ప్రయోగం వికటించినా...ఏపీలోనూ ...?

Update: 2018-12-12 12:30 GMT

ఏపీ విభజనను ఎంతో సాహసంతో వన్ సైడ్ గా చేసింది కాంగ్రెస్ పార్టీ. విభజన ద్వారా ఏపీలో అధికారంలోకి రాకపోయినా కనీసం తెలంగాణ లో జండా ఎగురవేయాలని భావించిన హస్తం పార్టీ వ్యూహం బెడిసి కొట్టింది. ముందు 2014 లో కొత్తరాష్ట్రం గా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో ఒక్కసీటు దక్కించుకోలేదు కాంగ్రెస్. ఇక తెలంగాణ లో అధికారం లోకి వస్తుంది అనుకున్న చోట కూడా బొక్కబోర్లా పడింది కాంగ్రెస్. తెలంగాణ ఇచ్చింది తామే తెచ్చింది తామే అని చెప్పుకోవడంలో విఫలం అయ్యామని ఓటమి తరువాత హస్తానికి అర్ధం అయ్యింది. ఆ లోటు తెలంగాణ లో ముందస్తు ఎన్నికల్లో తీర్చుకుందామని విశ్వ ప్రయత్నం చేసింది కాంగ్రెస్.

కూటమి కట్టినా ...?

మహా కూటమి, ప్రజకూటమి అంటూ తమ బద్ద విరోధి టిడిపి, సిపిఐ, తెలంగాణ జనసమితి లను కలుపుకుని మరీ గులాబీ కు సవాల్ విసిరింది. మహా మహులు అంతా కలిశారు ఇక టీఆర్ఎస్ పని అయిపోతుందని లెక్కకట్టింది కాంగ్రెస్. తెలుగుదేశం పార్టీ తో జత కలిస్తే ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ లో తిరిగి నిలబడాలని వ్యూహం రూపొందించి తొలిఫేజ్ అమల్లో పెట్టింది. అయితే వారి ప్రయత్నం విఫలం అయ్యింది. అదికూడా గతంలో ఎన్నడూ లేని విధంగా పరాజయం తెలంగాణ లో ఎదురు కావడంతో బాబుతో దోస్తీ వికటించిందని తేలిపోయింది.

ఇప్పుడు ఏపీ వంతు ....

కాంగ్రెస్ టిడిపి దోస్తీ తో ఏపీలో ఎన్నికలను ఎదుర్కోవడానికి మిత్రులు సిద్ధం అవుతున్నారు. అయితే టి ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాలు ఏపీలో కూడా తప్పక పోవచ్చన్నది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పార్టీ అవసరాల రీత్యా బాబు సిద్ధం అయ్యి కాంగ్రెస్ తో ముందుకు వెళుతున్నా క్యాడర్ మాత్రం హస్తంతో దోస్తీని అంతర్గతంగా వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో సైతం ఓట్ల బదిలీ ఇరుపార్టీల్లో జరగనందునే మహాకూటమి ఘోరపరాజయం మూటగట్టుకుందన్న అంచనాలు విశ్లేషకులు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ అటు తెలంగాణ లోను ఇటు ఏపీలోనూ బాబును నమ్మి రెంటికి చెడ్డ రేవడిగా మారేలా ఉంటుందని ఇప్పుడే హెచ్చరిస్తున్నారు. మరి తాజా ఓటమినుంచి కాంగ్రెస్ ఎలాంటి గుణపాఠాలు నేర్చుకుంటుందో చూడాలి

Similar News