నాడు ఎన్టీఆర్....నేడు కేసీఆర్....!!!

Update: 2018-12-11 11:00 GMT

అన్ని చోట్లా అభ్యర్థి ఆయనే. గులాబీ పార్టీకి ఘన విజయం సాధించి పెట్టింది ఆయనే. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు అనుసరించిన వ్యూహం సూపర్...డూపర్ హిట్ అయింది. ముందస్తు ఎన్నికలకు వెళ్లి కేసీఆర్ తప్పుడు నిర్ణయం తీసుకున్నారన్న విశ్లేషణలు కూడా వెలువడిన ఫలితాలు వెలవెల బోయేలా చేశాయి. గతంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన వారంతా ఓటమి పాలయ్యారని, కేసీఆర్ కు కూడా అదే పరిస్థితి ఎదురవుతుందని వేసిన అంచనాలు తలకిందులయ్యాయి. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకకు పోటెత్తడం కూడా కేసీఆర్ కు కలసి వచ్చిందనే చెప్పాలి.

సుడిగాలి పర్యటనలతో.....

కేసీఆర్ దాదాపు 119 నియోజకవర్గాల్లో పర్యటించారు. సుడిగాలి పర్యటనలు చేశారు. తన సభలతో జనాలను మెప్పించగలిగారు. ఒప్పించగలిగారు. తన సంక్షేమ పథకాలే తనను గట్టెక్కిస్తాయని ఆయన విశ్వాసమే నేడు నిజమయింది. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పింఛన్లు, రైతు బంధు వంటి పథకాలు ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్నాయి. కేసీఆర్ రాకుంటే ఈ పథకాలన్నీ నిలిచిపోతాయని ప్రజలను గట్టిగా నమ్మించగలిగారు. ప్రస్తుతం తుది దశలో ఉన్న ప్రాజెక్టులన్నీ ఆగిపోతాయని చెప్పి ప్రజలను ఒప్పించగలిగారు.

ఎన్టీఆర్ ప్రభంజనంలాగా....

కేసీఆర్ కు జనాక్షణ శక్తి ఎక్కువ. నందమూరి తారకరామారావు లాగా కేసీఆర్ కు గ్లామర్ లేకపోయినా ఇమేజ్ ఉందన్నది వాస్తవం. 1994లో ఎన్టీరామారావు కాంగ్రెస్ పార్టీని ఇలాగే దెబ్బకొట్టారు. ఆనాడు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన హేమాహేమీలు ఓటమి పాలయ్యారు. నేడు అదే చరిత్ర పునరావృతమయిందని చెప్పాలి. నేడు కూడా కాంగ్రెస్ లో ప్రముఖంగా చెప్పుకునే నేతలందరూ ఓటమి బాట పట్టడం చూస్తుంటే మరోసారి ఎన్టీఆర్ గుర్తుకు వస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చేయడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు.

ఇంత అనుకూలతా?

కుటుంబ పాలన, నియంత లాంటి విమర్శలన్నీ కేసీఆర్ ప్రభంజనంలో తుడిచిపెట్టుకుపోయాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేందరికీ టిక్కెట్లు ఇచ్చి సాహసం చేసినా బంపర్ మెజారిటీతో విజయం సాధించడమంటే ఆయన చలవేనన్నది అందరూ ఒప్పుకోవాల్సిన నిజం. ఇంత ప్రభంజనం ఉంటుందని విశ్లేషకులు సయితం ఊహించలేదు. టీఆర్ఎస్ గెలిచినా బొటా బొటీ మెజారిటీ వస్తుందనుకున్నారు. కానీ అధికార పార్టీకి ఇంత పాజిటివ్ వేవ్ రావడానికి కారణం సంక్షేమ పథకాలు ఒక కారణం కాగా, కూటమిలో చంద్రబాబు ఉండటం మరో కారణంగా చెప్పొచ్చు. మొత్తం మీద కేసీఆర్ ఎన్టీఆర్ ను మరోసారి గుర్తుకు తెచ్చారు.

Similar News