ఆయనే ఎందుకుండాలంటే...?

Update: 2018-12-14 16:30 GMT

శివరాజ్ సింగ్ చౌహాన్ స్థానంలో మధ్యప్రదేశ్ కు కొత్త ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కమల్ నాధ్ ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అధిష్టానం చివరకు ఆయన పేరునే ఖరారు చేసింది. సీనియర్ పార్లమెంటేరియన్ గా గుర్తింపు పొందిన కమల్ నాధ్ వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గుచూపడానికి అనేక కారణాలున్నాయంటున్నారు. ఇక్కడ యువనేత జ్యోతిరాదిత్య సింధియా ఉన్నప్పటికీ కమల్ నాధ్ ను ఉత్కంఠ మధ్య ఎంపిక చేశారు. ఇందుకు బలమైన కారణాలున్నాయంటున్నారు. ఉత్తరప్రదేశ్ తర్వాత పెద్ద రాష్ట్రమైన మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని పదికాలాల పాటు కాపాడుకోవాలంటే కమల్ నాధ్ నే ఎంపిక చేయాలన్నది పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నిర్ణయంగా చెబుతున్నారు.

రాహుల్ ఒక్కరే.....

రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత మూడు రాష్ట్రాల్లో విజయం సాధించడం ఆయన నాయకత్వానికి మరింత మెరుపులు అద్దాయనే చెప్పాలి. సోనియాగాంధీ అనారోగ్యంతో ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేకపోయినా రాహుల్ ఒక్కరే అన్ని రాష్ట్రాల్లో ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ కు విజయం సాధించిపెట్టారు. ముఖ్యంగా మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాన్ని గెలుపొందడం అంత సులువుకాదు. భారతీయ జనతా పార్టీతో పాటు మూడు దఫాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన శివరాజ్ సింగ్ చౌహాన్ బలంగా ఉండటంతో అంత ఈజీ కాదన్నది ఎన్నికల ఫలితాల తర్వాత కూడా అర్థమయింది.

ఇతర పార్టీల సౌజన్యంతో.....

ఇప్పుడు మధ్యప్రదేశ్ లో ఇతర పార్టీల సౌజన్యంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సి వచ్చింది. బీఎస్పీ, ఇతరుల సహకారం లేకుంటే అధికారం సాధ్యమయ్యేది కాదు. ఇది పూర్తికాలం నిలబెట్టుకోవాలంటే కమల్ నాధ్ ఒక్కరి వల్లనే సాధ్యమవుతుందన్నది కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచన. తొలి నుంచి మధ్యప్రదేశ్ లో కష్టపడిన యువనేత జ్యోతిరాదిత్య సింధియా వైపే రాహుల్ మొగ్గు చూపినప్పటికీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కమల్ నాధ్ ను ఎంపిక చేశారు. ఎమ్మెల్యేలు పదిమంది చేజారితే ప్రభుత్వం కుప్పకూలే అవకాశముండటంతో అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి అవసరమన్న సోనియా సూచన మేరకు రాహుల్ కమల్ నాధ్ ను చివరకు ప్రకటించాల్సి వచ్చింది. జ్యోతిరాదిత్య సింధియాకు గౌరవప్రదమైన పదవి ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు రాహుల్ సింధియాను ఒప్పించగలిగారు.

వచ్చే లోక్ సభ ఎన్నికలను.....

అలాగే కమల్ నాధ్ తొలినుంచి గాంధీ కుటుంబానికి వీర విధేయుడు. పార్టీ పట్ల ఆయన చూపిన శ్రద్ధ కూడా ఆయనకు మంచి మార్కులు పడ్డాయి. దాదాపు 38 ఏళ్ల పార్టీతో అనుబంధం ఆయనకు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టింది. వాస్తవానికి కమల్ నాధ్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆయన చింద్వాడా నియోజకవర్గ లోక్ సభ సభ్యుడిగా ఉన్నారు. అయినా వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పార్టీకి మరిన్ని స్థానాలు దక్కాలన్న ఉద్దేశంతో కూడా కమలనాధ్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఆయనపై బాధ్యతను పెడితే సక్రమంగా నెరవేరుస్తారన్న సోనియాగాంధీ అంచనాను కమల్ నాధ్ ఏ మేరకు అధిగమిస్తారో చూడాల్సి ఉంది.

Similar News