ఆ రెండు చోట్ల పవన్‌ ఎఫెక్ట్‌ ఆ పార్టీకేనా..?

Update: 2018-12-24 08:00 GMT

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఉన్న 175 నియోజకవర్గాల్లో ప్రభావం చూపకపోయినా కొన్ని ఏరియాల్లో మాత్రం తన సామాజికవర్గ ఓట్లు పరంగా బలమైన ప్రభావం చూపడం ఖాయంగా కనిపిస్తోంది. జనసేనకు ఇప్పటికీ సంస్థాగతంగా బలం లేకపోయినా, ఎన్నికల టైమ్‌ దగ్గర పడుతున్నా, ఆ పార్టీ నుంచి పోటీ చేసేందుకు బలమైన ఆశావాహులు ముందుకు రాక‌పోయినా కొన్ని ప్రాంతాల్లో మాత్రం జనసేన ప్రభావం చాలా స్ట్రాంగ్‌గానే ఉండేలా కనిపిస్తోంది. ఏపీలో ఉన్న 13 జిల్లాల్లో జనసేన ప్రభావం పెద్ద జిల్లా అయిన తూర్పుగోదావరిలో స్పష్టంగా కనిపిస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో పవన్‌ సామాజికవర్గం ఓటర్లు ఎక్కువ. ఈ సామాజికవర్గం ఓటర్లు ఈ జిల్లాలో 9 నుంచి 10 నియోజకవర్గాల్లో గెలుపు, ఓటమిలను నిర్ణయించనున్నారు. ఇంకా చెప్పాలంటే కాకినాడ లోక్‌సభ సెగ్మెంట్‌లోని అన్ని స్థానాలతో పాటు కోనసీమలోనూ ఈ వర్గం బలంగా ఉంది.

పవన్ పర్యటనలో....

అలాగే రాయలసీమలో బలిజసామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్న చిత్తూరు జిల్లాలోని ఒకటి రెండు సెగ్మెంట్లతో పాటు అనంతపురం జిల్లాల్లో ఐదారు సెగ్మెంట్లలో సైతం కాపు, బలిజ సామాజికవర్గం ఓట్లను చీల్చేందుకు జనసేన కాపు, బలిజ సామాజికవర్గ ఓటర్లే టార్గెట్‌గా జనసేన విశ్వప్రయత్నాలు చేస్తుంది. ఇటీవల ఆరు రోజుల పర్యటనకు అనంతపురం జిల్లాకు వెళ్లిన పవన్‌కళ్యాణ్‌ అక్కడ కరువు రైతు కవాతు నిర్వహించారు. ఈ కవాతుకు బలిజ సామాజికవర్గానికి చెందిన వాళ్లే ఎక్కువగా హాజరు అయ్యారు. జిల్లాలో అనంతపురం, పుటపర్తి, ధర్మవరం, హిందూపురం, రాయదుర్గం, కదిరి, తాడిపత్రి, గుంతకల్లు నియోజకవర్గాల్లో బలిజ ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. పవన్‌ కళ్యాణ్‌ ఈ జిల్లాకు వచ్చినప్పుడు ఆ పార్టీకి ఇక్కడ పెద్ద నాయకులు లేకపోయినా బలిజ సామాజికవర్గానికి చెందిన కొందరు ద్వితీయ శ్రేణి నేతలే పవన్‌ పర్యాటన ఏర్పాటుల్లో కీలకం అయ్యారు.

చిత్తూరు జిల్లాలోనూ....

ఇదే క్రమంలో పవన్‌ కళ్యాణ్‌ ప్రశంగం సైతం టీడీపీ కుంభస్థ‌లాన్ని కొట్టాలని సైతం మాట్లాడారు. అదే విధంగా చిత్తూరు జిల్లాల్లో చిత్తూరు, తిరుపతి, మద‌నపల్లితో పాటు కొన్ని నియోజకవర్గాల్లో బలిజలు ఎక్కువ సంఖ్యలో విస్తరించి ఉన్నారు. సీమలో బలిజలు ముందునుంచి మెజారిటీ వర్గం టీడీపీ వైపే ఉంటున్నారు. సీమలో రెడ్డి సామాజికవర్గంలో మెజారిటీ వర్గం సహజంగానే వైసీపీ వైపు మొగ్గు చూపుతోంది. ఇప్పుడు బలిజల్లో చీలిక వచ్చి వీరిలో మెజారిటీ వర్గం ఓటర్లు జనసేన వైపు టర్న్‌ అయితే సీమ వరకు జనసేన ఎఫెక్ట్‌ ఎక్కువగా టీడీపీ వైపే ఉండేలా కనిపిస్తోంది. అలాగే ఏపీలో అతి పెద్ద జిల్లా అయిన తూర్పుగోదావరిలో సైతం 10 నియోజకవర్గాల్లో జనసేన ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.

అన్ని సామాజికవర్గాలకు...

వాస్తవంగా ఇప్పటి వరకు చూస్తే జనసేనకు ఎక్కువ బలమైన నాయకులు ఉన్న జిల్లా ఏదంటే తూర్పుగోదావరి జిల్లానే. పవన్‌ కళ్యాణ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లాలోనే తొలి సీటును సైతం ప్రకటించారు. ముమ్మడివరం నుంచి పితాని బలకృష్ణ జనసేన తొలి అభ్యర్థిగా ఖ‌రారు అయిన సంగతి తెలిసిందే. కోనసీమలో బీసీల్లో బలమైన వర్గాలతో పాటు కాపులు సైతం ఇప్పటి వరకు తెలుగుదేశం వైపు మొగ్గు చూపుతూ వస్తున్నారు. దీనికి తోడు తెలుగుదేశం పార్టీ రాజమండ్రి పరిధిలో క‌మ్మ‌ సామాజికవర్గానికి 3 సీట్లు, కాకినాడ, అమ‌లాపురం డివిజన్ల‌ పరిధిలో కాపులకు, బీసీలకు సీట్లు ఇచ్చే విషయంలో సమప్రాధాన్యత పాటిస్తు వస్తోంది. తూర్పులో బీసీలు, కాపుల్లో మెజారిటీ వర్గం ఇప్పటి వరకు ఎక్కువగా టీడీపీకి వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తోంది.

టీడీపీకి దెబ్బేస్తారా?

అదే టైమ్‌లో కాపుల్లో కొంత మంది వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు కాపుల ఓట్లను జనసేన కొంత‌వ‌ర‌కు చీల్చుతుంది. జనసేన చీల్చగా మిగిలిన కాపు వర్గం ఓటర్లు మాత్రమే టీడీపీ, వైసీపీ పంచుకోవాల్సి ఉంటుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే బీసీల మొగ్గు టీడీపీ వైపు అంత లేదంటున్నారు. తూర్పుగోదావరిలో జనసేన ఎఫెక్ట్‌ టీడీపీకి ఎక్కువగా ఉండేలా కనిపిస్తోంది. ఇప్పుడున్న అంచనాల ప్రకారం చూస్తే టీడీపీ తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని నియోజకవర్గాలతోనే సరిపెట్టుకోవచ్చని కూడా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏదేమైన ఓవర్‌ఆల్‌గా పవన్‌కళ్యాణ్‌ జనసేన పార్టీ ఎన్ని సీట్లలో విజయం సాధిస్తోంది అని చెప్పడం కన్నా కొన్ని ప్రాంతాల బట్టీ కొన్ని చోట్ల టీడీపీకి, మరికొన్ని చోట్ల వైసీపీకి దెబ్బేసేలా కనిపిస్తోంది.

Similar News