుడిగా ఎదిగేందుకు దోహదపడింది. ఆర్ఎస్ఎస్ లో అనేక రాష్ట్రాలతో పాటు ఉగ్రవాద ప్రభావం ఉన్న జమ్మూ కశ్మీర్, అందునా లఢక్ లోనూ పనిచేశారు. తర్వాత ఆర్ఎస్ఎస్ అనుబంధంగా ప్రారంభమైన స్వదేశీ జాగరణ్ మంచ్ లో చేరి జాతీయ కన్వీనర్ గా ఎదిగారు. 2008 వరకు అందులోనే పనిచేసిన అనంతరం ఆర్ఎస్ఎస్ సూచనల మేరకు బీజేపీలోకి అడుగుపెట్టి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ కు చేరువయ్యారు.

వ్యూహరచనలో దిట్ట....

బీజేపీలో మోడీ-షా శకం మొదలయ్యాక మురళీధరరావు కీలక వ్యక్తిగా మారారు. వారి కోర్ టీంలో ఒకరిగా వివిధ రాష్ట్రాల్లో బీజేపీ విజయం కోసం కృషి చేశారు. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ బలపడటంలో ఆయన పాత్ర కీలకం. ఈశాన్య రాష్ట్రాల తర్వాత దక్షిణాదిపై దృష్టి పెట్టిన బీజేపీ మురళీధరరావుకు కర్ణాటక బాధ్యతలు అప్పగించింది. దీంతో ఆయన ఎన్నికల ఏడాదికి ముందే రంగప్రవేశం చేశారు. ప్రతీ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి, నేతల బలాలను పూర్తిగా అధ్యయనం చేశారు. ఎప్పటికప్పుడు అధిష్టానానికి నివేదికలు పంపేవారు. పార్టీకి వ్యతిరేకంగా ఉన్న అంశాలను అనుకూలంగా మలిచారు. వివిధ అంశాల్లో అధికార కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టి బలహీనపర్చారు. బూత్ స్థాయి నుంచి బీజేపీని బలపర్చారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలను పూర్తిగా సమన్వయం చేసుకున్నారు. కర్ణాటక ప్రజల కోరికలను బీజేపీ ఎన్నికల హామీలుగా మలిచారు. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా, మంచి పేరు సంపాదించినా సిద్ధరామయ్య వీరి వ్యూహాల ముందు నిలవలేకపోయారు. దీంతో భారతీయ జనతా పార్టీ పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చి దక్షిణాదిన పట్టు సాధించేందుకు మార్గం సుగమం చేసుకుంది.

Similar News