సింధియా....కాస్త ఆగు....!!

Update: 2018-12-13 17:30 GMT

మధ్యప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా అనుభవానికే అవకాశమివ్వనున్నారు రాహుల్ గాంధీ. ఇప్పటికే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ రాజీనామా చేశారు. మధ్యప్రదేశ్ లో బీజేపీ, కాంగ్రెస్ బలాబలాలు దాదాపు దగ్గరగా ఉండటంతో బీఎస్పీ అధినేత్రి, మాయావతి స్వతంత్ర అభ్యర్ధుల మద్దతుతో సర్కార్ ను ఏర్పాుటు చేయబోతున్నారు. అంతా కలపి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి 121 మంది సభ్యుల మద్దతు ఉంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు హస్తం పార్టీ రెడీ అయిపోయంది.

డిగ్గీ మద్దతు కూడా.....

అయితే ముఖ్యమంత్రిగా ఎవరిని నియమించాలన్న దానిపై రాహుల్ గాంధీ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారు. రాహుల్ గాంధీ నిర్ణయానికే శాసనసభ పక్షం వదలిపెట్టినా ఆయన కార్యకర్తల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ఇది పైకి నామమాత్రంగానే కన్పిస్తున్నా ఎక్కువగా కమల్ నాధ్ కే అవకాశాలు స్పష్టంగా ఫలితాలు వచ్చినప్పటి నుంచి కన్పిస్తున్నాయి. కమల్ నాధ్ కు దిగ్విజయ్ సింగ్ మద్దతు పలకడం కూడా ఇందుకు కారణం అని చెప్పాలి.

మనసులో బలంగా ఉన్నా.....

రాహుల్ మనసులో మాత్రం జ్యోతిరాదిత్య సింధియాకే పగ్గాలు అప్పగించాలని ఉన్నా ఫలితాలను చూసిన తర్వాత వెనక్కు తగ్గినట్లు చెబుతున్నారు. అరకొర సీట్లతో సుస్థిరంగా పాలన అందించాలంటే అనుభవమున్న నేత కమల్ నాధ్ కే ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించాలన్నది కాంగ్రెస్ లోని సీనియర్ల అభిప్రాయం కూడా. సోనియా గాంధీ సయితం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో కమల్ నాధ్ కు మార్గం సుగమమం అయింది.

లోక్ సభ ఎన్నికల అనంతరం.......

అయితే జ్యోతిరాదిత్య సింధియా గత ఐదేళ్లుగా అక్కడే ఉండి పార్టీ కోసం శ్రమించారు. సింధియాకు అన్యాయం జరగదని ఆయన సన్నిహితులు గట్టిగా చెబుతున్నారు. లోక్ సభ ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రిగా జ్యోతిరాదిత్య సింధియాను రాహుల్ తప్పక కూర్చోబెడతారన్న విశ్వాసాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో కూడా మెజారిటీ స్థానాలను సాధించే బాధ్యతను రాహుల్ గాంధీ కమల్ నాధ్ కు అప్పగించనున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వస్తే కమల్ నాధ్ ను కేంద్రమంత్రివర్గంలోకి తీసుకుని సింధియాకు రాష్ట్ర పగ్గాలు అప్పగించాలన్న యోచనలో రాహుల్ ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తం మీద మధ్యప్రదేశ్ లో అనుభవానికే రాహుల్ జై కొట్టారు. పీసీసీ చీఫ్ గా ఉండటం కమల్ నాధ్ కు ఇక్కడ కలసి వచ్చింది.

Similar News