కూటమికి మరో షాక్ తప్పదా...?

Update: 2018-12-14 06:30 GMT

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. తెలంగాణ ఇచ్చి కూడా గత ఎన్నికల్లో ఓడిపోయిన ఆ పార్టీ ఈ ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధిస్తామని నమ్మింది. ఇందుకోసం అనేక వ్యూహాలు అనుసరించి, అన్ని అస్త్రాలను ప్రయోగించింది. అయితే, టీఆర్ఎస్ కు అనుకూలంగా వచ్చిన నిశబ్ధ విప్లవం ముందు కాంగ్రెస్ వ్యూహాలు, ప్రయత్నాలన్నీ పటాపంచలయ్యాయి. ఏకపక్షంగా తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పులో కాంగ్రెస్ నామమాత్రంగా మిగిలిపోయింది. 99 స్థానాల్లో పోటీ చేసిన కేవలం 19 స్థానాల్లో గెలిచింది. అక్కడ కూడా టీఆర్ఎస్ అభ్యర్థులపై ఉన్న వ్యతిరేకత, కాంగ్రెస్ అభ్యర్థుల వ్యక్తిగత బలం, స్థానిక పరిస్థితులే ఎక్కువగా కలిసి వచ్చాయి. అయితే, త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి మరో పరీక్ష ఎదురుకాబోతోంది. నాలుగైదు నెలల్లో లోక్ సభ ఎన్నికలు రానున్నాయి. ఓ వైపు రాష్ట్రంలో అధికారం దక్కించుకోని కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ వంటి బలమైన నెతను ఎదుర్కొని నిలదొక్కుకోవాలంటే కచ్చితంగా లోక్ సభ ఎన్నికల్లో సత్తా చూపించాలి.

ఇదే పరిస్థితి ఉంటే ....

అయితే, మొన్నటి అసెంబ్లీ ఎన్నికలను బట్టి చూస్తే కాంగ్రెస్ కి లోక్ సభ ఎన్నికల్లోనూ ఎదురుదెబ్బ తప్పేలా లేదు. ఒక్క ఖమ్మం జిల్లా మినహా రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ హవా వీచింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఓట్లను పరిగణలోకి తీసుకుంటే టీఆర్ఎస్ సుమారు 16 సీట్లు సులువుగా సాధించే అవకాశం ఉంది. అప్పటికీ ఇదే పరిస్థితి ఉంటే కాంగ్రెస్ కేవలం మహబూబాబాద్, ఖమ్మం స్థానాల్లోనే విజయం సాధించవచ్చు. ఇక భువనగిరి, నల్గొండ పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ కే ఎక్కువ ఓట్లు వచ్చినా కష్టపడితే కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంటుంది. అయితే, ఇప్పుడున్న పరిస్థితి నాలుగు నెలల తర్వాత ఉండే అవకాశం లేదు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ కి మొగ్గు పెరగవచ్చు. పైగా కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో క్రీయాశీలం అవుదామంటూ కొత్త నినాదం ఎత్తుకున్నారు. ఇందుకు గానూ అన్ని ఎంపీ స్థానాలనూ గెలిపించాలని ఇప్పటి నుంచే పిలుపునిస్తున్నారు. ఆయన వాదన ఫలిస్తే ఇప్పుడున్న అవకాశం కూడా కాంగ్రెస్ కు ఉండదు.

సీనియర్లే బరిలో ఉంటారా..?

అదే సమయంలో కాంగ్రెస్ కు కొంత సానుకూలత కూడా ఉండే అవకాశం ఉంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజల్లో గుర్తింపు ఉండటంతో.. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కి ఓటేశాం కదా... పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఓటేద్దాం అనే ఆలోచన కూడా ప్రజల్లో రావొచ్చు. అయితే, కాంగ్రెస్ శ్రేణులు మాత్రం ఇటీవలి ఓటమితో తీవ్ర నైరాశ్యంలో ఉన్నాయి. ఆ పార్టీ అగ్రనేతలే ఓడిపోవడం, టీఆర్ఎస్ అభ్యర్థులకు భారీ మెజారిటీలు రావడంతో ఎంత కష్టపడ్డా ఇంతేనా అన్న ఒక నైరాశ్యం కాంగ్రెస్ క్యాడర్ లో ఏర్పడింది. ఇది దూరమై లోక్ సభ ఎన్నికల నాటికి బలోపేతం కావాలంటే చాలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ప్రతీకారేచ్ఛతో ఉన్న కొందరు కాంగ్రెస్ సీనియర్లు ఎంపీ ఎన్నికల్లో బరిలో ఉండాలని భావిస్తున్నారట. ఎట్టి పరిస్థితుల్లో లోక్ సభ బరిలో నిలిచి టీఆర్ఎస్ ను దెబ్బకు దెబ్బ తీయాలని వ్యూహాలు పన్నుతున్నారు. ముఖ్యంగా నల్గొండ జిల్లాలోని రెండు స్థానాల్లో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి భావిస్తున్నారని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి కూడా ఇదేదిశగా ఆలోచిస్తున్నారట. కానీ, కచ్చితంగా టీఆర్ఎస్ గెలుస్తుందనుకున్న స్థానాల్లో కాంగ్రెస్ నుంచి పోటీకి ఎవరూ ముందుకు వచ్చే అవకాశం లేదు. మొత్తానికి ఇప్పటికే దెబ్బ మీద దెబ్బలు తగిలిన కాంగ్రెస్ నాలుగు నెలల్లోనే ఏ మేర కోలుకుంటుందో చూడాలి.

Similar News