దొంగల భరతం పడతాం...!!

Update: 2018-12-12 10:47 GMT

జాతీయ రాజకీయాల్లో కొత్త ప్రయోగాలు అవసరమని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల సైకాలజీ బాగాలేదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ లకు వ్యతిరేకంగా కొత్త ఫ్రంట్ రావడం అవసరం ఎంతైనా అవసరముందన్నారు. దేశానికి ఒక కొత్త ఆర్థిక, వ్యవసాయ విధానం అవసరమని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దెందూ దొందేనన్నారు.కాంగ్రెస్ జాతీయ పార్టీ అయినా రాష్ట్రానికి ఒక పాలసీ ఉంటుందన్నారు. ఓట్ల కోసం రాహుల్ గాంధీ అబద్ధాలు చెబుతున్నారన్నారు. నాలుగున్నరేళ్ల పాలనలో తాము అమలు చేసిన పథకాల వల్లనే ప్రజలు తమకు ఇంత పెద్దయెత్తున మద్దతు పలికారన్నారు. తాము ఇంకా చేస్తామన్న నమ్మకం ప్రజలకు కలగడం వల్లనే ఇంత భారీ మెజారిటీ వచ్చిందన్నారు. మ్యానిఫేస్టోలో లేని అంశాలను కూడా అమలు పర్చిన ఘనత దేశంలో ఒక్క టీఆర్ఎస్ కే దక్కుతుందన్నారు.

మంత్రివర్గంలో అన్ని వర్గాలకూ స్థానం....

పంచాయతీ ఎన్నికలకు వారంరోజుల్లోనే నోటిఫికేషన్ వస్తుందని, ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఎమ్మెల్యేలకు శాసనసభ పక్ష సమావేశంలో సూచించానని తెలిపారు. మంత్రి వర్గంలో అన్ని వర్గాలకు చోటు దక్కుతుందన్నారు. ఫెడరల్ ఫ్రంట్ త్వరలోనే రూపుదిద్దుకుంటుందన్నారు. ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి వస్తే దేశ వ్యాప్తంగా రైతుబంధు పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 29.9 శాతం తెలంగాణలో వృద్ధిరేటు ఉందన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇంత వృద్ధిరేటు ఎక్కడా లేదన్నారు. కోటి ఎకరాల భూమికి నీరందంచడానికి ప్రాజెక్టుల నిర్మాణానికి పూర్తి కావడానికి 70 వేల కోట్లు ఖర్చు చేయనున్నామన్నారు. ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణ బంగారమవుతుందన్నారు.

ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం.....

ఒకటిన్నర సంవత్సరంలో సీతారామ ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని కూడా త్వరలోనే పూర్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు. అరవై ఏళ్లు పాలించిన కాంగ్రెస్, టీడీపీలు ఎన్ని లక్షల ప్రభుత్వోద్యాగాలు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. నిరుద్యోగులను కొన్ని పార్టీలు మోసం చేస్తున్నాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు మూడు లక్షల మంది అయితే ప్రయివేటు సంస్థల్లో ముప్ఫయి లక్షల మంది ఉద్యోగులున్నారన్న విషయాన్ని మర్చిపోరాదన్నారు. ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే అన్నింటిని తర్వగానే భర్తీ చేస్తామన్నారు. నిరుద్యోగ భృతి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచిప్రారంభమవుతుందన్నారు. ఎంఐఎం ప్రభుత్వంలో చేరబోదన్నారు. వారే బయటనుంచి తమకు మద్దతిస్తారని చెప్పారు. గతంలో జరిగిన అవినీతిని బయటపెట్టి దొంగల భరతం పడతామన్నారు. కాగా రేపు రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారంచేయబోతున్న కేసీఆర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. రేపు రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Similar News