ఒకే ఒక్కడు....!!

Update: 2018-12-11 09:30 GMT

ఒకే ఒక్కడు... తిప్పేసి...మెలేసి...గిరాటేశాడు... అన్ని పార్టీలూ ఒక్కటైనా... హేమాహేమీలు వచ్చి ప్రచారం చేసినా ఆయన ఎక్కడా తలవంచలేదు. తాను నమ్ముకున్న ప్రజల చెంతకే వెళ్లి మరోసారి అవకాశమివ్వాలని కోరారు. ప్రజలు అనూహ్యంగా...ఎవరు ఊహించని రీతిలో ఏకపక్షంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ కు అండగా నిలిచారు. కేసీఆర్ తొలినుంచి పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. అందుకే ఆరు నెలలు ముందుగానే శాసనసభను రద్దు చేసి మరీ ఎన్నికలకు వెళ్లారు. అయితే ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్లడాన్ని సొంత పార్టీ నేతలే కొందరు తప్పుపట్టారు. దళపతి కావడంతో నోరు మెదపలేదు కాని చాలా మంది టీఆర్ఎస్ నేతలకు ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ఇష్టం లేదు.

మొండి మనిషి.....

అయితే కేసీఆర్ మొండి మనిషి. ఆయన అనుకున్నదే చేస్తారు. వ్యూహరచనల్లో దిట్ట. ఒంటిచేత్తో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత ఆయనది. ప్రజల మనస్సులను ఎలా గెలుచుకోవాలో ఆయనకు తెలిసినంతగా మరెవరికీ తెలియదేమో. చివరి నిమిషంలో తనకు అనుకూలంగా మార్చుకుని మరోసారి పార్టీకి విజయాన్ని సింగిల్ హ్యాండెడ్ గా సాధించి పెట్టారు. కేసీఆర్ తొలినుంచి పూర్తి కాన్ఫడెన్స్ తో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని అందరికీ తెలిసిందే.

అందరికీ టిక్కెట్లు ఇచ్చి.....

కాని సిట్టింగ్ లలో దాదాపు అందరికీ టిక్కెట్లు ఇచ్చారు. ప్రజల్లోవ్యతిరేకత ఉందని తెలిసినా, పార్టీలో అసంతృప్తి బయటపడుతుందని ఊహించినా ఆయన వెనకడుగు వేయలేదు. దాదాపు మూడు నెలల ముందుగానే అభ్యర్థులను ప్రకటించి బరిలోకి దిగారు. సిట్టింగ్ లందరికీ సీట్లు ఇవ్వడాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా తప్పుపట్టారు. కేసీఆర్ ఓవర్ కాన్ఫిడెన్స్ తో వెళ్లారని ఆయన చేసిన కామెంట్స్ నిజమేననిపించింది. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఆయన స్పష్టమైన ఆధిక్యతను పొందగలిగారు.

అంతా తానే అయి.....

గులాబీ పార్టీ విజయానికి కేసీఆర్ ఫేస్ కారణమని చెప్పకతప్పదు. మహాకూటమిలో అన్ని పార్టీలూ ఒకవైపు, కేసీఆర్ ఒక్కడూ ఒకవైపు. ఎన్నికలు అలా జరిగాయి. జాతీయ నేతలు రాహుల్ గాంధీ, మోదీ, అమిత్ షా వంటి నేతలు తెలంగాణలో ప్రచారం నిర్వహించి కేసీఆర్ పై విమర్శలు చేసినా ప్రజలు పెద్దగా పట్టించుకోనట్లే కన్పిస్తోంది. కేసీఆర్ మనోడన్న ఒకే ఒక్క ఆలోచన గులాబీ పార్టీకి విజయం తెప్పించిందన్నదే విశ్లేషకుల మాట. మొత్తం మీద కేసీఆర్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఒంటిచేత్తో గులాబీ పార్టీకి విజయాన్ని తెచ్చిపెట్టారనే చెప్పాలి.

Similar News