జంపింగ్ లు భయపడుతున్నారా...?

Update: 2018-12-13 02:30 GMT

గాలి వీస్తే...వారు లేదు..వీరు లేదు.. ఎవరినైనా గెలపిస్తారు...ఎంత పోటుగాడనని ఫోజులకు పోయినా పంపిస్తారు. తెలంగాణ ఎన్నికల్లో ఇది ఒక నీతి సూత్రంగా చెప్పుకోవాలి. రెండు తెలుగురాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ఇతర పార్టీల నుంచి ఫిరాయింపులను ఇద్దరు ముఖ్యమంత్రులు పోటీ పడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో అక్కడి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకున్నారు. వారిలో నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు.తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చేరికలను ప్రోత్సహించారు. తనకు స్పష్టమైన మెజారిటీ ఉన్నా ఇతర పార్టీలకు చెందిన 25 మందికి గులాబీ కండువా కప్పశారు. ఆయన కూడా తలసాని వంటి వారికి మంత్రి పదవి ఇచ్చారు. ఇద్దరు ముఖ్యమంత్రులు పోటీ పడి పొలిటకల్ కంపల్షన్ పేరుతో రాజ్యాంగ నిబంధలకూ తూట్లు పొడిచారు.

తెలంగాణాలో ఆదరించినా....

కాని వివిధ పార్టీల నుంచి జంప్ చేసిన వారికి ఎక్కడో భయం ఉంది. గత ఎన్నికలలో ఒక గుర్తు మీద పోటీ చేసి పార్టీ మారితే ప్రజలు ఆదరిస్తారో లేదో అన్న అనుమానం వారికి బలంగా ఉంది. కేసీఆర్ కూడా తనను నమ్మివచ్చిన వారందరికీ టిక్కెట్లు ఇచ్చారు. కొందరిపై తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిసినా కేసీఆర్ ఏమాత్రం లెక్క చేయలేదు. తెలంగాణలో వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ, బీఎస్పీల నుంచి చేరిన 25 మందిలో ఓటమి పాలయింది కేవలం ఆరుగురు మాత్రమే. వారు కూడా వివిధ కారణాలతో ఓటమి పాలయ్యారు. స్థానిక క్యాడర్ వారికి సహకరించకపోవడం వల్లనే ఆ ఆరుగురు ఓటమి చెందారని టీఆర్ఎస్ లెక్కలు వేసింది.అయితే తాజాగా జరిగిన తెలంగాణ ఎన్నికల్లో జంప్ చేసిన వారిలో తీగల కృష్ణారెడ్డి, కోరం కనకయ్య, తాటి వెంకటేశ్వర్లు, మదన్ లాల్, పాయం వెంకటేశ్వర్లు,రేవంత్ రెడ్డి లు ఓటమి పాలయ్యారు. రేవంత్ రెడ్డి ఒక్కరే టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి మారారు.

వ్యతిరేకత...సహాయ నిరాకరణ....

వీరి ఓటమికి ప్రధాన కారణం వారిపై ఉన్న తీవ్ర వ్యతిరేకతకు తోడు పార్టీ క్యాడర్ కలుపుకుని వెళ్లలేదన్న అభిప్రాయానికి టీఆర్ఎస్ వచ్చింది. ఇతర పార్టీల నుంచి తమతో వచ్చిన క్యాడర్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల గులాబీ పార్టీ శ్రేణులు పనిచేయలదన్న నిర్ణయానికి వచ్చారు. ఇందులో అభ్యర్థుల తప్పు ఎక్కువగా ఉందని విశ్లేషిస్తున్నారు. నేతలను సమన్వయం చేసుకోవడంలో వారు విఫలమయ్యారని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభిప్రాయపడ్డారు. అధికార పార్టీలో చేరిన తర్వాత నిధులు నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో వెచ్చించినా ఫలితం కన్పించ లేదు. దీంతో ఓటమిపాలయిన వారికి ఆల్టర్నేటివ్ గా ఏదో ఒకటి చూస్తామని కేసీఆర్ భరోసా ఇస్తున్నారు.

ఏపీ జంపింగ్ ల్లో...

జంపింగ్ ల్లో చాలామంది గెలవడంతో ఏపీలోనూ వారిలో ఉత్సాహం కన్పిస్తోంది. తాము కూడా గెలుస్తామన్న ధీమాను వారు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏపీలో కూడా తెలంగాణాలో ఓటమి పాలయిన వారి పరిస్థితే ఉందన్నది వాస్తవం. పార్టీ మారి వచ్చిన ఎమ్మెల్యేలను ఆ నియోజకవర్గంలోని టీడీపీ నేతలు పట్టించుకోవడం లేదు. అప్పటికే ఇన్ ఛార్జిగా ఉన్న వారు వారిని మనస్ఫూర్తిగా స్వాగతం పలకలేకపోతున్నారు. ఏపీలో వైసీపీ నుంచి వచ్చి టీడీపీలో చేరిన 23 నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇన్ ఛార్జులకు, వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు తలెత్తడంతో వారి పంచాయతీలు తీర్చలేక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తంటాలు పడుతున్నారు. ఈ 23 పెద్ద ఫిగర్. తెలంగాణలో జరిగినట్లుగానే ఇక్కడ టీడీపి నేతలు సహకరించకపోతే భారీ నష్టం తప్పదన్న ఆందోళనలో పార్టీ మారిన నేతలున్నారు. టీడీపీ అగ్రనాయకత్వం కూడా దీన్ని అంగీకరిస్తుంది. మరి చంద్రబాబు ఈసమస్యను ఎలా పరిష్కరించగలుగుతారో చూడాలి.

Similar News