బెర్త్ దక్కేదెవరికంటే...?

Update: 2018-12-14 00:30 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మరోసారి టెన్షన్ పెట్టేశారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ తో పాటు గతంలో డిప్యూటీ ముఖ్యమంత్రిగా పనిచేసిన మహమూద్ ఆలి మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. మిగిలిన వారికి ఎవ్వరికీ కేసీఆర్ తొలి విడత అవకాశమివ్వలేదు. ఈ నెల 18వ తేదీన మరోసారి మంత్రి వర్గ విస్తరణ ఉండే అవకాశాలు న్నాయంటున్నారు. అదే రోజు శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేసుకుని ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం కూడా చేయించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే ఉదయం మంత్రివర్గ విస్తరణ జరిగి తర్వాత శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది.

అనేకమంది ఆశావహులు.....

ఈసారి మంత్రివర్గంలో చోటు దక్కుతుందని అనేక మంది ఆశలు పెట్టుకున్నారు. గత క్యాబినెట్ లో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు, మహేందర్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, చందూలాల్ తో పాటు స్పీకర్ గా పనిచేసిన మధుసూదనాచారి కూడా ఓటమి పాలు కావడంతో ఈ ఐదు స్థానాలు ఎవరికి దక్కుతాయన్న చర్చ టీఆర్ఎస్ లో నడుస్తోంది. గత కేబినెట్ లో పనిచేసి, గెలిచిన వారందరికీ ఈసారీ కేసీఆర్ అవకాశమిస్తారంటున్నారు. నిబంధనల ప్రకారం మరో 16 మందికి మంత్రివర్గంలో చోటు కల్పించేందుకు వీలుంది. ఓటమి పాలయిన ఐదుగురి ప్లేస్ లను గులాబీ బాస్ ఎవరితో భర్తీ చేస్తారన్నది సస్పెన్స్ గా ఉంది.

సింగిరెడ్డికి ఛాన్స్....?

అన్నివర్గాలకూ ఈసారి మంత్రివర్గంలో చోటు ఉంటుందని కేసీఆర్ ఇప్పటికే చెప్పేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో అత్యధికంగా 13 స్థానాలు టీఆర్ఎస్ కు దక్కాయి. ఇక్కడ లక్ష్మారెడ్డి ఎలాగూ ఉండనే ఉండరు. ఉద్యమకాలం నుంచి తనతో పనిచేసిన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని కూడా కేబినెట్ లోకి తీసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక స్పీకర్ గా ఈటల రాజేందర్ పేరును నిశితంగా కేసీఆర్ పరిశీలనలోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. మధుసూదనాచారి ఓటమి పాలు కావడంతో సీనియర్ నేత స్పీకర్ గా ఉండాలని, అందుకు ఈటల సరైన వ్యక్తి అని కేసీఆర్ డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో ఉపముఖ్యమంత్రిగా పనిచేసిన కడియం శ్రీహరిని ఎంపీ అభ్యర్థిగా నిర్ణయిస్తే ఆ స్థానంలో అదే సామాజికవర్గానికి చెందిన మరొకరిని కేబినెట్ లోకి తీసుకుంటారని సమాచారం.

స్పీకర్ గా ఈటల...?

ఈటలకు స్పీకర్ పదవి ఇస్తే కరీంనగర్ జిల్లాలో కేటీఆర్ తో పాటు మరో బీసీ నేతకు కేబినెట్ లో చోటు కల్పించే వీలుటుంది. ఇక మెదక్ జిల్లానుంచి గెలిచిన పద్మాదేవేందర్ రెడ్డికి ఈసారి కేబినెట్ లో ఖచ్చితంగా బెర్త్ ఖాయమయిపోయిందంటున్నారు. మహళ కోటాలో ఆమెకే ఛాన్సు ఉందంటున్నారు. జూపల్లి కృష్ణారావు ఓటమి పాలుకావడంతో అదే సామాజిక వర్గానికి చెందిన ఎర్రబెల్లి దయాకర్ రావుకు స్థానం కల్పించనున్నారు. ఎర్రబెల్లి ఎమ్మెల్యేగా సీనియర్ కావడం ఆయనకు కలసి వచ్చింది. అలాగే మరో సీనియర్ నేత రెడ్యానాయక్ కూడా మంత్రివర్గంలోచోటు దక్కే అవకాశముంది. మొత్తం మీద కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇప్పటికే మంత్రి వర్గకూర్పుపై ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో దీనిపై తుదినిర్ణయం తీసుకోనున్నారు.

Similar News