జేసీ మళ్లీ కెలుకుతున్నారే....!!!

Update: 2018-12-10 05:00 GMT

జేసీ దివాకర్ రెడ్డి కాలు దువ్వడం మానడం లేదు. ఆయన అనుకున్నది సాధించేంత వరకూ నిద్రపోయేటట్లు లేదు. ఇది పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా మొండిగా ముందుకు వెళ్లేందుకే జేసీ సిద్ధమయ్యారనిపిస్తోంది. అనంతపురం నగరంలో రోడ్ల విస్తరణ కార్యక్రమాన్ని చేపట్టి తీరుతానని జేసీ ప్రకటించారు. నగరంలోని తిలక్ రోడ్డు, గాంధీ బజార్ రోడ్లు జనవరి నెలలో విస్తరిస్తామని ఆయన మరోసారి కుండబద్దలు కొట్టారు. నగరాన్ని అందంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని జేసీ దివాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు. సంక్రాంతి పండగ తర్వాత నగరంలోని రహదారుల విస్తరణ కార్యక్రమం ప్రారంభమవుతుందని జేసీ ప్రకటించి మరోసారి వివాదానికి కారణమయ్యారు.

విస్తరణ ఉంటుందని ప్రకటించి....

నగరంలో రోడ్ల విస్తరణకు స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి సుముఖంగా లేరు. ఆయన కొంతకాలంగా నగరంలో రహదారుల విస్తరణను అడ్డుకుంటున్నారు. దీనివల్ల భవనాలు నష్టపోయే బాధితులు, వ్యాపారుల నుంచి తనకు రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయని ఆయన భయపడుతున్నారు. అందుకే ఆయన వారికి అండగా నిలబడ్డారు. నిజానికి అనంతపురంలో రోడ్ల విస్తరణ కార్యక్రమం ఎప్పుడో జరగాల్సి ఉంది. కానీ ప్రభాకర్ చౌదరి అడ్డుపుల్ల వేయడం వల్లనే విస్తరణ చేపట్టలేకపోయామని గతంలో జేసీ దివాకర్ రెడ్డి బహిరంగంగా వ్యాఖ్యానించారు కూడా.

వీరి మధ్య చిచ్చు పెట్టింది.....

రహదారుల విస్తరణే వీరిమధ్య చిచ్చుపెట్టిందనే చెప్పాలి. అయితే జేసీ దివాకర్ రెడ్డి పట్టు బట్టి మరీ రహదారుల విస్తరణకు పూనుకున్నారు. టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా రహదారి విస్తరణలకు అనుకూలం కావడంతో జేసీ పని సులువయింది. రోడ్లు విస్తరణకు ఆయన దగ్గరుండి నోటిఫికేషన్ ఇప్పించారు. అయితే ఇప్పటి వరకూ విస్తరణ జరగలేదు. రహదారుల విస్తరణపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని స్వయంగా కలిసి ప్రభాకర్ చౌదరి తన గోడును వెళ్లబోసుకున్నారు. దీంతో ఈ విస్తరణ వాయిదా పడుతూ వస్తోంది. చంద్రబాబు కూడా ఈ విస్తరణపై పెద్దగా దృష్టి పెట్టలేదు.

ఎన్నికల వేళ......

అయితే మళ్లీ జేసీ కెలకడంతో మరోసారి టీడీపీలో విభేదాలు తీవ్రమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. సంక్రాంతి పండగ తర్వాత జనవరి 19వ తేదీ తర్వాత ఎప్పుడైనా విస్తరణ మొదలవుతుందని జేసీ దివాకర్ రెడ్డి ప్రకటించడంతో ప్రభాకర్ చౌదరి వర్గం మండిపడుతోంది. జేసీ దివాకర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించాడు. తన కుమారుడు పవన్ రెడ్డిని బరిలోకి దించుతానని ప్రకటించారు కూడా. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేతో పెట్టుకోవడం మంచిదా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఏది ఏమైనా మరోసారి జేసీ దివాకర్ రెడ్డి విస్తరణ చేయడానికి రంగంలోకి దిగడంతో ప్రభాకర్ చౌదరి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఎన్నికలు సమీపస్తున్న సమయంలో రహదారి విస్తరణ మంచిది కాదని ప్రభాకర్ చౌదరి అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Similar News