డిఫీట్ తర్వాత మరో ఫీట్...!!

Update: 2018-12-18 02:30 GMT

దారుణమైన ఓటమి... ఘోర పరాజయం...ప్రజల తిరస్కరణ... ఈ పదాలేవీ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు సరిపోవు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి కూడా రెండు సార్లు అధికారాన్ని దక్కించుకోలేకపోయిన నేతలను పార్టీ అధిష్టానం ఏం చర్యలు తీసుకుంటుందో తెలియదు కాని, వారికి మాత్రం ఓటమి పట్ల ఏ కోశానా బాధ లేదనట్లే కన్పిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం ఓటమికి అనేకరకాలు కుంటిసాకులు చెబుతుండటమే దీనికి కారణం. ఓటర్లను తొలగించారని, ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారంటూ కాంగ్రెస్ అగ్రనేతలు చెప్పుకొస్తుండటం ఆ పార్టీలోని మిగిలిన నేతలకే చిర్రొత్తుకొస్తుంది.

సీఎల్పీ పదవి కోసం.....

అయితే ఓటమి బాధ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు సీఎల్పీ పదవి కోసం ఫైటింగ్ కు దిగుతున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే దారుణమైన ఓటమి కావడంతో టెన్ జన్ పథ్ కు ఫేస్ చూపించలేని పరిస్థితి కొందరిది. ఇందులో ప్రధానంగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్కలు ఉన్నారు. ఎన్నికలకు ముందు, పోలింగ్ తర్వాత కూడా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి గెలుపు మనదేనన్న నివేదికలు ఇచ్చి, ఫలితాల తర్వాత కంగు తిన్నారు. రాహుల్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఢిల్లీ వెళ్లడమే మానుకున్నారు.

సీనియర్లందరూ పోటీలో...

ఇక ఇప్పుడు కొత్త చిక్కు వచ్చిపడింది. సీఎల్పీ నేతగా ఎవరిని ఎంపిక చేయాలన్నది. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ పదవిని ఆశిస్తున్నారని తెలియడంతో ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. రాష్ట్రంలో పార్టీ ఘోరఓటమికి కారణమయిన ఉత్తమ్ కు ఆ పదవి ఎలా ఇస్తారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూటిగా ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమైన పదవులు అనుభవించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కలకు ఈ పదవి చేపట్టే అర్హత లేదని ఆయన కుండబద్దలు కొట్టేస్తుండటం గమనార్హం.

సబితకే అవకాశాలెక్కువా?

సీఎల్పీ పదవికి మాజీ మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సబితా ఇంద్రారెడ్డిలు పోటీ పడుతున్నారు. మహిళ కోటా కింద సబితా ఇంద్రారెడ్డికి సీఎల్పీపదవి ఇస్తే బాగుంటుందని, ఆమె అందరినీ కలుపుకుని వెళుతుందని కొందరు సీనియర్ నేతలు సూచిస్తున్నారు. అలాగే దుద్దిళ్ల శ్రీధర్ బాబుకూడా తన వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. తన అనుభవం, పార్టీ కమిట్ మెంట్ ను పరిశీలనలోకి తీసుకోవాలని ఆయన కోరుతున్నారు. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తనకు ఎంపీ, ఎమ్మెల్సీగా చేసిన అనుభవం ఉందని, తనకు సీఎల్పీనేతగా అవకాశమివ్వాలనికోరుతున్నారు. ఓటమినుంచి తేరుకున్న నేతలు ఇప్పుడు పదవుల కోసం పైరవీల బాట పట్టారు. అయతే అధిష్టానాన్ని నేరుగాఅడిగే సాహసం చేయలేక మధ్యవర్తులను ఆశ్రయిస్తుండటం గమనార్హం.

Similar News