లీడర్ లేకున్నా..రూలర్ గా మారి...!!

Update: 2018-12-11 18:29 GMT

ఛత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్ ప్రయోగం ఫలించింది. లీడరంటూ లేకపోయినా...ఓటు బ్యాంకును కాపాడుకోవడంతో కాంగ్రెస్ అక్కడ సక్సెస్ కాగలిగింది. దాదాపు పదిహేనేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న రమణ్ సింగ్ ను ఓడిండచం అంత తేలికకాదు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ అంటే రమణ్ సింగ్. రమణ్ సింగ్ అంటేనే భారతీయ జనతా పార్టీ. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూటమితో ఎన్నికలకు వెళ్లాలని తొలుత ప్రయత్నించింది. అయితే ఇక్కడ ఛత్తీస్ ఘడ్ జనతా కాంగ్రెస్, బహుజన్ సమాజ్ పార్టీతో కలిసి వెళ్లిపోయారు. దీంతో చిన్నా చితకా పార్టీలతో కలసి కాంగ్రెస్ ఇక్కడ పోటీకి దిగింది. అంటే ఒకరకంగా ఒంటరిగానే ఛత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్ పార్టీ బరిలోకి దిగిందని చెప్పాలి.

కంచుకోటగా ఉన్న రాష్ట్రంలో....

ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం కమలం పార్టీకి కంచుకోట. ఛత్తీస్ ఘడ్ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత జరిగిన ఎన్నికల నుంచి ఇక్కడ భారతీయ జనతా పార్టీనే విజయం వరిస్తూ వస్తోంది. మరోసారి గెలిచి రమణ్ సింగ్ చరిత్ర తిరగరాయాలనుకున్నారు. భారతీయ జనతా పార్టీ కూడా బాధ్యతలను పూర్తిగా రమణ్ సింగ్ భుజస్కంధాలపైనే పెట్టింది. రమణ్ సింగ్ కు ఛత్తీస్ ఘడ్ లో చావల్ బాబాగా పేరుంది. ఆయన ప్రవేశపెట్టిన పలు జనాకర్షక పథకాలు ఆయన విజయాలకు కారణమవుతూ వచ్చాయి. ఈసారి కూడా అదే నమ్మకంతో రమణ్ సింగ్ వెళ్లారు.

కాంగ్రెస్ కు పూర్తి ఆధిక్యత....

కాని పదిహేనేళ్ల పాటు రమణ్ సింగ్ ప్రభుత్వాన్ని చూసిన ప్రజలు ఈసారి కాంగ్రెస్ కు జైకొట్టారు. నిజానికి కాంగ్రెస్ లో సరైన నేత లేరనే చెప్పాలి. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి సీనియర్ నేతలు బీజేపీ గూటికి చేరిపోయారు. దీంతో కాంగ్రెస్ డీలా పడుతుందనుకున్నారంతా. అయితే పోయిన నేతల గురించి పట్టించుకోకుండా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి బలంగా కాంగ్రెస్ నేతలు తీసుకెళ్లగలిగారు. ఛత్తీస్ ఘడ్ పై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రత్యేక దృష్టి పెట్టి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలతాయేమోనన్న బెంగ ఉన్నా కాంగ్రెస్ మాత్రం పూర్తి విశ్వాసంతో ముందుకెళ్లింది.

జోగీ ఆశలు అడియాసే....

మాయావతికి చెందిన బీఎస్పీ, ఛత్తీస్ ఘడ్ జనతా కాంగ్రెస్ నేత అజిత్ జోగీలు కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీలుస్తారేమోనని భావించారు. ఒక దశలో ఛత్తీస్ ఘడ్ లో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందన్న ఊహాగానాలు చెలరేగాయి. హంగ్ వస్తే తానే కీలకం అవుతానని అజిత్ జోగి భావించారు. కానీ ప్రజలు అజిత్ జోగీ ఆశలను నెరవేర్చలేదు. పూర్తిగా అధికారాన్ని కాంగ్రెస్ పార్టీకే కట్టబెట్టారు. తొలి రౌండ్ నుంచి కాంగ్రెస్ కు అనుకూలంగా ఫలితాలు వచ్చిన రాష్ట్రం ఛత్తీస్ ఘడ్ కావడం విశేషం. మొత్తం మీద దాదాపు ఒకటిన్నర దశాబ్దం తర్వాత ఛత్తీస్ ఘడ్ లో తిరిగి కాంగ్రెస్ జెండా ఎగురనుంది.

Similar News